లింగంపేట, న్యూస్‌లైన్ : ‘‘ ఏం గావాలా కాకా పహాణియా.. పాసుపుస్తకమా.. ఏది గావాలన్నా చేసిస్తమే.. మన చేతుల పని. కంప్యూటర్ల ఏదంటే అది చెయ్యచ్చే. ఇగ సార్ సంతకమంటవా.. గా సారే గుర్తుపట్టడు అట్ల పెట్టిస్తాం. పైసల్ చేతులవెట్టి నువ్ బేఫికరుండు...’’ ఇలా కొంతమంది ఆపరేటర్లు నకిలీ పహాణిలను, పాసుపుస్తకాలను తయారు చేసిస్తున్నట్లు మండలంలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇందులో పలువురు రెవెన్యూ అధికారుల పాత్ర కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైతులకు భూములు లేకపోయినా ఉన్నట్లు పట్టదారు పాసుపుస్తకాలను సృష్టిస్తున్నారు. బ్యాంకుల నుంచి రుణాలు, వాణిజ్య, పంట రుణాలు పొందడానికి వీటిని ఉపయోగిస్తున్నారు. మండలంలోని శెట్పల్లి సంగారెడ్డి, శెట్పల్లి, ఎక్కపల్లి, లింగంపేట, రాంపల్లి, లింగంపల్లి, ఐలాపూర్, రాంపూర్, కొండాపూర్, పర్మల్ల తదితర గ్రామాలలో ఈ నకిలీ పాసుపుస్తకాలు ఉన్నట్లు సమాచారం.
బ్యాంకు అధికారుల పరిశీలనతో..
ఒక్కో నకిలీ పాసుపుస్తకం తయారీకి రూ.5వేల నుంచి 10 వేల వరకు తీసుకుంటున్నట్లు తెలిసింది. ఇటీవల రాంపూర్‌కు చెందిన ఓ రైతు ఏకంగా మండల ఉప తహశీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి దక్కన్ గ్రామీణ బ్యాంకులో రుణం కోసం దరఖాస్తు చేసుకోగా బ్యాంకు అధికారులు అనుమానించారు. తహశీల్‌కార్యాలయంలో పరిశీలించగా, ఉప తహశీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు తేలింది. అలాగే మండల కేంద్రంలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు(ఐఓబీ)లో ఫోర్జరీ సంతకాలతో కూడిన పాసుపుస్తకాలను గుర్తించిన బ్యాంకు మేనేజర్ స్థానిక తహశీల్‌లో నిర్ధారించగా నకిలీవనీ తేలినట్లు సమాచారం. బ్యాంకుల ద్వారా రుణాల కోసం లింగంపేట శివారులో సర్వే నంబర్ 636లో నాలుగు ఎకరాల భూమి ఉన్నట్లు కొందరు నకిలీ పాసు పుస్తకాలను తయారు చేయిస్తున్నట్లు తేలింది. ఒకరిద్దరు రెవెన్యూ అధికారులు సైతం నకిలీ పాసు పుస్తకాలలో భాగం పంచుకున్నట్లు సమాచారం. గతంలో పనిచేసిన అధికారులకు ముడుపులిచ్చి సంతకాలు చేయిస్తున్నారనీ, ఆర్డీవో సంతకాన్ని సైతం ఫోర్జరీ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
పాసుపుస్తకానికి రూ.పదివేల వరకు..
నకిలీ పాసు పుస్తకాలు, పహాణిల తయారీని రెవెన్యూ సిబ్బంది రాత్రివేళల్లో తయారు చేస్తున్నట్లు తెలిసింది. కొందరు కంప్యూటర్ ఆపరేటర్లు ఒక్కో పహాణికి రూ.మూడువేల నుంచి రూ.ఐదువేల వరకు, పాసుపుస్తకానికి రూ.ఐదు నుంచి రూ.పదివేల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం. అలాగే రైతులకు చెందిన పాత పట్టాదారు పాసు పుస్తకాలను తీసుకుని, కొత్త పాసుపుస్తకాలను ఇస్తున్నారని, పాత పాసుపుస్తకాలపై ఇతరుల ఫొటోలు పెట్టి వాటిని నకిలీగా మారుస్తున్నట్లు రెవెన్యూవర్గాల ద్వారా తెలిసింది.
జోరుగా నకిలీ పాస్‌పుస్తకాలు?
Published Thu, Oct 3 2013 6:04 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement