
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఏటీఎం సేవలను విస్తృత పరచాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ఎంపీ కేవీపీ రామచంద్రరావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం కేంద్రమంత్రికి లేఖరాశారు. దేశంలో ప్రతి లక్ష మందికి 15 ఏటీఎంలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని, దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లోనేగాక అర్బన్ ప్రాంత ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ పరిస్థితి దారుణంగా ఉందన్నారు.
ఇక నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించే పేరుతో బ్యాంకులు ఎడాపెడా సర్వీస్ చార్జీలు వసూలు చేస్తున్నాయని, దీనివల్ల తమ డబ్బు డ్రా చేసుకోవడానికి కూడా ఆంక్షలు విధించడం వల్ల బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజల్లో అపనమ్మకం కలిగే పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. దేశంలో ఏటీఎంల నిర్వహణ సంస్థలను పెంచి ప్రజలకు ఉపశమనం కలిగించాలని లేఖలో కోరారు.