- మాజీ ఎమ్మెల్యేలు భూమన, సీకే బాబుకుభద్రత ఉపసంహరణ
- వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి భద్రత కుదింపు
- టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు గాలి ముద్దుకృష్ణమ,
- గల్లా అరుణకుమారికి భద్రత కల్పించిన సర్కారు
టీడీపీకి ఓట్లేయలేదనే నెపంతో ప్రజలను వేధిస్తూ.. వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులు చేస్తూ శాంతిభద్రతలకు భంగం కలిగిస్తున్న తెలుగుతమ్ముళ్లతో ఆపార్టీ అధినేత, సీఎం చంద్రబాబు పోటీపడుతున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులపై కక్ష సాధింపులకు తెరతీసి, భద్రత కుదించారు. ప్రజాప్రతినిధులు కానివారికి భద్రత కల్పించి, వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యేలకు గన్‌మెన్లను ఉపసంహరించారు. ఎవరి హిట్ లిస్ట్‌లోనూ లేని మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, గాలి ముద్దుకృష్ణమనాయుడుకు భద్రత కల్పించారు. మావోయిస్టుల నుంచి ముప్పు ఉన్న మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, ఏడు సార్లు దాడులనుంచి బయటపడిన మాజీ ఎమ్మెల్యే సీకే బాబుకు భద్రతను పూర్తిగా ఉపసంహరించడం చంద్రబాబు కక్ష సాధింపు చర్యలకు పరాకాష్టగా పోలీసువర్గాలు అభివర్ణిస్తున్నాయి.
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఎన్నికల్లో టీడీపీ మెజార్టీ సీట్లు సాధించగానే ఆపార్టీ శ్రేణులు దమనకాండకు తెరతీశాయి. టీడీపీకి ఓట్లేయని ప్రజలను వేధింపులకు గురిచేశాయి. తాగునీటి సౌకర్యం నుంచి కరెంట్ సరఫరా వరకూ అంతరాయం కల్పించి వేధించాయి. ప్రత్యర్థి పార్టీలకు ఓట్లేశారనే నెపంతో గ్రామాలపై తెలుగుతమ్ముళ్లు పడి బీభత్సం సృష్టించారు. వైఎస్సార్‌సీపీ నేతలపై కత్తులు, కొడవళ్లు, గొడ్డళ్లతో దాడులకు తెగబడ్డారు. శాంతిభద్రతలకు భంగం కలిగిస్తున్నా.. పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేయగానే టీడీపీ శ్రేణుల దాడులు మరింత పెరిగిపోయాయి. వైఎస్సార్‌సీపీ నేతలు లక్ష్యంగా దాడులను టీడీపీ నేతలే ప్రోత్సహిస్తున్నారు. జిల్లాలో ఐదుగురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు హత్యాయత్నం చేశారు. టీడీపీ నేతల దూకుడును సీఎం చంద్రబాబు అందిపుచ్చుకున్నారు. విపక్ష నేతలు.. ప్రధానంగా వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులపై కక్ష సాధింపు చర్యలను తీవ్రతరం చేశారు. అందులో భాగంగా కొందరికి భద్రతను కుదిస్తే.. మరికొందరికి భద్రతను పూర్తిగా ఉపసంహరించారు.
నిబంధనలు ఏం చెబుతున్నాయంటే..
ప్రజలకు భద్రత కల్పించడం ప్రభుత్వ విధి. సంఘవిద్రోహక శక్తుల నుంచి ప్రాణ హాని ఉన్న నేతలకు రక్షణ కల్పించడం సర్కారు బాధ్యత. ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా నేతలకు భద్రత కల్పించాలి. కానీ.. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక ఆ నిబంధనలకు తిలోదకాలు ఇచ్చారు. ఇంటెలిజెన్స్ నివేదికను బుట్టదాఖలు చేసి.. విపక్ష నేతలను వేధించడమే లక్ష్యంగా భద్రతను ఉపసంహరిస్తున్నారు.
తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి 2005లో మావోయిస్టులతో చర్చల్లో ప్రభుత్వ ప్రతినిధిగా పాల్గొన్నారు. చర్చలు ముగిశాక.. ‘ఈ చర్చలు విఫలమైతే మా తొలి టార్గెట్ మీరే అవుతారు’ అంటూ మావోయిస్టు అగ్రనేత ఒకరు భూమన కరుణాకరరెడ్డిని హెచ్చరించారు. ఇది చర్చల్లో పాల్గొన్న అప్పటి హోం మంత్రి జానారెడ్డి, డీజీపీ స్వరణ్‌జిత్ సేన్ తదితరుల దృష్టికి వెళ్లింది. గతంలో భూమన కరుణాకరరెడ్డి విప్లవోద్యమాల్లో పాల్గొన్నారు.. ఎమర్జెన్సీలో ఆయనను అప్పటి ప్రభుత్వం నిర్బంధించింది కూడా. విప్లవోద్యమాల్లో పాల్గొని.. జనజీవన స్రవంతిలో కలిసిన వారిపై తరచుగా మావోయిస్టులు దాడులు చేస్తోండటం మనం చూస్తూనే ఉన్నాం. వీటిని దృష్టిలో ఉంచుకునే 2005లో భూమన కరుణాకరరెడ్డికి 4+4 భద్రత(ఏకే-47) కల్పించారు. రోశయ్య, కిరణ్ కుమార్‌రెడ్డి ప్రభుత్రాలు ఆ భద్రతను 2+2కు కుదించాయే తప్ప.. ఉపసంహరించలేదు. భూమనకు భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చినా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు.. సీఎం ఒత్తిడి మేరకు భూమనకు భద్రతను ఉపసంహరించారు.
చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబుపై ఇప్పటికే ఏడు సార్లు హత్యాయత్నం చేశారు. ఈ దాడుల వెనక టీడీపీ నేతల హస్తం ఉందనే ఆరోపణలున్నాయి. ఆ దాడుల నుంచి సీకే బాబు తృటిలో తప్పించుకున్నారు. ప్రాణహాని ఉన్న సీకే బాబుకు రోశయ్య, కిరణ్ సర్కారు 4+4 భద్రత కల్పించారు. ఇప్పటికీ సీకే బాబుకు ప్రాణహాని ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి నివేదించాయి. కానీ.. ఆ నివేదికను సీఎం ఒత్తిడి మేరకు పోలీసు ఉన్నతాధికారులు తుంగలో తొక్కి భద్రతను ఉపసంహరించారు.
పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీనియర్ నేత. సంఘ విద్రోహక శక్తుల నుంచి ఆయనకు ముప్పు ఉందన్న ఇంటెలిజెన్స్ నివేదికను చంద్రబాబు బుట్టదాఖలు చేశారు. ఆయన భద్రతను 1+1కు కుదించారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై ఎన్నికలకు ముందే టీడీపీ నేతలు అనేక సందర్భాల్లో దాడులకు దిగారు. ఆ నియోజకవర్గంలో ఎర్రచందనం స్మగ్లర్ల అవతారం ఎత్తిన టీడీపీ నేతల నుంచి బెడద అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి 2+2 భద్రతను కొనసాగించాలన్న ఇంటెలిజెన్స్ వర్గాల నివేదికను బుట్టదాఖలు చేశారు. ఆయనకు భద్రతను 1+1కు కుదించారు.
దీన్నేమంటారు బాబూ...
మాజీ ఎమ్మెల్యేకు భద్రత కల్పించకూడదని నిర్ణయించినట్లు ప్రభుత్వం చెబుతోంది. గతంలో జిల్లాలో 48 మందికి భద్రత కల్పిస్తే.. ఇప్పుడు 21 మందికే కల్పిస్తున్నామని సమర్థించుకుంటోంది. కానీ.. టీడీపీ మాజీ ఎమ్మెల్యేలైన గాలి ముద్దుకృష్ణమనాయుడు, గల్లా అరుణకుమారిలకు 1+1 భద్రత కల్పించారు. అటు గాలికిగానీ.. ఇటు గల్లాకుగానీ ఎవరి నుంచి ముప్పు లేదు. వారిద్దరికీ భద్రత కల్పించాలని ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రత్యేకంగా నివేదిక కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. కానీ.. ఆ ఇద్దరూ టీడీపీ నేతలు కావడంతో భద్రత కల్పించారు. ఇక డీసీసీబీ చైర్మన్ అమాస రాజశేఖరరెడ్డికి కూడా భద్రతను ఉపసంహరించడం గమనార్హం. వీటిని పరిగణనలోకి తీసుకుంటే చంద్రబాబు ప్రభుత్వం ఏ స్థాయిలో కక్ష సాధింపు చర్యలకు దిగుతోందో విశదం చేసుకోవచ్చు.