ఏలూరు(టూటౌన్), న్యూస్‌లైన్ : నగరంలోని శివారు ప్రాంతాలలో నకిలీ పోలీసులు హల్‌చల్ చేస్తున్నారు. రాత్రి సమయంలో వాహనాలపై వెళుతున్న వారిని నిలిపి పోలీసులమని చెప్పి తనిఖీల పేరుతో నిలువుదోపిడీ చేస్తున్నారు. స్థానిక వట్లూరు రోడ్డు, మినిబైపాస్, వట్లూరు నుంచి పెదపాడు వైపుగా వెళ్లే మార్గాల్లో ఎక్కువగా ఈ దోపిడీలు జరుగుతున్న సమాచారం. ఇటీవలే రెండు రోజుల క్రితం వట్లూరు నుంచి పెదపాడు వెళుతున్న ఓ జంటను త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో క్రైమ్ పోలీసులమంటూ చెప్పి వాళ్లను భయపెట్టి వారి వద్ద ఉన్న రూ.1000 నగదు దోచుకున్నారు. ఇటీవంటి ఘటనలు శివారు ప్రాంతాలలో తరచూ జరుగుతున్నాయని బాధితులు చెబుతున్నారు.
వట్లూరు శివారు, మినిబైపాస్ రోడ్డులో ఎక్కువగా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుండడంతో కొందరు అక్కడ మాటువేసి పోలీసులమంటూ చెప్పుకుంటూ క్యాష్ చేసుకుంటున్నారు. ఈ ప్రాంత పరిధిలోని పోలీసులు రాత్రి వేళల్లో గస్తీ నిర్వహించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నకిలీ పోలీసు అగడాలు ఎక్కువయ్యాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు నకిలీ పోలీసు అగడాలను ఆరికట్టాలని పలువురు కోరుతున్నారు.
దీనిపై త్రీటౌన్ సీఐ పి.శ్రీనివాసరావును ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ పోలీసులమని చెప్పి డబ్బులు గుంజుతున్న వారు, లేదా అనుమానితుల వివరాలను వెంటనే త్రీటౌన్ పోలీస్‌స్టేషన్ నంబర్ 08812-223833కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. వెంటనే సిబ్బందిని అక్కడికి పంపిస్తామని, నకిలీల ఆగడాలను అరికడతామన్నారు. అలాగే అసాంఘిక కార్యకలాపాలను నివారణకు చర్యలు తీసుకుంటామన్నారు. మినిబైపాస్, వట్లూరు పరిసర ప్రాంతాలలో గస్తీని పెంచుతామని చెప్పారు.
శివారులో నకిలీ పోలీసుల ఆగడాలు
Published Mon, May 19 2014 1:20 AM | Last Updated on Tue, Aug 28 2018 7:08 PM
Advertisement
Advertisement