అమ్మో విజయవాడలో పనిచేయటం చాలా కష్టం.. వారంలో నాలుగు రోజులు మంత్రి ప్రోటోకాల్, మిగిలిన మూడు
భయపడుతున్న ఎక్సైజ్ సీఐలు
నగరంలో ఉద్యోగం కష్టమంటున్న అధికారులు
బదిలీల్లో నగరానికి నో ఆప్షన్
జిల్లాలో 25 మంది సీఐల బదిలీ
సాక్షి, విజయవాడ : అమ్మో విజయవాడలో పనిచేయటం చాలా కష్టం.. వారంలో నాలుగు రోజులు మంత్రి ప్రోటోకాల్, మిగిలిన మూడు రోజులు ఇతర వీవీఐపీల పోటోకాల్ విధులు ఉంటాయి. ఇవి కాకుండా రెగ్యులర్‌గా తనిఖీలు, నెలకు సగటున 10 వరకు కేసుల నమోదు చేయాల్సి ఉంటుంది. సరే కష్టపడి పనిచేసినా పెద్దగా ఆర్థికంగా ఉపయోగం ఉండదు. డబ్బు ప్రోటోకాల్ ఖర్చులకే సరిపోవు. అందుకే విజయవాడ కంటే పక్కన ఉన్న మునిసిపాలిటీలే బాగుంటాయి. ఇది ఎక్సైజ్ శాఖలోని సిఐలు మనోగతం. గురువారం జిల్లా వ్యాప్తంగా ఎక్సైజ్ సీఐల బదిలీలు జరిగాయి.
నిబంధనలతో తంటా..
సాధారణంగా జిల్లాలో పనిచేసే ఎక్సైజ్ సిఐలు ఆదాయం బాగుంటుందని విజయవాడలోని పోస్టింగ్‌ల కోసం విస్తృతంగా ప్రయత్నించే వారు. అవసరాన్ని బట్టి రూ 4 లక్షల నుంచి 6 లక్షల వరకు అయినా ఖర్చు పెట్టి మరీ నగరంలో పోస్టింగ్ తెచ్చుకునే వారు. కాని ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఎక్సైజ్ శాఖ సీఐల పనితీరుకు కొలమానం పెట్టింది. ఎ నుంచి డి వరకు నాలుగు గ్రేడ్లుగా పనితీరు ఆధారంగా బదిలీలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో ఎగ్రేడ్ సాధించిన వారికి మాత్రమే నగరంలో పోస్టింగ్‌లు కేటాయిస్తారు.
అయితే ఎ-గ్రేడ్ ఒక సీఐకు మాత్రమే రావటంతో బిగ్రేడ్ ఉన్న ముగ్గురినీ నగరంలో వేయాల్సి ఉంది. అయితే బి గ్రేడ్‌లో ఉన్నసీఐలు నగరంలో పోస్టింగ్ వద్దని ఉన్నతాధికారులకు మెరపెట్టుకున్నారు. దీంతో నగరంలోని నాలుగు సీఐ పోస్టులనూ గతంలో లూప్‌లైన్‌లో పనిచేసిన వారికి కేటాయించారు. ఈ క్రమంలో గురువారం జిల్లాలో 23 మంది సీఐల బదిలీలు జరిగాయి. పదవీకాలం పూర్తి కాలేదని ఉయ్యూరు సీఐని మినహాయించారు. మచిలీపట్నం సీఐ పోస్టును భర్తీ చేశారు. ఏఈఎస్ భీమ్‌రెడ్డిని పలాసకు బదిలీ చేశారు.
నూతన సీఐలు వీరే...
మచిలీపట్నానికి జయశ్రీ, బంటుమిల్లికి ఎన్. అమరేశ్వరరావు, అవనిగడ్డకు ఎస్.కె. రమేష్, మొవ్వకు ఎం. సూర్యప్రకాషరావు, గుడివాడకు వరహాలరాజు, కైకలూరుకు ఎన్.వి. రమేష్, మండవల్లికి పి.జయరామ్, గన్నవరానికి పాండురంగారావు, విజయవాడ ఈస్ట్‌కు పి.వి. రమణ, విజయవాడ వెస్ట్‌కు కె.వి. సుధాకర్, పటమటకు ఎం. కృష్ణకుమారి, భవానీపురానికి జె. రమేష్ బదిలీ అయ్యారు. మైలవరానికి జి. శ్రీనివాస్, నందిగామకు సాయి స్వరూప్, కంచికచర్లకు ఆర్.వి. రామ శివ, నూజివీడుకు జె. శ్రీనివాస్, తిరువూరుకు బి. నాగహనుమాన్, విసన్నపేటకు జి. అమర్‌బాబు, మచిలీపట్నం ఈఎస్ టాస్క్‌ఫోర్స్‌కు కె. బంగారు రాజు, విజయవాడ ఈఎస్ టాస్క్‌ఫోర్స్‌కు అబ్దుల్ ఖదీర్, లిక్కర్ డిపోకు సీఎస్ వెంకటేశ్వరరావు నియమితులయ్యారు.