సీహెచ్‌దాస్
విశాఖసిటీ: ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఎక్సైజ్ శాఖ కట్టుదిట్టమైన చర్యలకు ఉపక్రమించిందని ఆ శాఖ సూపరింటెండెంట్ సీహెచ్ దాస్ స్పష్టం చేశారు. అనధికారికంగా మద్యం విక్రయాలు చేపట్టినా.. నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా ప్రవర్తించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే వందల సంఖ్యలో బైండోవర్లు నమోదు చేశామని చెబుతున్న సూపరింటెండెంట్ దాస్‌తో సాక్షి ముఖాముఖి.
సాక్షి: ఎన్నికల నేపథ్యంలో వివాదాలు చెలరేగడానికి ప్రధాన కారణమయ్యే మద్యంపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు.?
ఈఎస్: ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఎక్సైజ్ శాఖ ప్రత్యేక కార్యచరణను ఇప్పటికే రూపొందించింది. ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో మద్యం విక్రయాల్లో ఉల్లంఘనలపై నిఘా పెంచాం. మరోవైపు కేసులు నమోదు చేయడంతో పాటు ఎక్కడి నుంచి ఫిర్యాదు వచ్చినా.. వెంటనే చర్యలకు ఉపక్రమించేందుకు ప్రయత్నిస్తున్నాం.
సాక్షి: మద్యం విక్రయాల్లో సమయ పాలన విషయంలో ఏమైనా మార్పులు చేపట్టారా.?
ఈఎస్:జిల్లాలో మొత్తం 420 మద్యం దుకాణాలు, 130 బార్లు ఉన్నాయి. మద్యం దుకాణాలు, బార్లు కచ్చితంగా సమయ పాలన పాటించాల్సిందే. నిర్ణయించిన సమయానికంటే ఒక్క నిమిషం ఆలస్యమైనా కేసులు నమోదు చేసి లైసెన్స్ సస్పెండ్ చేస్తున్నాం.
సాక్షి:ఇప్పటి వరకూ ఎన్ని దుకాణాలపై చర్యలు చేపట్టారు.?
ఈఎస్:: ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత 15 రోజుల్లో ఇప్పటి వరకూ 11 మద్యం దుకాణాలు, బార్లపై కేసులు నమోదు చేసి సీజ్ చేశాం.
సాక్షి: ఫిర్యాదులు చేసేందుకు ఏమైనా ప్రత్యేక ఏర్పాట్లు చేశారా.?
ఈఎస్: ఎన్నికల సందర్భంగా మద్యం ప్రవాహాన్ని అడ్డుకునేందు కు ప్రత్యేక కార్యచరణ రూపొందిం చాం. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కమిషనర్ ఎంకే మీనా, డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు సూపరింటెండెంట్ కార్యాలయంలో జిల్లా కాల్ సెంటర్ ఏర్పాటు చేశాం. మద్యం అనధికార అమ్మకాలు, ఇతర ఉల్లంఘనలకు సంబంధించి ఎవరైనా సమాచారం అందిస్తే తక్షణం స్పందించి చర్యలు తీసుకుంటాం.
సాక్షి:జిల్లా వ్యాప్తంగా నిఘా పటిష్టం చేసేందుకు సంచార బృందాలు ఎన్ని ఏర్పాటు చేశారు.?
ఈఎస్:అన్ని మండలాల్లోనూ పూర్తిస్థాయిలో నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశాం. నాలుగు మొబైల్ పార్టీల్ని ఏర్పాటు చేసి అనధికార విక్రయాలపై నిరంతరం నిఘా ఉంచాం. రెండు టాస్క్‌ఫోర్స్ బృందాలతోపలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నాం.
సాక్షి: అనధికార విక్రయాలు జరుగుతున్నాయా.? వాటిని నిరోధించేందుకు ఏ విధమైన వ్యవస్థ ఉంది.?
ఈఎస్: జిల్లాలో అనధికార విక్రయాలకు సంబంధించి ఇప్పటి వరకూ 220 కేసులు నమోదు చేసి 200 మందిని అరెస్టు చేశాం. మద్యం రవాణాకు వినియోగిస్తున్న 7 వాహనాల్ని సీజ్ చేశాం. గతంలో అనధికారికంగా మద్యం విక్రయిస్తూ పట్టుబడిన వారు, విక్రయాలు చేపట్టిన వారిని గుర్తించి అనుమానం కలిగిన 780 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశాం.
సాక్షి:కల్తీసారా, నాటుసారా ఎన్నికల వేళ ఏరులై పారుతుంది. దాన్ని అరికట్టేందుకు ఎలాంటి ప్రణాళికలు రూపొందించారు.?
ఈఎస్: నిజమే.. ఎన్నికల సమయంలో కల్తీసారా, నాటు సారా వ్యాపారం జోరుగా సాగించేందుకు వ్యాపారాలు తమ కార్యకలాపాలు విస్తృతం చేస్తారు. అందుకే.. ముందస్తు చర్యలకు ఉపక్రమించి.. అలాంటి వ్యాపారులకు గట్టి వార్నింగ్ ఇచ్చాం. ముందస్తుగా 400 కేసులు నమోదు చేసి 350 మందిని అరెస్టు చేశాం. నాటు సారా తయారీకి వినియోగించే 45 వేల లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశాం. 1203 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నాం. జిల్లాలో కల్తీసారా, నాటు సారా తయారీ, రవాణా అరికట్టేందుకు వీలుగా అరకు, పాడేరు, చింతపల్లి, పాయకరావుపేట, భీమిలిలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాల్ని తనిఖీ చేస్తున్నాం. ఎన్నికలు ముగిసే వరకూ ఎక్కడా ఎలాంటి ఉల్లంఘన జరగకుండా ఎక్సైజ్ శాఖ పూర్తి స్థాయిలో పనిచేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment