కొత్తగూడెం రూరల్, న్యూస్‌లైన్: విదేశీ అప్పులతోనే రూపాయి విలువ పతనమైందని ఇఫ్టూ జాతీయ ప్రధాన కార్యదర్శి బి.ప్రదీప్ చెప్పారు. ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న యూపీఏ ప్రభుత్వానికి తగిన బుద్ది చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ కొత్తగూడెంలోని పోస్టాఫీస్ సెంటర్‌లో ఇప్టూ ఆధ్వర్యంలో శుక్రవారం బహిరంగ సభ జరిగింది. ఈ సభలో ఆయన మాట్లాడుతూ.. మన దేశంపై 390 బిలియన్ డాలర్ల అప్పు ఉందని చెప్పారు. ఇందులో 120 బిలియన్ డాలర్ల అప్పులు చేసింది పది కార్పొరేట్ సంస్థలేనని చెప్పారు. ఈ కారణంగానే రూపాయి విలువ పడిపోయిందన్నారు. మన దేశ పాలకులు గత కొన్నేళ్లుగా విదేశాలకు వెళ్లి కోట్లాది రూపాయలు అప్పులు చేస్తున్నారని, ఇందుకుగాను ప్రంపంచ బ్యాంకు షరతులకు తలొగ్గుతున్నారని చెప్పారు.
ఇందులో భాగంగానే సింగరేణి, మరికొన్ని ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. దీనివల్ల రెగ్యులర్ కార్మికులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. మన పాలకులు ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తూ, దేశంలో రూ.27 లక్షల కోట్ల ద్రవ్య లోటు ఉందని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వ పథకాల సబ్సిడీ కింద రెండులక్షల కోట్లు మాత్రమే ఖర్చవుతోందన్నారు. మిగతా రూ.25లక్షల కోట్లలో అంబానీ, ల్యాంకో తదితర పెట్టుబడిదారులకు ప్రభుత్వం సబ్సిడీల రూపంలో ఇస్తోందని, మరికొంత మొత్తం పన్నుల బకాయిలు ఉన్నాయని చెప్పారు. యూపీఏ సర్కారు ప్రజావ్యతిరేక విధానాలపై ఉద్యమించాల్సి అవసరముందని అన్నారు. సభలో న్యూడెమోక్రసీ నాయకులు గుమ్మడి నర్సయ్య, ఇప్టూ జిల్లా అధ్యక్షుడు ఎ.వెంకన్న, జాతీయ ఉపాధ్యక్షుడు డిపి.కృష్ణ, జీఎల్‌బీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు టి.శ్రీనివాస్, నాయకులు వి.కృష్ణ, పోలారి, రామయ్య, ప్రసాద్, విజయకుమార్, ఎన్.సంజీవ్, షేక్ యాకుబ్‌షావలి, సీపీఎం నాయకులు సురేందర్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
విదేశీ అప్పులతోనే రూపాయి పతనం
Published Sat, Sep 14 2013 4:42 AM | Last Updated on Fri, Sep 1 2017 10:41 PM
Advertisement
Advertisement