బావిని పరిశీలిస్తున్న డీఎస్పీ, సీఐ , ఆత్మహత్య చేసుకున్న చేతన
సీతంపేట: వరకట్న వేధింపులకు మరో వివాహి త బలైంది. పుట్టింటి నుంచి బంగారం తేవాలని భర్త, అత్తమామలు వేధించడంతో తట్టుకోలేక సీతంపేట మండలం గుజ్జి గ్రామానికి చెందిన నారంశెట్టి చేతన(23) మంగళవారం సాయంత్రం బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న డీఎస్పీ స్వరూపారాణితో పాటు కొత్తూరు సీఐ జె.శ్రీనివాసరావు, ఎస్‌ఐ కె.రాము, తహసీల్దార్ శ్రీనివాస్‌లు సంఘటన స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. పోలీసులు, బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం...
హిరమండలం మండలం భగీరథపురం కాలనీకి చెందిన చేతనతో గుజ్జి గ్రామానికి చెందిన శివకృష్ణకు గత ఏడాది మార్చి 15న వివాహమైంది. అప్పటి నుంచి భర్త అదనపు కట్నం కోసం వేధిస్తుండేవాడు. మృతురాలి మామ సూర్యనారాయణ, అత్త హేమలత తోటికోడలు కుసుమలు కూడా తరచూ అదనపు కట్నం కోసం డిమాండ్ చేసేవారు. వేధింపులు తారస్థాయికి చేరుకోవడంతో తరచూ ఇంటి వద్ద గొడవలు పడేవారు. చేతన తన భర్తతో ఇటీవల సంక్రాంతి పండగ కోసం భగీరథపురంలోని కన్నవారింటికి వచ్చింది. తనకు తులం బంగారం కావాలని అల్లుడు అడగ్గా పావుతులం బంగారం ఇచ్చి మిగతాది తర్వాత ఇస్తామని నచ్చజెప్పి పంపించేశారు.
స్వగ్రామమైన గుజ్జి వచ్చినప్పటి నుంచి వేధింపులు ఎక్కువ కావడంతో చేతన మంగళవారం మధ్యాహ్నం గ్రామానికి కొద్ది దూరంలో ఉన్న బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు గుజ్జి చేరుకుని గుండెలవిసేలా రోదించారు. తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిదికాదని, బలవంతంగా చంపేసి బావిలో పడేసి ఉంటారని తల్లిదండ్రులు నారాయణమూర్తి, సుశీల, కుటుంబ సభ్యులు ఆరోపించారు. 9 నెలల కిందట వివాహమైనప్పుడు నాలుగు తులాల బంగారం ఇచ్చామని, అప్పటి నుం చే అల్లుడు, అత్తామామలు, తోటికోడలు తమ కుమార్తెను అనేక రకాలుగా వేధించి పొట్టనబెట్టుకున్నారని కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతురాలి తండ్రి మల్ల నారాయణమూర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పాలకొండ డీఎస్‌పీ కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment