
మృతదేహాలను అంత్యక్రియలకు మోసుకెళుతున్న దృశ్యం
శ్రీరంగరాజపురం : మండలంలోని చిన్నతయ్యూరు దళితవాడలో ఓ కుటుంబానికి సంబంధించిన అందరూ మృతిచెందడంతో మంగళవారం విషాద ఛాయలు అలముకున్నాయి. చిన్నతయ్యూరు దళితవాడకు చెందిన సుధాకర్ వ్యసనాలకు బానిస అయ్యాడని, అతని భార్య సింధు ఇద్దరు ఆడపిల్లలను సోమవారం బావిలో పడేసి ఆమె కూడా ఆత్మహత్యకు పాల్పడటం.. తరువాత ఈ సంఘటను చూసి సుధాకర్ అక్కడే చెట్టుకుని ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడటం తెలిసిందే. మంగళవారం సుధాకర్(33), అతని భార్య సింధు(28), పిల్లలు మధుప్రియ(7), శ్రీలత(4) మృతదేహాలను గ్రామంలోకి తీసుకొచ్చారు. గ్రామస్తులు, బంధువులు, చుట్టు పక్కల ప్రజానీకం పెద్దఎత్తున గ్రామంలోకి చేరుకున్నారు. మృతదేహాలను చూసి వారు చలించిపోయారు. భోరున రోదించారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. భార్యాభర్తలు, ఇద్దరు పిల్లల మృత దేహాలకు శోకతప్త హృదయాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఎస్‌ఐ శ్రీనివాస్‌రావు, పోలీసు సిబ్బంది పర్యవేక్షించారు.