
ఓడీఎఫ్‌లో నెల్లూరు జిల్లా నంబర్–1 అంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ , పాత చీరలతో దడికట్టి వినియోగిస్తున్న మరుగుదొడ్డి
నెల్లూరు (అర్బన్): ప్రతి ఇంటికీ వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించగలిగితే.. ప్రజలు చైతన్యవంతులై వాటిని వినియోగించుకుంటే అటు ఆ కుటుంబాలకు, ఇటు సమాజానికి ఎంతో ఉపయోగం. బహిరంగ మల విసర్జనను రూపుమాపి మరుగుదొడ్లను వినియోగించేలా చేస్తే టైఫాయిడ్, శిశు పక్షవాతం (పోలియో), కామెర్లు వంటి పలు రకాల జబ్బులు అరికట్టబడతాయి. ఈ నేపథ్యంలోనే ఆత్మగౌరవం పేరిట జిల్లాలో అన్ని కుటుంబాలకు వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టించినట్టు.. అందరూ వాటిని వాడుతున్నట్టు అధికారులు కాకి లెక్కలు వేసి ప్రభుత్వానికి నివేదించారు. వెంటనే స్పందించిన ప్రభుత్వం నెల్లూరు జిల్లా రాష్ట్రంలోనే నంబర్–1 అని ప్రకటించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనెల 2న కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు సహా మరికొందరు అధికారులకు పురస్కారాలు అందజేశారు. అయితే, క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు విరుద్ధమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికీ ప్రతి గ్రామంలో మరుగుదొడ్లు నిర్మించుకోని కుటుంబాలు అనేకం ఉన్నాయి. దళిత, గిరిజన కాలనీల్లో అనేకచోట్ల మరుగుదొడ్లు అంటే ఇప్పటికీ తెలియని పరిస్థితి ఉంది.
రూ.350 కోట్లు చెల్లింపు
అధికారిక లెక్కల ప్రకారం జిల్లావ్యాప్తంగా గ్రామాల్లో 2,70,031 ఇళ్లకు మరుగుదొడ్లు మంజూరయ్యాయి. వీటిలో 2,46,560 మరుగుదొడ్ల నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఇందుకోసం రూ.350 కోట్లను చెల్లించినట్లు అధికారులు చెబుతున్నారు. సెప్టెంబర్ 27వ తేదీ వరకు నిర్మించుకున్న యూనిట్లకు పెండింగ్ లేకుండా బిల్లులు చెల్లించామని.. ఆ తరువాత నిర్మించిన వాటికి రూ.8 కోట్లు మాత్రమే చెల్లించాల్సి ఉందని పేర్కొంటున్నారు. జిల్లాలో 940 పంచాయతీలు, 3,150కి పైగా మజరాలున్నాయి. 20 లక్షల మంది గ్రామాల్లోనే నివసిస్తున్నారు. అధికారులు 100 శాతం మరుగుదొడ్లు నిర్మించామని చెబుతున్నారు. 2.70 లక్షల మరుగుదొడ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఇంకా 23,471 నిర్మించాల్సి ఉందని లెక్కలు చూపారు. ఏ పల్లెకు వెళ్లినా మరుగుదొడ్లు నిర్మించుకోని కుటుంబాలు అనేకం కనిపిస్తున్నాయి. ఉదాహరణకు కావలి మండలం చలంచర్ల గ్రామంలో ఇప్పటికీ కొన్ని ఇళ్లకు మరుగుదొడ్లు కట్టలేదు. వాటిని కూడా నిర్మించిన లెక్కల్లో చూపించారు. గ్రామానికి దూరంగా ఉండే గిరిజన కుటుంబాలకు మరుగుదొడ్లు అం టేనే తెలియని పరిస్థితి. కాలువ గట్ల వెంబడి నివసించే వారికి మరుగుదొడ్లు లేనేలేవు.
బినామి పేర్లతో భోంచేశారు
ఏఎస్ పేట, సీతారామపురం, వరికుంటపాడు, బాలాయపల్లి, పెళ్లకూరు తదితర మండలాల్లో ఎంపీడీఓలు మరుగుదొడ్లు కట్టించకుండానే నిర్మించినట్టు చూపి పెద్దఎత్తున నిధులు డ్రా చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బినామీ పేర్లతో సాగించిన ఈ కుంభకోణాలపై కలెక్టర్ విచారణ జరిపిస్తే బినామీ బిల్లుల బాగోతం బయటపడే అవకాశముందని ప్రజలు పేర్కొంటున్నారు. పలు గ్రామాల్లో బహిరంగ మలవిసర్జన నేటికీ కొనసాగుతోంది. ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి మరుగుదొడ్లు నిర్మిస్తున్నప్పటికీ ప్రజలు వినియోగించడం లేదంటే ఈ తప్పెవరిదో ఆలోచించాల్సి ఉంది. లేదంటే ఆత్మగౌరవం అభాసు పాలవుతుంది.
ఇదో విచిత్రం
బుచ్చిరెడ్డిపాళెం : బుచ్చిరెడ్డిపాళెం మండలం శ్రీపురంధర పురం గ్రామానికి చెందిన యర్రా నాగసుధాకర్‌రెడ్డి, యర్రా విజయలక్ష్మి భార్యాభర్తలు. యర్రా విజయలక్ష్మి పేరిట స్వచ్ఛభారత్ కింద మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.15 వేలు, ఉపాధి హామీ పథకంలో రూ.12 వేల నగదు డ్రా చేశారు. అలాగే యర్రా నాగ సుధాకర్‌రెడ్డి పేరిట స్వచ్ఛభారత్ కింద మరో రూ.12 వేల నగదు డ్రా చేశారు. విచిత్రమేమిటంటే.. లబ్ధిదారుడిగా చూపుతున్న నాగసుధాకర్‌రెడ్డికి డబ్ల్యూఏపీ0906036ఏ0264 నంబర్‌తో ఉన్న బోగోలు మండల రేషన్ కార్డును జతపరిచారు. ఇలా భార్యాభర్తల పేరిట ఒక మరుగుదొడ్డి నిర్మాణానికి అధికారుల సహకారంతో రూ.39 వేల నగదు డ్రా చేశారు. నిజానికి ఈ సొమ్ములు మొత్తం ఆ కుటుంబానికి అందలేదు. ఎవరి జేబుల్లోకి వెళ్లాయనేది అధికారులకే ఎరుక. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. కోవూరు నియోజకవర్గంలో వేలాది మరుగుదొడ్ల నిర్మాణంలో అవినీతి చోటుచేసుకుంది. మరుగుదొడ్లు కట్టకుండానే కట్టినట్లు చూపి రూ.లక్షలు స్వాహా చేసిన దాఖలాలు ఉన్నాయి. వీటిపై సాక్షాత్తు జిల్లా కలెక్టర్ ముత్యాలరాజుకు ఫిబ్రవరి నెలలో మండల నాయకులు, ప్రజలు ఫిర్యాదు చేశారు. నామమాత్ర విచారణ జరిపి చేతులు దులుపుకున్నారు.
బినామీలు లేనే లేరు
జిల్లాలో మరుగుదొడ్లు నిర్మించకుండా బిల్లులు పొందిన బినామీలు ఎవరూ లేరు. అలాంటివారు ఎవరైనా ఉన్నట్టు మా దృష్టికి వస్తే కలెక్టర్ ద్వారా తగు చర్యలు చేపడతాం. ఎక్కడైనా దొంగ బిల్లులు డ్రా చేసి ఉంటే రికవరీ చేయిస్తాం. నిర్మించిన మరుగుదొడ్లు వినియోగించుకునేలా ఆత్మగౌరవం ప్రతిజ్ఞ పేరుతో కలెక్టర్ ప్రజలను చైతన్యం చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. లక్ష్యాలకు అనుగుణంగా మరుగుదొడ్లు నిర్మించాం. అక్కడక్కడా ఒకటీ అరా ఉంటే అవి వెంటనే పూర్తి చేయిస్తాం. – సుస్మితారెడ్డి, జిల్లా కో–ఆర్డినేటర్, ఆత్మగౌరవం
Comments
Please login to add a commentAdd a comment