సాక్షి, క్రిష్ణగిరి/ కెలమంగళం : పంట పొలాలపై పడి ధ‍్వంసంచేయడమే కాక అటవీ పరిసర గ్రామాలపై దాడిచేస్తూ ఏనుగుల గుంపు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. డెంకణీకోట సమీపంలోని నగనూరు అటవీ ప్రాంతంలో మకాం వేసిన 20 ఏనుగుల మంద పంటపొలాలపై దాడి చేసి ధ‍్వంసం చేస్తున్నాయి.
రెండు నెలల క్రితం కర్ణాటక రాష్ట్రం బన్నేరుగట్ట అటవీ ప్రాంతం నుండి వచ్చిన ఏనుగులు గుంపులుగా విడిపోయి డెంకణీకోట సమీపంలోని బేవనత్తం, నగనూరు, అంచెట్టి, జవుళగిరి, తావరకెరె ప్రాంతాలలో మకాం వేశాయి. డెంకణీకోట సమీపంలోని తావరకెరె అటవీ ప్రాంతంలో మకాం వేసిన 20 ఏనుగుల మంద ఆదివారం రాత్రి నగనూరు, మరగట్ట, ఏణిముచ్చంద్రం, ఆలళ్లి, కురుబట్టి, సందనపల్లి తదితర ప్రాంతాల్లో సంచరిస్తూ రైతులు పండించిన రాగి కుప్పలను ధ‍్వంసం చేశాయి. అదేవిధంగా బేవనత్తం అటవీ ప్రాంతంలో మకాం వేసిన 30 ఏనుగులు ఊడేదుర్గం ప్రాంతంలో రైతుల పంటపొలాలను ధ‍్వంసం చేస్తున్నాయని అటవీ శాఖాధికార్లు చర్యలు చేపట్టి ఏనుగులను కర్ణాటక వైపు మళ్లించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
అలాగే సూళగిరి సమీపంలో ఏనుగులు గ్రామాలకు చొరబడుతుండడంతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురౌతున్నారు. కొద్ది రోజుల క్రితం శ్యానమావు అటవీ ప్రాంతంలో మకాం వేసిన ఏనుగులను అటవీశాఖాధికార్లు డెంకణీకోట అటవీ ప్రాంతానికి మళ్లించారు. ఈ తరుణంలో మళ్లీ కొన్ని ఏనుగులు శ్యానమావు అటవీ ప్రాంతంలో మకాం వేసి పోడూరు, ఆళియాళం, గోపసంద్రం, తిరుమలపేట, రామాపురం, పాతకోట ప్రాంతాల్లో రైతుల పంటపొలాలను ధ‍్వంసం చేయడమే కాక గ్రామాలకు చొరబడుతుండడంతో ఆ ప్రాంత గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురౌతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment