పంజగుట్ట (హైదరాబాద్) : 'ఓ వ్యక్తి మోసంతో ఆర్థికంగా చితికిపోయాం... చనిపోయేందుకు అనుమతివ్వండి' అని ప్రభుత్వాన్ని వేడుకుంటోంది ఓ కుటుంబం. బాధితుడి కుటుంబం బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం... బోరబండ నివాసి మునీర్ ఖాన్ ఇళ్లకు సీలింగ్ వేసే పనులు చేస్తుంటాడు. ఇతడు రెడ్‌హిల్స్‌లోని న్యూడెక్కన్ ట్రావెల్స్ ద్వారా 12 మందిని మక్కా యాత్రకు పంపేందుకు ఒప్పందం చేసుకున్నాడు. దాని ప్రకారం 12 మంది నుంచి రూ.70 వేలు చొప్పున వసూలు చేశాడు. ఇందుకు సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరిలో మొత్తం రూ.8.23 లక్షలను ట్రావెల్స్ యజమాని మహ్మద్ సయీద్ ఖాన్‌కు అందించాడు. అయితే అతడు 12 మందికి గాను ఏడుగురినే మక్కాకు తీసుకెళ్లాడు. మిగతావారి విషయం అడిగితే మహ్మద్ సయీద్‌ఖాన్ ముఖం చాటేశాడు.
ఆ ఐదుగురూ తమ ఇంటికి వచ్చి నిత్యం గొడవ పడుతుండటంతో తట్టుకోలేక ఉన్నదంతా ఊడ్చి వారికివ్వాల్సిన రూ.4.42 లక్షలను చెల్లించాడు. ప్రస్తుతం తన వద్ద ఇంటి అద్దెకు కూడా డబ్బు లేదని, ఈ నెల 16న జరగాల్సిన తన కూతురి వివాహం కూడా ఆగిపోయిందని, పిల్లలకు స్కూల్ ఫీజులు కూడా కట్టలేక చదువులు మధ్యలో ఆగాయని బాధితుడు చెప్పాడు. ఇక తమకు చావు తప్ప మరే మార్గం లేదని అన్నాడు. తమ వద్ద డబ్బు తీసుకున్న న్యూడెక్కన్ ట్రావెల్స్ యజమాని మహ్మద్ సయీద్ కార్యాలయం మూసుకున్నాడని, ఇదే విషయమై ఎస్.ఆర్.నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ప్రభుత్వం అనుమతి ఇస్తే తన కుటుంబంలోని తొమ్మిదిమంది ఆత్మహత్య చేసుకుంటామన్నారు. తమ ఆత్మహత్యలకు అనుమతి ఇవ్వాలని ఇప్పటికే రాష్టపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులకు లేఖలు కూడా రాసినట్లు వారు వెల్లడించారు.
'ఆత్మహత్యే శరణ్యం...అనుమతివ్వండి'
Published Wed, May 20 2015 3:45 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement