కష్టాలొస్తే... కన్నీళ్లొస్తాయి. ఆమెకు మాత్రం ఆ కన్నీళ్లే రక్తధారలవుతాయ్..స్వేదం.. రుధిర బిందువులుగా మారుతుంది. వైద్యులకే అంతుచిక్కని ఈ వింత వ్యాధితో ఆ యువతి నరక యాతన అనుభవిస్తోంది. తాత్కాలిక మందుల సేవనంతోనే జీవన పయనం సాగిస్తోంది. గాజుబొమ్మలా మారిన తన జీవన పయనం సాగేదెలా అంటూ దాతల సాయం కోసం వేయికళ్లతో
‘ఆశ’గా ఎదురుచూస్తోంది. ఇది ఒక వైపు..
మరోవైపు..ఆశ అక్క మేరీరత్నం ప్రభుత్వ నిధులతో ప్రారంభించిన పక్కా భవన నిర్మాణం నిధుల లేమితో అసంపూర్తిగా మిగిలిపోయింది. అక్కున చేర్చుకున్న బావ ఇటీవల బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇంటికే పరిమితమయ్యాడు. డిగ్రీ చదువుకోవల్సిన అనూష ఇదే బైక్ ప్రమాదంలో ఎడమ చేయి విరిగి చదువు మానేసి ఇంటి వద్దే ఉంటోంది. అక్క కొడుకు వీసా ప్రయత్నంలో మరో అక్క మేరీరత్నం ఎడమ కాలు విరిగిపోయింది. ఇంటర్ చదువుతున్న అక్క కొడుకు కుటుంబపోషణ కోసం ఆటో డ్రైవర్‌గా మారాడు. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఆ కుటుంబాన్ని కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి.
మర్రిపూడి (రంగంపేట): మర్రిపూడి గ్రామానికి చెందిన గంధం ఆశ. జన్మనిచ్చిన తల్లిదండ్రులు కామరాజు, దయామణిలు ఐదేళ్ల క్రితం తనువులు చాలించారు. ఆదరించాల్సిన అన్నలిద్దరూ ఆ ఏడాదే ఊరువిడిచి వెళ్లిపోయారు. కనీసం ఎక్కడ ఉన్నారో తెలియని దుస్థితి. ముగ్గురు అక్కల్లో రెండో అక్క ఏడిద ఎలుసమ్మ మర్రిపూడిలో నివాసం ఉంటూ ఐదేళ్ల నుంచి చెల్లి ఆశ(22)ను ఆదరిస్తోంది. తన చెల్లికి అంతుచిక్కని రోగంతో అన్ని అవయవాల నుంచి స్వేద రక్తంలా కారుతుంటే ఆమె తిరగని ఆసుపత్రి అంటూ లేదు. మరోవైపు మూడో అక్క మేరీరత్నం కూడా దుబాయిలో పనిచేస్తూ కుటుంబపోషణకు సొమ్ములు పంపేది.
ఆశ శరీరం నుంచి రక్తం కారుతుండడంతో ప్రస్తుతం రాయవెల్లూరులో వైద్య పరీక్షలు చేసి రోగాన్ని గుర్తించడానికి సుమారు రూ.15–20 లక్షల వ్యయమవుతుందని వైద్యులు చెబుతున్నారు. అంత ఖర్చు పెట్టే స్థోమత వారికి లేక తాడేపల్లిగూడేనికి చెందిన వైద్యులు పల్లా వెంకటేశ్వరరావు వద్ద ఉచితంగా ఇచ్చే హోమియో మందులు వాడుతూ, తాత్కాలిక ఉపశమనం పొందుతోంది. చెల్లి ఆశ బాధను చూడలేక దుబాయ్ నుంచి సుమారు పది నెలల క్రితం వచ్చిన మేరీరత్నం సుమారు రూ.ఐదు లక్షలు అప్పు చేసి, ప్రభుత్వ మిచ్చిన గృహ నిర్మాణ నిధులు రూ.38 వేలతో పక్కా భవనానికి శ్లాబ్ వేయించగలిగింది. ఆశ ఉండేందుకు వీలుగా గృహనిర్మాణం పూర్తి కావడానికి మరో రూ.రెండు లక్షలు అవసరం ఉంటుంది. మరోవైపు బావ నాగేశ్వరరావు, వీరి కుమార్తె అనూష ప్రమాదాల బారినపడి ఇంటికే పరిమితమై అర్ధాకలితో అలమటిస్తున్నారు. అక్క కొడుకు సుబ్రహ్మణ్యం ఆటో నడిపి తెచ్చే కాస్త సొమ్ముతో తొమ్మిది మంది కడుపు నింపుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
దాతలు దయ చూపాలి..
చెల్లికి మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో శతవిధాలా శ్రమిస్తున్నా. మా అక్క ఎలుసమ్మ, బావ నాగేశ్వరరావులు ఆమెను ఆదరిస్తున్నారు. వాళ్లు కష్టాల్లో ఉన్నారు. వారికి భారం కాకుండా చెల్లిని అసంపూర్తిగా ఉన్న భవనంలోనే ఉంచి సపర్యలు చేస్తున్నారు. డబ్బు సంపాదనకు మళ్లీ దుబాయ్ వెళతాను. కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో వారం రోజుల పాటు ఉంచినా ఫలితం కానరాలేదు. కనీసం రూ.20 లక్షలు ఉంటే గాని, వైద్య పరీక్షలు చేయించలేం. దాతల సాయం తప్ప వేరే గత్యంతరం లేదు.
– కాలు విరిగి మూల పడ్డ మూడో అక్క మేరీ రత్నం
మంచానికి పరిమితమయ్యా..
చిన్నప్పటి నుంచి చదువుకోవాలని, అందరిలానే తిరగాలని, ఆరోగ్యంగా గడపాలని ఉన్నా, అంతు లేని అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యాను. మాకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణం మంజూరు చేస్తే, అక్క పిల్లల సహకారంతో కిరాణా వ్యాపారం చేయాలని ఉంది. దాతలు, అక్కలు దయ చూపితే మెరుగైన వైద్యసేవలు పొందాలని ఆశ పెంచుకున్నాను.
– మంచానికే పరిమితమైన ఆశ
ప్రతిపాదనలు పంపాం..
ఆశ గృహనిర్మాణానికి ప్రభుత్వ గృహ నిర్మాణ సంస్థ ద్వారా నిధులు విడుదలకు, మెరుగైన వైద్య సేవల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. నిధులు విడుదల చేయాల్సి ఉంది.
– ఎం.కృష్ణమూర్తి, తహసీల్దార్, రంగంపేట
దాతల సాయం కోసం ఎదురు చూస్తున్న ఆశ, ఆమె కుటుంబ సభ్యులు
Comments
Please login to add a commentAdd a comment