పెడన రూరల్ (కృష్ణా జిల్లా) : పోర్టు భూసేకరణలో తనకున్న కొద్దిపాటి పొలం పోతుందనే భయంతో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పెడన పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పెడన ఎస్‌ఐ ఎ.గణేష్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా పెడన మండలం కాకర్లమూడి గ్రామానికి చెందిన లింగం వెంకటేశ్వరరావు(70)కు పది సెంట్ల భూమి ఉంది. దీంతోపాటు మరో ఎకరం కౌలుకు తీసుకుని జీవనం సాగిస్తున్నాడు. తన సొంత పొలంలో ఉద్యానవన పంటలైన ఆకు కూరలు, కూరగాయలు పండిస్తున్నాడు. వెంకటేశ్వరరావు భార్య గతేడాది మృతి చెందింది. ఆయనకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వారిలో ఒక కుమారుడు మృతిచెందాడు. ఇటీవల తనకున్న పది సెంట్ల భూమిని వెంకటేశ్వరరావు అమ్మకానికి పెట్టాడు. స్థానిక రైతు ఒకరు లక్ష రూపాయలకు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకొని రూ.10 వేలు అడ్వాన్సు ఇచ్చాడు. ఆ సొమ్ముతో ఈ నెల 30న తన భార్య సంవత్సరీకం చేయాలని వెంకటేశ్వరరావు నిర్ణయించుకున్నాడు.
ఇంతలో బందరు పోర్టు భూసేకరణలో బందరు మండలంలోని పలు గ్రామాలతో పాటు పెడన మండలం కాకర్లమూడిలోని 1879 మంది రైతులకు చెందిన 864 ఎకరాల భూమిని పోర్టు కోసం సేకరించేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు. అందులో వెంకటేశ్వరరావు భూమి కూడా ఉండటంతో దానిని కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకున్న రైతు అడ్వాన్సు సొమ్ము వెనక్కి తీసుకున్నాడు. పొలం ఉన్నప్పటికీ యాభయ్యేళ్లు కలిసి జీవించిన భార్యకు సంవత్సరీకం కూడా చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నానని ఇటీవల పలువురు వద్ద అతను ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం తన ఇంటి ఎదురుగా ఉన్న వేప చెట్టుకు తాడుతో ఉరి వేసుకుని ప్రాణాలొదిలాడు. మృతుడి కుమారుడు స్వాములు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెడన ఎస్‌ఐ ఎ.గణేష్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
భూసేకరణ భయంతో రైతు ఆత్మహత్య
Published Fri, Sep 25 2015 6:59 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement