భూ సంబంధమైన గొడవలో కేసు పెట్టించాడనే అక్కసుతో ఓ కుటుంబాన్ని వెలి వేసిన వైనం వెలుగు చూసింది. ఇది భరించలేని ఆ కుటుంబం ఆత్మహత్యకు యత్నించింది.
మంథనిరూరల్, న్యూస్‌లైన్: భూ సంబంధమైన గొడవలో కేసు పెట్టించాడనే అక్కసుతో ఓ కుటుంబాన్ని వెలి వేసిన వైనం వెలుగు చూసింది. ఇది భరించలేని ఆ కుటుంబం ఆత్మహత్యకు యత్నించింది. గురువారం మండలంలోని సిరిపురం పంచాయతీ పరిధిలోని చిల్లపల్లిలో జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. గురువారం గ్రామస్తులంతా గ్రామ దేవతకు మొక్కులు చెల్లించే వేడుక జరుపుకున్నారు.
పోచమ్మను కొలిచేందుకు ఇంటింటికీ డబ్బులు వసూలు చేసుకొని పండుగ జరుపుకున్నారు. అయితే గ్రామానికి చెందిన తుంగల సత్తయ్య ఇంటికి ఎవరూ వెళ్లలేదు. ఆయన కుటుంబ సభ్యులను వేడుకకు పిలవలేదు. తమకు తెలియకుండానే వేడుక జరుపుకోవడంతో సత్తయ్య పెద్దమనుషుల వద్దకు వెళ్లి అడిగాడు. ఓ భూ వివాదంలో తమపై కేసు పెట్టించడంతోనే వేడుకల్లో పాల్గొనకుండా బహిష్కరించామని తేల్చి చెప్పారు. దీంతో అవమానానికి గురైన సత్తయ్య తన భార్య రాజేశ్వరితో కలిసి ఆత్మహత్యకు యత్నించగా గుమ్మడి సంపత్ అడ్డుకున్నాడు.