వైఎస్సార్‌సీపీలో చేరిన కుటుంబాలతో మేకపాటి
నెల్లూరు , ఉదయగిరి: రాష్ట్రాభివృద్ధి కోసం నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతూ శ్రామికుడిలా శ్రమిస్తున్న ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని రాబోయే ఎన్నికల్లో ఆశీర్వదించాలని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి కోరారు. ఉదయగిరి మండలం జీ చెర్లోపల్లి పంచాయతీ పరిధిలోని వడ్డిపాళేనికి చెందిన పలు కుటుంబాలు శుక్రవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ నేతలు అక్రమంగా ప్రజాసొమ్మును దోచుకుని సామాన్యులను ఇబ్బందులు పడుతున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే ప్రజలకు సమస్యల నుంచి విముక్తి లభించడమే కాకుండా పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో సాగుతున్న రాక్షస పాలనను అంతమొందించేందుకు ప్రతిఒక్కరూ నడుం బిగించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయితే నవరత్నాల పథకాల ద్వారా ప్రతి కుటుంబానికి రూ.50వేల నుంచి రూ.10లక్షల వరకు లబ్ధి చేకూరుతుందన్నారు. గతంలో ఎమ్మెల్యేగా ఉదయగిరి నియోజకవర్గాన్ని శాయాశక్తులా అభివృద్ధి చేశానని, ఈసారి అవకాశం ఇస్తే ఉదయగిరి ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు సోమశిల హైలెవల్ కెనాల్, సీతారాంసాగర్, వెలుగొండ ప్రాజెక్టులు పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుత ఎమ్మెల్యే అవినీతిలో కూరుకుపోయి ప్రజాసంక్షేమాన్ని పట్టించుకోవడంలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ విజ్ఞతతో ఆలోచించి ఓటుహక్కు వినియోగించుకోవాలని సూచించారు. మరోసారి టీడీపీకి అవకాశమిస్తే రాష్ట్రం పూర్తిస్థాయిలో దోపిడీకి గురవుతుందన్నారు. పార్టీ నేతలు శ్రీనివాసులురెడ్డి, ఓబుల్‌రెడ్డి, ఏడుకొండలు, కంబాల నరసింహారెడ్డి, రమణారెడ్డి, ఎం శ్రీనివాసులురెడ్డి, మట్ల లక్ష్మయ్య, రాజారెడ్డి, సుజాత, తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీలో భారీగా చేరిక
వడ్డిపాళేనికి చెందిన బత్తుల శివనాగులు, బీ నరసింహులు ఆధ్వర్యంలో 50 కుటుంబాలు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి సమక్షంలో టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరాయి. వారికి మేకపాటి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యను మేకపాటి దృష్టికి గ్రామస్తులు తీసుకురాగా తక్షణమే సమస్యను తీరుస్తానని, అవసరమైతే సొంత నిధులతో ట్యాంకర్ల ద్వారా తానీరు సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment