దేవుడా.. ఎంతపని చేశావ్‌..! | farmer died due to current shock in kadapa district | Sakshi
Sakshi News home page

దేవుడా.. ఎంతపని చేశావ్‌..!

Published Sun, Jul 30 2017 12:12 PM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM

దేవుడా.. ఎంతపని చేశావ్‌..! - Sakshi

దేవుడా.. ఎంతపని చేశావ్‌..!

► అప్పులు తీరుతాయని ఆశిస్తే..
    మనిషే లేకుండా పోయాడంటూ విలపిస్తున్న కుటుంబ సభ్యులు
► శోకసంద్రంలో మల్లేల
► పలువురు వైఎస్సార్‌సీపీ నాయకుల నివాళి


తొండూరు: ఒక నెల రోజులు ఆగామంటే పంట చేతికొస్తుంది.. ఇప్పుడు మార్కెట్లో మంచి ధర ఉంది. ఆ పంటను అమ్ముకుంటే చాలు.. మన అప్పులన్నీ తీరిపోతాయి.. అంటూ జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ కుటుంబంపై విధి చిన్న చూపు చూసింది. కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న టమాటా పంటకు నీటి తడులు అందించేందుకు పొలం వద్దకు వెళ్లిన రైతు పాలిట విద్యుత్‌ తీగ మృత్యుపాశంలా మారింది. తొండూరు మండలం మల్లేల గ్రామానికి చెందిన మహేశ్వర(32) అనే రైతు శుక్రవారం సాయంత్రం తన పొలంలో టమాటా పంటకు నీటి తడులు ఇచ్చేందుకు వెళ్లాడు.

 అక్కడ కిందకు వేలాడుతున్న విద్యుత్‌ తీగ తగులుకుని అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. నెల రోజుల్లో పంట చేతికొస్తుంది.. మన కష్టాలన్నీ తీరిపోతాయని ఎంతో ఆశగా ఉంటిమి కదయ్యా.. ఇప్పుడు ఆ దేవుడు నిన్నే లేకుండా చేశాడే.. అంటూ ఆ రైతు భార్య ప్రవీణ కన్నీరు మున్నీరుగా విలపిస్తుంటే  ప్రతి ఒక్కరూ కంట తడిపెట్టారు.

ఎక్కడికి వెళ్లినా కలిసి వెళ్లేవారు
తోట పని కానీ, వ్యవసాయ పనులు కానీ.. ఇంటిలోకి నిత్యావసర సరుకులు తేవాలన్నా.. ఎక్కడికైనా శుభకార్యాలకు వెళ్లాలన్నా భార్యాభర్తలు ఇద్దరు కలిసి వెళ్లేవారు. ఎంతో అన్యోన్యంగా ఉంటున్న ఆ దంపతులను ఇప్పుడు దేవుడు వేరు చేశాడంటూ గ్రామస్తులు, బంధువులు కన్నీటి పర్యంతమవుతున్నారు. మహేశ్వర మృతదేహంపై పడి భార్య ప్రవీణ నేను ఎలా బతకాలి దేవుడా.. ఇద్దరం కలిసి మెలసి తిరుగుతుండేవాళ్లం.. ఒక్కరోజు కూడా వేరుగా మేం ఉండలేదంటూ రోదిస్తుంటే ఆమెను ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. మహేశ్వర మృతదేహాన్ని పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ మేరకు ఎస్‌ఐ శ్రీనివాసులు కేసు నమోదు చేశారు.

మల్లేలలో విషాద ఛాయలు..
మల్లేల గ్రామానికి చెందిన  రైతు మహేశ్వర (32) విద్యుదాఘాతంతో మృతి చెందాడన్న విషయం తెలియగానే మల్లేల గ్రామంలో వి షాద ఛాయలు అలుముకున్నాయి. వారం రోజుల క్రితం మల్లేల దళితవాడకు చెందిన ఓబులు పాము కాటుకు గురై మృతి చెందా డు. ఒకే గ్రామంలో వారం రోజుల వ్యవధిలో ఇద్దరు మృతి చెందడం వల్ల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

మహేశ్వర కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్సార్‌సీపీ నాయకులు  
మల్లేల గ్రామానికి చెందిన రైతు మృతి చెందాడన్న విషయం తెలుసుకున్న వైఎస్సార్‌ సీపీ మండల నాయకుడు భూమిరెడ్డి రవీంద్రారెడ్డి సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి అనంతరం మహేశ్వర మృతదేహానికి నివాళులర్పించారు. అలాగే వైఎస్సార్‌సీపీ నాయకులు, న్యాయవాది తులసీరాం యాదవ్, మాజీ సర్పంచ్‌లు రత్నమయ్య, గంగులయ్య, సోమశేఖర, జింకా కుమార్, షఫీ, నాగరాజు, రంగారెడ్డి, అమరనాథరెడ్డి తదితరులు కూడా నివాళులర్పించిన వారిలో ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement