యాచారం, న్యూస్‌లైన్: అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. సీఐ రాములు తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని నందివనపర్తి అనుబంధ గ్రామం బొల్లిగుట్టతండాకు చెందిన వర్ష్యావత్ బాషా నాయక్(40) తనకున్న రెండెకరాలతోపాటు మరో రెండెకరాలు కౌలుకు తీసుకొని పత్తి పంటను సాగు చేశాడు. గతేడాది తన పొలంలో బాషా రూ.రెండు లక్షల వరకు అప్పులు చేసి నాలుగు బోరు బావులు తవ్వించాడు. అయినా ఒక్కదానిలో కూడా నీరు పడలేదు. ఈ సారి వర్షాలు బాగానే పడటంతో పంట పెట్టుబడి కోసం మరో రూ.50 వేలు అప్పు చేసి సాగు మొదలుపెట్టాడు. కొంతకాలంగా అప్పులిచ్చిన వారినుంచి ఒత్తిడి పెరిగింది.
చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక తీవ్ర మనస్తాపానికి గురైన బాషా సోమవారం రాత్రి 9 గంటల సమయంలో తన పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రాత్రి 11 గంటలైనా భర్త తిరిగి రాకపోవడంతో బాషా భార్య కమలమ్మ పొలానికి వెళ్లి చూడగా అతడు విగతజీవిగా కనిపించాడు. మృతుడికి భార్యతోపాటు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. బాషా మృతితో ఆ కుటుంబం దిక్కులేనిదైంది. బాషా కుటుంబానికి ఆర్థిక సహాయం చేసి ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్ రాజు నాయక్ విజ్ఞప్తి చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఉసురు తీసిన అప్పులు
Published Wed, Aug 21 2013 4:07 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
Advertisement
Advertisement