కుసుమలక్ష్మి(ఫైల్)
సాక్షి, కృష్ణా జిల్లా(పెడన): వరకట్న వేధింపులు తాళలేక వివాహిత ఉరి వేసుకున్న సంఘటన పెడన పట్టణంలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని 12వ వార్డు కాపులవీధిలో పిచ్చుక దేవేంద్రకుమార్, కుసుమలక్ష్మి(19) నివాసం ఉంటున్నారు. దేవేంద్రకుమార్ తాపీ పనిచేస్తూ ఉంటాడు. భార్యభర్తల మధ్య తరచూ వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. గురువారం ఉదయం కూడా గొడవ జరగడంతో కుసుమలక్ష్మి తన తల్లి భట్ట నాగేశ్వరమ్మకు ఫోన్ చేసి పరిస్థితి వివరించింది. తాను వస్తున్నానని.. గొడవ పడవద్దని చెప్పి.. కుసుమ ఇంటికి నాగేశ్వరమ్మ బయల్దేరింది.
తల్లి ఇంటికి చేరేసరికి కుసుమలక్ష్మి తన ఇంట్లోని దూలానికి చీరతో ఉరి వేసుకుని ఉంది. తల్లి గమనించి చుట్టుపక్కవాళ్లను పిలిచి కుసుమలక్ష్మిని మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లింది. అయితే అప్పటికే చనిపోయినట్లు ధ్రువీకరించిన ఆస్పత్రి సిబ్బంది అవుట్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు పెడన పోలీసులకు సమాచారం ఇచ్చారు. కుసుమలక్ష్మి భర్త పిచ్చుక దేవేంద్రకుమార్, అత్త శ్యామలమ్మ, బావ ప్రసాద్, ఆడపడుచు సుహాసినిలు అధికకట్నం కోసం తరచూ వేధించేవారని, ఈ వేధింపులు వల్ల తన కుమార్తె చనిపోయిందని తల్లి నాగేశ్వరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. సీఐ ప్రసన్నవీరయ్యగౌడ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: (బోసినవ్వులు కనుమరుగు: ఏమైందో ఏమో ఒకరితర్వాత ఒకరు..)
ఐదు వారాల గర్భవతి..
పట్టణంలోని 9వ వార్డు రాజీవ్‌నగర్‌లో వేర్వేరుగా ఉండే దేవేంద్రకుమార్, కుసుమలక్ష్మిలు 2021 ఏప్రిల్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అందుకు ఇరుపక్షాల పెద్దలు కూడా అంగీకరించారు. మూడు నెలలు దేవేంద్రకుమార్ తల్లిదండ్రుల వద్దే ఉంటూ కాపురం చేశారు. ఆ తర్వాత గొడవలు కావడంతో పెద్దల సూచనలతో 12వ వార్డులోని అద్దె ఇంట్లో కాపురానికి దిగారు. అయినా గొడవలు సద్దుమణగలేదు. తన కుమార్తె ఐదువారాల గర్భవతి అని, బుధవారం ఆస్పత్రికి తీసుకువెళ్లి చూపించానని తల్లి నాగేశ్వరమ్మ కన్నీరుమున్నీరవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment