YSR Kadapa District: పుల్లరిన్.. దశ తిరిగెన్.. వెలికితీతకు కసరత్తు ముమ్మరం..
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: వైఎస్సార్ జిల్లా మంగంపేటలో దాదాపు మూడు దశాబ్దాలకు సరిపోయేలా ఉన్న బెరైటీస్ నిల్వల్లో దాగి ఉన్న ‘ఫుల్లరిన్’ అనే అత్యంత అరుదైన, విలువైన ఖనిజాన్ని వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇక్కడ పుల్లరిన్ ఖనిజం ఉన్నట్లు దాదాపు 20 ఏళ్ల కిందట తెలిసింది. అయితే దీన్ని వెలికితీసే పనిని గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుత వైఎస్ జగన్ ప్రభుత్వం దీనిపై దృష్టి సారించడంతో ఏపీఎండీసీ వెలికితీతకు ఉపక్రమించింది. ఇందుకోసం కేంద్రానికి చెందిన కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్–ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది.
మంగంపేటలో ఫుల్లరిన్ ఉన్నట్లు శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం మైన్స్ అండ్ జియాలజీ విభాగం ప్రొఫెసర్లు నిర్ధారించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దీన్ని వెలికితీయడం కష్టంతో కూడుకున్న పనిగా వారు అభిప్రాయపడ్డారు. వెయ్యి కిలోల బెరైటీస్ వ్యర్థాలను ప్రాసెసింగ్ చేస్తే ఒక కిలో ఫుల్లరిన్‌ను వెలికి తీసే అవకాశముందని వెల్లడించారు. ఉస్మానియా వర్సిటీలో పని చేసిన అధ్యాపకులు శ్రీధర్‌మూర్తి దీనిపై లోతైన అధ్యయనం కొనసాగించారు. 1,050 నమూనాలను సేకరించి అమెరికాలోని వివిధ ప్రయోగశాలల్లో పరీక్షించడం ద్వారా నిక్షేపాల తీరుతెన్నులను గుర్తించారు. దీనిపై జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా సర్వే చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది.
సన్నటి తీగతో కారునే వేలాడదీయొచ్చు..
ఫుల్లరిన్ కార్బన్ సమ్మిళిత పదార్థం. ఫుట్‌బాల్‌ను పోలిన గోళ, స్తూపాకారంలో ఉంటుంది. ఇందులో బక్మినిస్టర్, బకీబాల్స్, నానో ట్యూబ్స్, మెగా ట్యూబ్స్ తదితర రకాలున్నాయి. ఒక్కో నానో ట్యూబ్.. ఒకటి నుంచి ఏడు నానో మీటర్ల మందంలో కంటికి కనిపించనంత సన్నగా ఉంటుంది. ఒక నానో మీటరు అంటే ఒక వెంట్రుకలో 70 వేల వంతుకు సమానం. ఆ సన్నటి తీగ ఉక్కు రాడ్‌తో సమానం. అంతటి సన్నటి తీగతో మారుతి కారును సైతం వేలాడదీయొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని ప్రయోజనాలు అంచనాలకు అందనంతగా ఉన్నాయి. భావితరాలను శాసించే నానో టెక్నాలజీలో ఫుల్లరిన్ అత్యంత కీలకమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
‘రక్షణ వ్యవస్థ, ఫార్మా, సోలార్ ఎనర్జీ తదితర రంగాల్లో దీని వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో విమానాలు, స్పేస్ షటిల్స్ రక్షణకు దీన్ని పూతగా వినియోగిస్తారు. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల తయారీలోనూ ఉపయోగిస్తారు. సోలార్ పవర్ టెక్నాలజీ, ఇంధన వాహకాల తయారీ తదితరాలకు కూడా దీన్ని వినియోగిస్తున్నారు. బయో మెడిసిన్స్, కండక్టర్స్, సోలార్ సెల్స్, ఎలక్ట్రానిక్ బ్యాటరీలు, సింథటిక్ డైమండ్స్‌కు ఇది ఉపకరిస్తుంది’ అని వివరించారు.
ప్రయోజనాలు ఎన్నెన్నో..
ఫుల్లరిన్తో ఫార్మా రంగంలో లెక్కలేనన్ని ప్రయోజనాలున్నాయి. ఎయిడ్స్, క్యాన్సర్, పార్కిన్సన్, లుకేమియా, న్యూరోలాజికల్ రోగాల నుంచి ఉపశమనానికి, అల్ట్రా రేడియేషన్ వల్ల దెబ్బతిన్న చర్మ కణజాలం రక్షణకు ఇది ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మంగంపేట బెరైటీస్ గనుల చుట్టుపక్కల ఉన్న షంగైట్ స్టోన్స్ నుంచి ‘రష్యన్ షంగైట్ వాటర్’ తరహాలో నీళ్లను మార్చవచ్చని అనుభవజ్ఞులు చెపుతున్నారు. అత్యంత ప్రమాదకర రోగాల నుంచి బయటపడటానికి, అనారోగ్యం దరిచేరకుండా ఉండటానికి ఫుల్లరిన్ నీటిని తీసుకుంటే చాలంటున్నారు హైదరాబాద్‌లోని వక్కంటి కోటేశ్వరరావు. మూడు వేల మందికి పైగా తాను అందజేసిన నీటిని తాగి రోగాల నుంచి ఉపశమనం పొందారని వెల్లడించారు.
ఉక్కు కంటే 250 రెట్లు దృఢం
ఉక్కు కంటే 250 రెట్లు దృఢమైనది.. బంగారం కంటే 150 రెట్లు విలువైనది.. వజ్రం, ప్లాటినం కన్నా మెరుగైనది.. ‘ఫుల్లరిన్’. ప్రపంచంలోనే అత్యంత అరుదైన, విలువైన ఖనిజం ఫుల్లరిన్. అన్నమయ్య జిల్లా మంగంపేట గనుల్లో బయటపడింది. అంతరిక్ష ప్రయోగాల్లో, నానో టెక్నాలజీలో ఇది అత్యంత కీలకమని, సైన్స్‌కు లొంగని అరుదైన రోగాలకూ పరిష్కారం చూపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఫుల్లరిన్పై జరుగుతున్న పరిశోధనలతో అంతరిక్షం, రక్షణ, సోలార్ వ్యవస్థలతో పాటు విభిన్న రంగాల్లో పెనుమార్పులు వస్తాయని నిపుణులు భావిస్తున్నారు. ఫుల్లరిన్‌ను కనుగొన్న అమెరికా, బ్రిటన్లకు చెందిన పరిశోధకులు రాబర్ట్ కర్ల్, హరోల్డ్ క్రోటో, రిచర్డ్ స్మాల్లే లకు 1996లో నోబెల్ ప్రైజ్ దక్కింది. రష్యాకు చెందిన జార్జి చక్రవర్తులు తమ ఆరోగ్య పరిరక్షణకు ఫుల్లరిన్ కలిగిన బ్లాక్ షెల్ ముక్కను రాత్రి వేళ నీటిలో వేసుకుని ఉదయాన్నే తాగేవారని చరిత్రకారులు చెబుతున్నారు.
భారీగా ఖనిజ ఆదాయం
ప్రపంచంలోనే అత్యంత అరుదైన ఖనిజం పుల్లరిన్. సీఎం జగన్మోహన్రెడ్డి మార్గదర్శకాల మేరకు దానిని వెలికి తీసేందుకు మెరుగైన విధానాల కోసం ప్రఖ్యాత సంస్థలతో ఏపీఎండీసీ ఎంవోయూ చేసుకుంది. నానో టెక్నాలజి, రక్షణ వ్యవస్థ, ఫార్మా, సోలార్ ఎనర్జీ తదితర అనేక రంగాలకు ఉపయుక్తమైన పుల్లరిన్ అంతర్జాతీయ మార్కెట్లో ఒక గ్రాము 112 డాలర్ల ధర పలుకుతోంది. దీని ప్రకారం కిలో రూ.91 లక్షల పైచిలుకే. పుల్లరిన్ ద్వారా ఖనిజాభివద్ధి సంస్థకు తద్వారా రాష్ట్రానికి భారీగా ఆదాయం సమకూరుతుంది.
– విజి వెంకటరెడ్డి, ఎండీ, ఏపీఎండీసీ
చదవండి: ప్రమాదంలో తేనెటీగలు.. మానవాళి మనుగడకే ముప్పు!