బోగస్ గురువుల ఆటకట్టు
Published Sat, Aug 17 2013 3:45 AM | Last Updated on Fri, Sep 1 2017 9:52 PM
సాక్షి, సంగారెడ్డి: బోగస్ కుల ధ్రువీకరణ పత్రాలతో ఉద్యోగాలు పొందిన ముగ్గురు ఉపాధ్యాయులపై త్వరలో వేటు పడనుంది. గిరిజనులుగా పేర్కొంటూ బోగస్ కుల ధ్రువీకరణ పత్రాలు పొందినట్లు రెండేళ్ల సుదీర్ఘ విచారణలో తేలడంతో ఆ పత్రాలను రద్దుచేస్తూ కలెక్టర్ దినకర్‌బాబు ఉత్తర్వులు జారీ చేశారు. బోగస్ ఎస్టీ కులపత్రాలతో 8 మంది ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందారని బంజారా సేవాదళ్ సంఘం అధ్యక్షుడు రమేశ్ చవాన్ 2011 ఆగస్టు 16న కలెక్టర్ కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులపై జాయింట్ కలెక్టర్ నేతృత్వంలోని జిల్లాస్థాయి పరిశీలన కమిటీ(డీఎల్‌ఎస్‌సీ) విచారణ చేపట్టింది. వీటిలో ముగ్గురు ఉపాధ్యాయుల బోగస్ ఎస్టీ కుల ధ్రువీకరణ పొందినట్లు తేలడంతో గత జూన్ నెలాఖరులో వారి నియామకాలను కలెక్టర్ రద్దు చేశారు. నెల రోజులు గడుస్తున్నా .. ఈ ఉపాధ్యాయులపై వేటు వేయకుండా జిల్లా విద్యాశాఖ కార్యాలయం జాప్యం చేస్తోందని ఫిర్యాదుదారులు ఆరోపిస్తున్నారు.
మిగిలిన ఐదు మంది ఉపాధ్యాయులు లంబాడి కులానికి చెందినప్పటికీ వారు మహా రాష్ట్ర, కర్ణాటకలకు చెందినవారు. మహారాష్ట్రలో బంజారాలను బీసీ కేటగిరీ, కర్ణాటకలో లంబాడీలు ఎస్సీ కేటగిరీల కిందకు వస్తారు. ఇలాంటి నేపథ్యం కలిగిన టీడీపీ ఎమ్మెల్యే సుమన్ రాథోడ్ ఎస్టీ కాదని, ఆమె ఎన్నిక చెల్లదని రాష్ట్ర హైకోర్టు జారీ చేసిన ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే విధించిన సంగతిని ఈ సందర్భంలో ప్రస్తావనార్హం. సుప్రీం కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా ఈ ఐదు మంది ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కార్యాలయ వర్గాలు తెలిపాయి.
భర్తలు ఎస్టీలు.. భార్యలకు ఎస్టీ సర్టిఫికెట్లు!
పెద్దశంకరంపేట మండలం ఉత్లూరు ప్రాథమికోన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్‌గా వై. విజయలక్ష్మి డీఎస్సీ-2008లో నియమితులయ్యారు. సంగారెడ్డి ఆర్డీఓ, జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారి ద్వారా వేర్వేరుగా విచారణ జరిపించగా, బోగస్ ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రం ఆధారంగా ఉద్యోగాన్ని పొందినట్లు నిర్ధారణ అయింది. ఆమె చదివిన పాఠశాల రికార్డుల్లో నీలి(బీసీ-డీ) కులానికి చెందినవారని తేలింది. ఎస్టీ వర్గానికి చెందిన సుభాష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ద్వారా ఆమె ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాన్ని పొంది ఉద్యోగంలో చేరినట్లు ఇరువురు అధికారులు జిల్లాస్థాయి పరిశీలన కమిటీకి నివేదించారు. దీంతో ఆమెకు సంబంధించిన ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దుచేస్తూ కలెక్టర్ దినకర్‌బాబు జూన్ 28న ఉత్తర్వులు జారీ చేశారు. నారాయణ్‌ఖేడ్ మండలం శివార్సాండు తండా ప్రాథమిక పాఠశాల ఎస్జీటీ డి. జ్యోతి సైతం ఇదే రీతిలో ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాన్ని పొంది ఉద్యోగాన్ని సంపాదించారని డీఎల్‌ఎస్‌సీ విచారణలో తేలింది. రంగరి(బీసీ-బీ) కులానికి చెందిన డి. జ్యోతి ఎస్టీ వర్గానికి చెందిన బి. మారుతిని వివాహం చేసుకున్నారు. అనంతరం నారాయణ్‌ఖేడ్ తహశీల్దార్ కార్యాలయం నుంచి ఎస్టీ(లంబాడ) కుల ధ్రువీకరణ పత్రాన్ని పొంది డీఎస్సీ-2001లో ఉద్యోగాన్ని సంపాదించారని సంగారెడ్డి ఆర్డీఓ, డీటీడబ్ల్యూఓలు జరిపిన వేర్వేరు విచారణల్లో తేలింది. ఆమె చదివిన పాఠశాల రికార్డుల్లో సైతం రంగరి కులానికి చెందినవారని ఉన్నట్లు అధికారుల పరిశీలనలో వెల్లడైంది. విచారణ అధికారుల సిఫారసుల మేరకు ఆమె ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేస్తూ గత జూన్ 29న జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
మనూరు మండలం కేశ్వర్ ప్రాథమిక పాఠశాల ఎస్జీటీ ఆర్. మాచేందర్ డీఎస్సీ-2002లో ప్రత్యేక విద్యా వలంటీర్‌గా నియమితులయ్యారు. సంగారెడ్డి ఆర్డీఓ విచారణ జరపగా మాచేందర్ ఉప్పరి(బీసీ-డీ) కులానికి చెందినవారని తేలడంతో ఆయన బోగస్ ఎస్టీ ధ్రువీకరణ పత్రం ద్వారా ఉద్యోగాన్ని సంపాదించారని కమిటీకి నివేదించారు. జిల్లా బీసీ సంక్షేమ శాఖాధికారి విచారణలో సైతం ఇదే విషయం వెల్లడైంది. ఆయన చదివిన పాఠశాల రికార్డుల్లో ఉ ప్పరి కులానికి చెందిన వారని పేర్కొని ఉంది. విచారణాధికారుల సిఫారసుల మేరకు మాచేం దర్‌ను ఎస్టీగా ధ్రువీకరిస్తూ 2002లో జారీ చే సిన ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేస్తూ గత జూలై 28న జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
Advertisement
Advertisement