‘ప్రయోగం’ నిరుపయోగం | Experiment' will be invaluable | Sakshi
Sakshi News home page

‘ప్రయోగం’ నిరుపయోగం

Published Fri, Nov 22 2013 4:52 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM

Experiment' will be invaluable

ఆదిలాబాద్ టౌన్, న్యూస్‌లైన్ : జిల్లాలో 2,774 ప్రాథమిక, 385 ప్రాథమికోన్నత, 436 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో దాదాపు 3.86 లక్షల మంది చదువుతున్నారు. ప్రాథమిక విద్యస్థాయి నుంచే విద్యార్థులకు పాఠ్యాంశాలపై మక్కువ పెంచడంతోపాటు సులభంగా అర్థమయ్యే లా ప్రభుత్వం ప్రయోగాత్మక బోధనకు శ్రీకారం చుట్టింది. తద్వారా పాఠ్యపుస్తకాల్లోని అంశాలు కృత్యాధారంగా, ప్రయోగాత్మకంగా బోధించాలని ఆదేశించింది. ఆ మేరకు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు పాఠ్యపుస్తకాల్లోని అంశాలు, సంబంధించిన ఉపాధ్యాయులు కృత్యాధారంగా తయారు చేసి, వాటిని పిల్లల చేతితో చెప్పిస్తూ, వారి నుంచి ప్రశ్నల రూపంలో సమాధానాలు రాబట్టాలి. ఇలా చేస్తే పిల్లలకు ఎంతవరకు పాఠ్యాంశం అర్థమైందన్నది తెలుసుకునే వీలు కలుగుతుంది.
 
 ప్రయోగాలు కీలకం
 ఇదే తరహాలో ఐదో తరగతితోపాటు 6 నుంచి 10 తరగతుల మధ్య ఉన్న విద్యార్థులకు ఎక్కువ భాగం ప్రయోగాలతో కూడిన పాఠ్యాంశాలు ఇచ్చారు. వాటిని ప్రయోగం చేసి చూపితే కానీ అర్థం కాని పరిస్థితి. దీంతో ప్రయోగాత్మక బోధనపై విద్యాధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇందుకోసం కొంత కాలం కిందట ప్రయోగ పరికరాలు, రసాయనాల కొనుగోలుకు ఉన్నతాధికారులు అనుమతించారు. ఈ మేరకు పాఠశాలలకు నేరుగా నిధులను విడుదల చేశారు. అందులో కొంత సొమ్ము వెచ్చించి పరికరాలు కొనుగోలు చేయాలనేది ఉద్దేశం. అయితే ఎక్కడా ఆ లక్ష్యం నెరవేరలేదు. అందిన నిధులు అరకొర కావడం, దీంతోనే మరిన్ని కార్యక్రమాలు చేపట్టాల్సి రావడంతో సమస్య తలెత్తింది. కొనుగోలు చేసిన కొన్నిచోట్ల కూడా వాడకం లేక పరికరాలు మూలనపడ్డాయి. ఫలితంగా లక్ష్యం కుంటుపడటంతోపాటు, విద్యార్థులకూ ఇబ్బందికరంగా మారింది.
 
 నిధులున్నా పరికరాల్లేవు..
 2009-10 విద్యా సంవత్సరం నుంచి 2013 సంవత్సరం వరకు ఉన్నత పాఠశాలలకు ఇచ్చిన నిధుల వివరాలను పరిశీలిస్తే.. 2009-10 విద్యా సంవత్సరంలో 209 ఉన్నత పాఠశాలలకు రూ.4,687 చొప్పున ఒక్కొక్క పాఠశాలలకు నిధులు విడుదల చేశారు. అలాగే 2010-11లో 436 ఉన్నత పాఠశాలలకు రూ.17,125 చొప్పున, 2011-12 సంవత్సరంలో 436 పాఠశాలలకు రూ.15వేల చొప్పున సైన్స్ పరికరాల కోసం నిధులు విడుదల చేశారు. 2012-13లో సైన్స్ పరికరాల కోసం నిధులు కేటాయించలేదు. అలాగే 2008 నుంచి 2010 సంవత్సరం వరకు ఆర్వీఎం ద్వారా ప్రాథమిక పాఠశాలలకు రూ. 10వేల చొప్పున, ప్రాథమికోన్నత పాఠశాలలకు రూ. 50వేల చొప్పున నిధులు విడుదల చేశారు. ఇలా ఏటా లక్షలాది రూపాయల సొమ్ము పాఠశాలల నిర్వహణ, ప్రయోగ పరికరాల కోసం కేటాయిస్తున్నా.. ఆశించిన ఫలితం నెరవేరడం లేదు. ప్రయోగ పరికరాల ధరలు ఎక్కువగా ఉండటంతో సమస్య తలెత్తింది. కొనుగోలు చేసినా వాడకపోవడంతో మూలనపడి అవి వృథాగా మారి పనికిరాకుండా పోతున్నాయి.
 
 ప్రయోగాత్మక బోధన కరువు..
 విద్యా బోధనలో కృత్యాధార, ప్రయోగాత్మక బోధనలు రెండూ కీలకం. కాగా.. ప్రస్తుతం కృత్యాధార బోధన జరుగుతోంది. గతంతో పోల్చుకుంటే.. పదేళ్ల కిందట పాఠ్యపుస్తకాల్లో చిత్రాలు తక్కువగా ఉండేవి. ప్రయోగాత్మక బోధన లేకపోవడంతో కేవలం పాఠ్యాంశాలను చదివి చిన్నారులు ఊరుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రయోగాత్మక బోధనకు అవసరమైన ప్రయోగ పరికరాలను సమకూర్చడంతో పాటు, ఆ విధంగానూ బోధన జరిగేలా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement