ఫేస్‌కు బుక్‌య్యారు
Published Wed, Mar 22 2017 5:37 PM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM
► మహిళ ఫొటోతో నకిలీ ఫేస్‌బుక్ ఖాతా
► సైబర్ నేరగాడి గాలంలో చిక్కుకున్న టెక్కలి యువకులు
► సుమారు రూ. 5 లక్షలకు టోకరా
► స్థానిక పోలీసులను ఆశ్రయించిన బాధితులు
టెక్కలి: ఆధునిక కాలంలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం తారాస్థాయికి చేరుతోంది. ఈ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని కొంతమంది సైబర్ నేరాలకు పాల్పడుతూ అమాయకుల నుంచి కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు. సైబర్ నేరగాడి వలలో పడి టెక్కలిలో కొంతమంది యువకులు బాధితులుగా మారారు. అయితే బయట ప్రపంచానికి తెలిస్తే తమ పరువు పోతుందని గుట్టు చప్పుడు కాకుండా పోలీసులను ఆశ్రయించారు. స్థానికుల కథనం ప్రకారం... గుంటూరుకు చెందిన ఓ సైబర్ నేరగాడు మహిళ ఫొటో, పేరుతో ఫేస్‌బుక్ ఖాతాను సృష్టించాడు.
ఈ ఖాతా ద్వారా టెక్కలికి చెందిన సుమారు ఐదుగురు యువకులను లాగిన్ చేసుకుని ఆకట్టుకునే విధంగా మేసేజ్‌లతో పరిచయాలు పెంచుకున్నాడు. ఇలా కొన్ని నెలలు గడిచింది. అయితే వారం రోజుల క్రితం తనకు అత్యవసరంగా డబ్బులు అవసరమని ఆయా యువకుల నుంచి సుమారు రూ. 5 లక్షలు తన బ్యాంకు ఖాతాకు మళ్లించుకున్నాడు. చివరగా ఆ ఫేస్‌బుక్ ఖాతా నకిలీ ఖాతాగా గుర్తించిన బాధిత యువకులు లబోదిబోమన్నారు. ఈ విషయం బహిర్గతమైతే తమ పరువు పోతుందని భావించి గుట్టు చప్పుడు కాకుండా మూడు రోజుల క్రితం టెక్కలి పోలీసులను ఆశ్రయించారు.
ఇదిలా ఉండగా బాధిత యువకుల స్నేహితులు కొంత మందికి ఈ విష యం తెలియడంతో స్థానిక పట్టణంలో యువకుల్లో ఇది చర్చనీయాంశంగా మారింది. బాధిత యువకుల్లో చిన్నపాటి ఫైనాన్స్ వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్న వారు ఉన్నట్టు తెలిసింది. ఈ విషయమై టెక్కలి ఎస్‌ఐ రాజేష్ వద్ద “సాక్షి’ ప్రస్తావించగా నకిలీ ఫేస్‌బుక్ ఖాతా పేరుతో యువకుల్ని మోసగించిన విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. అయితే పూర్తి స్థాయి వివరాలు కోసం ఆరా తీస్తున్నామని వెల్లడించారు.
Advertisement
Advertisement