కేటుగాళ్లు వస్తున్నారు.. తస్మాత్‌ జాగ్రత్త | Examination of Panchayat Secretaries is Done Transparently Amaravati | Sakshi
Sakshi News home page

కేటుగాళ్లు వస్తున్నారు.. తస్మాత్‌ జాగ్రత్త

Published Fri, Aug 23 2019 8:39 AM | Last Updated on Fri, Aug 23 2019 8:40 AM

Examination of Panchayat Secretaries is Done Transparently Amaravati - Sakshi

గ్రామ సచివాలయంలో ఏ పోస్టు కావాలి.. పంచాయతీ సెక్రటరీ.. ఏఎన్‌ఎం ఏదీ కావాలన్నా ఇప్పిస్తాం.. మాకు రాష్ట్ర స్థాయిలో అధికారులు తెలుసు.. అధికార పార్టీ నాయకులతో ఎప్పుడూ  టచ్‌లో ఉంటాం.. అంటూ కేటుగాళ్లు నిరుద్యోగులకు ఎర వేస్తున్నారు. ఉద్యోగం గ్యారంటీ పేరుతో రూ. లక్షలు దండుకుంటున్నారు. అయితే ఇలాంటి వారితో తస్మాత్‌ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు అధికారులు. అక్రమాలు, అవకతవకలకు తావులేకుండా ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ కార్యక్రమం చేపడుతుందని.. ఇలాంటి మోసగాళ్ల బారిన పడి చేతులు కాల్చుకోవద్దని హితవు పలుకుతున్నారు.

సాక్షి, అమరావతి : అమాయక అభ్యర్థులను నిలువునా ముంచుతున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగం ఇప్పిస్తామని చెబుతూ లక్షలు వసూలు చేస్తున్నారు. జిల్లా, రాష్ట్ర ఉన్నతాధికారులు తెలుసని, అధికార పార్టీ నాయకుల అండ ఉందని చెప్పుకుంటూ అందిన కాడికి దోచుకుంటున్నారు. 

జిల్లాలో 11,025 పోస్టులు
జిల్లాలో 933 గ్రామ, 511 వార్డు సచివాలయాలలో 11,025 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటి కోసం 2,00,664 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఉదయం, మధ్యాహ్నం రెండు పూటల జరిగే పరీక్షలకు ఇప్పటికే 443 కేంద్రాలను ఏర్పాటు చేశారు. సెప్టెంబర్‌ 1, 3, 4, 6, 7, 8వ తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంత భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీ సాగుతుండటంతో గ్రామ, మండల స్థాయి నుంచే దళారులు రంగ ప్రవేశం చేశారు. ఉద్యోగానికి రూ. 4 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు బేరసారాలు సాగిస్తున్నారు. 

నమ్మితే మోసపోవడం తథ్యం
గత టీడీపీ ప్రభుత్వంలో వెలగపూడిలోని సచివాయలంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని టీడీపీ నాయకులు వసూళ్లకు తెరతీశారు. నకిలీ నియామక పత్రాలు అందజేసి రూ.లక్షల్లో దోచుకున్నారు. ఇందుకు సంబంధించి తుళ్లూరు పోలీస్‌ స్టేషన్‌లో పదుల సంఖ్యలో కేసులు నమోదైయయ్యాయి. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలకు పూర్తి విరుద్ధంగా.. పారదర్శకంగా పాలన అందిస్తామని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వేసే ప్రతి అడుగు పారదర్శకంగా, స్పష్టంగా ఉండనుంది. 

పరీక్షా కేంద్రాలపై ప్రత్యక్ష నిఘా
జిల్లాలోని ప్రతీ పరీక్ష కేంద్రాలపై అధికారులు నిఘా ఉంచనున్నారు. అలాగే కేంద్రంలోని ప్రతీ గదిలో వీలైనంత మేరకు సీసీ కెమెరాల ఏర్పాటు, లేకపోతే వీడియో గ్రాఫర్ల సహాయంలో అభ్యర్థుల పరీక్ష రాస్తున్న తీరును చిత్రీకరించనున్నారు. ఎక్కడా తప్పు జరగకుండా, అభ్యర్థులు నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఓఎంఆర్‌ షీట్లు భద్రపరిచే స్ట్రాంగ్‌ రూం వద్ద పటిష్ట భదత్ర ఏర్పాటు చేయనున్నారు. అభ్యర్థుల మెరిట్‌ ఆధారంగానే ఎంపిక జరగనుంది. ఇంత భారీ మొత్తంలో ఖాళీలను భర్తీ చేస్తుండడం దేశ చరిత్రలోనే రికార్డుగా నిలిచిపోతుందని ఇప్పటికే ప్రభుత్వం భావిస్తోంది. దీంతో పరీక్షలను పూర్తి పారదర్శకంగా నిర్వహించి, అర్హులైన అభ్యర్థులకే ఉద్యోగాలను ఇవ్వనుంది. 

అలాంటి వారిపై సమాచారం ఇవ్వాలి
నియోజకవర్గ స్థాయిలో కొంతమంది ఒక ముఠాగా ఏర్పడి తమకు అధికార పార్టీ నాయకులు తెలుసు అని నమ్మిస్తూ నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా తమ దందా నడిపిస్తున్నారు. ఇలాంటి వారిపై తమకు సమాచారం ఇవ్వాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. డబ్బులు వసూలు చేసే వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని ఇదివరకే పంచాయతీరాజ్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ గిరిజాశంకర్‌ హెచ్చరించారు.

పకడ్బందీగా పరీక్షలు
గ్రామ, వార్డు సచివాలయాల పోస్టులకు నిర్వహించే పరీక్షలు అత్యంత పకగ్బందీగా జరుగనున్నాయి. సర్వీస్‌ కమిషన్‌ పరీక్షలు ఎలా నిర్వహిస్తారో అలానే ఈ పరీక్షలు కూడా నిర్వహిస్తాం. ఓఎంఆర్‌ షీట్లు, మైనస్‌ మార్కులుంటాయి. అభ్యర్థులు శక్తివంచన లేకుండా కష్టపడండి. ఎలాంటి అవకతవకలకు చోటు లేదు. ఎవరైన ప్రలోభపెడితే మా దృష్టికి తీసుకురండి.
– ఏఎండీ ఇంతియాజ్, కలెక్టర్‌

ప్రలోభాలకు పాల్పడితే కఠిన చర్యలు
ఇటీవల కాలంలో గ్రామ, వార్డు సచివాలయాల పోస్టులకు నిర్వహించే పరీక్షలపై సోషల్‌ మీడియాలో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. డబ్బులు ఇస్తే ఉద్యోగం వస్తుందని మభ్య పెడుతున్నారు. ఇలాంటి వాటిపై ఇప్పటికే జిల్లాలో ఐదు కేసులు నమోదయ్యాయి. ఎవరైనా పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేసినా.. నిరుద్యోగులను ప్రలోభాలకు గురిచేసినా కఠినచర్యలు తీసుకుంటాం.
– ఎం. రవీంద్రనాథ్‌ బాబు, ఎస్పీ  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement