
రక్షణ కల్పించాలంటూ ఎస్‌ఐ నరసింహమూర్తికి కోరుతున్నప్రేమ జంట
వారిద్దరూ ఫేస్‌బుక్‌లో స్నేహితులు. ఒకరినొకరు ఇష్టపడ్డారు. రెండున్నరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెద్దలు గాయత్రికి బయట సంబంధాలు చూస్తున్నారు.
నల్లజర్ల(తూర్పుగోదావరి): తమకు రక్షణ కల్పించాలని కోరుతూ ఓ ప్రేమజంట శనివారం నల్లజర్ల పోలీసులను ఆశ్రయించింది. కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని గూడూరుకు చెందిన సంకుల గాయత్రి బీఎస్సీ పూర్తిచేసి మంగళగిరిలోని ఓ కంప్యూటర్ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం కాటకోటేశ్వరానికి చెందిన కాజ గణపతి నల్లజర్ల మండలం అనంతపల్లిలో మెడికల్ షాపు నిర్వహిస్తున్నాడు.
వారిద్దరూ ఫేస్‌బుక్‌లో స్నేహితులు. ఒకరినొకరు ఇష్టపడ్డారు. రెండున్నరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెద్దలు గాయత్రికి బయట సంబంధాలు చూస్తున్నారు. కులాలు వేరు కావడంతో పెద్దలు అంగీకరించరేమోనని భావించి వారిద్దరూ శనివారం అన్నవరం సత్యనారాయణ స్వామి గుడిలో వివాహం చేసుకున్నారు.
ఈ విషయం తెలిసిన గాయత్రి తరఫు పెద్దలు మండిపడి చంపేస్తామంటూ బెదిరించారు. దీంతో తమకు రక్షణ కల్పించాలంటూ గాయత్రి నల్లజర్ల ఎస్‌ఐ నరసింహమూర్తికి శనివారం రాత్రి ఫిర్యాదు చేసింది. ఆదివారం ఇరువురి పెద్దలను పిలచి మాట్లాడతామని ఎస్‌ఐ నరసింహమూర్తి తెలిపారు.
చదవండి: యజమాని భార్యతో డ్రైవర్ వివాహేతర సంబంధం.. చివరికి షాకింగ్ ట్విస్ట్