సాక్షి, కాకినాడ : కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి పేరుతో ఓ నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్ ఓపెన్ అయింది. ఎమ్మెల్యే పేరు, ఆయన ఫొటో వాడి సొమ్ములు గూగుల్‌పే చేయాలంటూ ఓ వ్యక్తి ద్వారంపూడి సన్నిహితులు, అభిమానులను మోసం చేసేందుకు ప్రయత్నించాడు. వివరాల్లోకి వెళితే ఎమ్మెల్యే ద్వారంపూడి పేరుతో సోమవారం ఓ ఫేస్‌బుక్ అకౌంట్ ఓపెన్ అయ్యింది. ఎమ్మెల్యే ఫొటో, ఆయన పేరుతోనే అకౌంట్‌ను గుర్తు తెలియని వ్యక్తి ఓపెన్ చేశాడు. మరికొద్ది సేపటికే తనకు డబ్బులు కావాలని గూగుల్‌పే ఉంటే చేయాలని పోస్టింగ్‌లు పెట్టాడు.
సొమ్ము తిరిగి మరుసటి రోజు ఇచ్చేస్తానంటూ పోస్టులు కొనసాగించాడు. ఈ విషయాన్ని కొంతమంది ద్వారంపూడి అనుచరులు గుర్తించి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ఈ సమాచారాన్ని ఎస్పీ నయీం అస్మి, ఇతర పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సదరు ఫేస్‌బుక్ అకౌంట్‌కు సంబంధించి అందుబాటులో ఉన్న సమాచారాన్ని స్క్రీన్ షాట్‌లను తీసి ఎమ్మెల్యే పేరుతో పార్టీ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ ముమ్మిడి పవన్ టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రజలు మోసపోవద్దు
నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లను చూసి ప్రజలు మోసపోవద్దని ఎమ్మెల్యే ద్వారంపూడి ప్రజలకు సూచించారు. అటువంటి వ్యక్తులపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశానని, ఆన్‌లైన్ మోసాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఇలాంటి మోసాలకు పాల్పడే వారిని ఏ మాత్రం ఉపేక్షించబోమని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
సొమ్ములు పంపాలంటూ పెట్టిన పోస్టింగులు
Comments
Please login to add a commentAdd a comment