కత్తితో ఉన్మాది దాడి | ex husband attack on wife | Sakshi
Sakshi News home page

కత్తితో ఉన్మాది దాడి

Published Thu, Dec 18 2014 2:08 AM | Last Updated on Fri, Jul 27 2018 2:18 PM

కత్తితో ఉన్మాది దాడి - Sakshi

కత్తితో ఉన్మాది దాడి

 తాడేపల్లిగూడెం రూరల్ : తన నుంచి విడాకులు తీసుకున్న భార్య రెండో పెళ్లి చేసుకుంటోందని తెలిసి ఉన్మాదిలా మారిన ఓ వ్యక్తి ఇద్దరు మహిళలు, తోడల్లుడు వరుసైన మరో వ్యక్తిపై కత్తితో దాడి చేయడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని ఇమ్మణ్ణి లక్ష్మీప్రసన్నకు భీమడోలు మండలం అంబర్‌పేటకు చెందిన అప్పసాని సునిల్‌తో గతంలో వివాహమైంది. భార్యభర్తలు గొడవలు పడటంతో విడాకులు తీసుకున్నారు. లక్ష్మీప్రసన్నకు తాడేపల్లిగూడెం మండలం నీలాద్రిపురం గ్రామానికి చెందిన నరిసింహంతో రెండో పెళ్లి కుదుర్చుకున్నారు. బుధవారం రాత్రి 12.30 గంటలకు ద్వారకాతిరుమలలో వివాహం చేసుకునేందుకు అందరూ సన్నద్ధమవుతున్నారు.
 
 రాత్రి 9 గంటలకు వీరంతా వాహనాల్లో ద్వారకాతిరుమల బయలుదేరేందుకు సిద్ధమవుతున్న సమయంలో లక్ష్మీప్రసన్న మాజీ భర్త సునిల్ గోడదూకి కత్తితో వచ్చి లక్ష్మీప్రసన్నపై దాడిచేశాడు. అక్కడే ఉన్న ప్రసన్న అక్క పాలడుగుల నాగసత్యదేవిపై కూడా కత్తితో దాడి చేసి గాయపరిచాడు. అలాగే లక్ష్మిప్రసన్నకు వరుసకు బావ అయిన కొండ్రుప్రోలు గ్రామానికి చెందిన ఉప్పలపాటి శేషగిరిరావు అడ్డువెళ్లగా అతని చెయ్యి నరికాడు. అడ్డువచ్చిన మరో మహిళపై కూడా దాడి చేసి పరారయ్యాడు. తీవ్రగాయాలైన వీరందరిని 108 వాహనంలో ఏరియా ఆసుపత్రికి తరలించారు. లక్ష్మీప్రసన్నకు, ఆమె అక్క నాగసత్యదేవికి తలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరికి ఏరియా ఆసుపత్రి వైద్యులు చికిత్సచేసి మెరుగైన చికిత్సకు సిఫారసు చేశారు. పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి బాధితుల నుంచి వివరాలు సేకరించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement