బెల్లంపల్లి, న్యూస్‌లైన్ : బెల్లంపల్లి ఏరియా బొగ్గు అక్రమ దందా వ్యవహారంపై సాగుతున్న విచారణ పక్కదారి పడుతోంది. అవినీతి సింగరేణి అధికారులను, పెద్ద కాంట్రాక్టర్ల (తిమింగలాలను)ను వదిలి సింగిల్ లారీ (టిప్పర్) ఓనర్లను బలిపశువులుగా చేయాలనే ఉద్దేశంతో విచారణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. బెల్లంపల్లి ఏరియాలో రెండేళ్లుగా బొగ్గు అక్రమ దందా సాగుతోంది. ఈ కాలంలో సుమారు 70 వేల టన్నుల బొగ్గు అక్రమ రవాణా జరిగి, సింగరేణికి దాదాపు రూ.25 కోట్ల వరకు నష్టం కలిగినట్లు ప్రాథమిక సమాచారం.
బొగ్గును ప్రత్యేకంగా రైల్వే వ్యాగన్లు, టిప్పర్లు, లారీల ద్వారా ఇతర మార్గాలలో కొందరు బడా కాంట్రాక్టర్లు అక్రమ రవాణా చేసినట్లు తెలుస్తోంది. 2012 జనవరి నుంచి 2013 డిసెంబర్ నెల వరకు రెండేళ్లలో జరిగిన బొగ్గు అక్రమ రవాణా వెనుక కొందరు బడా కాంట్రాక్టర్లు, సింగరేణి ఉన్నతాధికారుల హస్తం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ దందాపై ‘సాక్షి’ దినపత్రికలో డిసెంబర్ 27, జనవరి 7వ తేదీన ‘బొగ్గు దొంగలు’, ‘ఆగని దందా’ పేరుతో కథనాలు ప్రచురితమయ్యాయి.
ఈ వ్యవహారాన్ని ‘సాక్షి’ బహిర్గతం చేయడంతో అవినీతి అధికారులు, బడా కాంట్రాక్టర్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తాయి. ఈ వ్యవహారం ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటుందోనని విచారణను పక్కదారి పట్టించేందుకు కుట్రలు జరుపుతున్నట్లు సమాచారం. బొగ్గు దందాపై రెండేళ్లుగా విచారించకుండా కేవలం 2013 డిసెంబర్ నెలలో జరిగిన బొగ్గు అక్రమ రవాణాపైనే సింగరేణి విజిలెన్స్ విభాగం అధికారులు విచారణ జరపడం అనుమానాలకు తావిస్తోంది. అంతకుముందు జరిగిన బొగ్గు దందా జోలికి వెళ్లకపోవడం వెనుక కొందరు సింగరేణి అధికారుల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది.
ఉన్నతాధికారులను కాపాడాలనే ఉద్దేశంతోనే విచారణను నెలరోజుల దందాకే పరిమితం చేసినట్లు తెలుస్తోంది. ఒక్క డిసెంబర్ (2013) నెలలోనే 15 టిప్పర్ల ద్వారా 64 ట్రిప్పుల బొగ్గు వే బిల్లులు లేకుండా అక్రమ రవాణా జరిగినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. రెండేళ్లలో విచారణ జరిపితే ఇంకెంత మొత్తంలో దందా జరిగిందో అంతుచిక్కకుండా ఉంది. బాహ్య ప్రపంచానికి మాత్రం ఏదో పెద్ద కుంభకోణం వెలికితీస్తున్నట్లు విజిలెన్స్ అధికారులు హంగామా చేస్తున్నారు. ఇప్పటి వరకు విజిలెన్స్ అధికారులు సీరియస్‌గా విచారణ జరిపింది లేదు.
జరిగింది కాదు ఇకపై జరగకుండా..
సింగరేణి విజిలెన్స్ అధికారుల విచారణ తీరు నిష్పక్షపాతంగా జరుగుతున్నట్లు కనిపించడం లేదు. ఇప్పటి వరకు జరిగిన బొగ్గు దందాపై మొక్కుబడిగా విచారించి కొందరు సింగిల్‌లారీ ఓనర్లపై కేసులు నమోదు చేసి చేతులు దులుపుకోవాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు అనుగుణంగానే పక్కా ప్రణాళికతో విజిలెన్స్ అధికారులు ముందుకు సాగుతున్నారు. ఈ దందాపై సింగరేణి చైర్మన్ సుతీర్థభట్టాచార్య ప్రత్యేక దృష్టి సారించి ప్రత్యేక కమిటీ , సీబీసీఐడీతో విచారణ చేపడితే అసలు బాధ్యులు బయటపడే అవకాశం లేకపోలేదు. ఈ దందా వెనుకాల ఉన్న సింగరేణి అధికారులపై చర్యలు తీసుకుని, బడా కాంట్రాక్టర్లపై కేసు నమోదు చేయించాలని కార్మికవర్గం కోరుతోంది.
పోలీసు కేసుకు రంగం సిద్ధం
బెల్లంపల్లి ఏరియాలో జరిగిన బొగ్గు అక్రమ రవాణా వ్యవహారంలో అక్రమార్కులపై పోలీసు కేసు పెట్టేందుకు సింగరేణి అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఏయే టిప్పర్లు బొగ్గును అక్రమంగా రవాణా చేశాయి, ఎన్ని టన్నులు చేరవేశాయో రికార్డులను పరిశీలిస్తున్నారు. ఈ పాటికే కొన్ని టిప్పర్లను గుర్తించినట్లు తెలుస్తోంది. వీటి యజమానులపై రెండు, మూడు రోజుల్లో పోలీసు కేసు నమోదు చేయించాలనే యోచనలో ఏరియా సింగరేణి ఉన్నతాధికారులు ఉన్నట్లు సమాచారం.
విచారణ బొగ్గేనా..!
Published Sun, Jan 19 2014 3:36 AM | Last Updated on Sat, Sep 2 2017 2:45 AM
Advertisement
Advertisement