రుణమాఫీ కాలేదని బ్యాంకులోనే ఆగిన గుండె
తనకు రుణమాఫీ రాలేదన్న ఆవేదనతో ఓ రైతు బ్యాంకులోనే గుండె పోటుతో మరణించాడు. బాధితులు తెలిపిన వివరాలు మేరకు బుక్కరాయసముద్రం మండలం రేకులకుంట గ్రామానికి చెందిన గోసల పూజారి నాగన్న(65), అతడి భార్య రామలక్ష్మి వ్యవసాయం చేసుకుంటూ జీవనం గడిపేవారు. నాగన్నకు రేకులకుంటలో 10 ఎకరాల పొలం ఉంది. వీటిపై సహకార బ్యాంకులో రూ. 6 వేలు, బీకేయస్ స్టేట్ బ్యాంక్‌లో బంగారంపై రూ. 50 వేలు, క్రాప్ లోను మరో రూ. 50 వేలు రుణాలున్నాయి. అయితే ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీలో రెండు జాబితాల్లోను నాగన్న పేరు రాలేదు. దీంతో నాగన్నకు ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు.
వీటిపై తమ తండ్రి రెండు దపాలుగా బ్యాంక్ అధికారులకు, రెవెన్యూ అధికారులకు పత్రాలన్నీ అందజేసినట్లు నాగన్న కుమారులు పెద్ద నారాయణస్వామి, సన్న నారాయణస్వామి, శివయ్య తెలిపారు. సోమవారం ఉదయాన్నే 9 గంటలకు నాగన్న సహకార సంఘం సొసైటి కార్యాలయానికి చేరుకుని మరోసారి తన రుణమాఫీ ఏమైందో కనుక్కుందామని వచ్చాడు. ఉదయమే సొసైటీ అధికారులు ఎవ్వరూ రాకపోవడంతో కార్యాలయం ఎదుట ఉన్న కట్టపై కూర్చుని మనోవేదనతో పడిపోయాడు. స్థానికులు చేరుకుని ఏమైందో అని తెలుసుకునేసరికి చనిపోయాడని నిర్ధారించుకుని బంధువులకు సమాచారం అందించారు.