పెప్సీపై సమరశంఖం | Farmer Tiff worries PepsiCo Headquarters | Sakshi
Sakshi News home page

పెప్సీపై సమరశంఖం

Published Tue, Apr 30 2019 5:33 AM | Last Updated on Tue, Apr 30 2019 5:33 AM

Farmer Tiff worries PepsiCo Headquarters - Sakshi

సాక్షి, అమరావతి: బహుళ జాతి కంపెనీ పెప్సీ ఉత్పత్తుల బహిష్కరణకు రాష్ట్ర రైతు సంఘాలు పిలుపిచ్చాయి. రైతుల ప్రయోజనాన్ని కాంక్షించే వారందరూ ఈ కంపెనీ లేస్‌ పేరిట తయారు చేస్తున్న బంగాళాదుంపల చిప్స్‌ను, పెప్సీ శీతల పానీయాన్ని దూరం పెట్టాలని విజ్ఞప్తి చేశాయి. దేశీయ రైతాంగంపై పెప్సీ కంపెనీ పెత్తనమేమిటంటూ ధ్వజమెత్తాయి. ఈ కంపెనీ తీరును నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘాలు, కౌలు రైతుల సంఘం, సీఐటీయూ కార్మిక సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల పిలుపు మేరకు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, ధర్నాలు, పెప్సీ ఉత్పత్తుల దహనం వంటి ఆందోళన కార్యక్రమాలు జరిగాయి.

గుజరాత్‌ రాష్ట్రంలో బంగాళదుంపలు పండించే రైతులపై పెప్సీ కంపెనీ పెట్టిన కేసుల్ని ఉపసంహరించాలని డిమాండ్‌ చేశాయి. అంతర్జాతీయ ఒప్పందాల మాటున రైతులు సొంతంగా విత్తనాలు ఉత్పత్తి చేసుకునే వెసులుబాటును కంపెనీలు కాలరాస్తున్నాయని మండిపడ్డాయి. నాటి ఈస్టిండియా కంపెనీ దోపిడీకి ప్రస్తుత పెప్సీ కంపెనీ దోపిడీకి తేడా లేదని దుమ్మెత్తిపోశాయి. దేశంలోని రైతులు, పంటలు, ఆదాయాలు, ఆహార భద్రత, వ్యవసాయ స్వాతంత్య్రం, దేశ సార్వభౌమాధికారంపై పెప్సీ కేసు ప్రభావం చూపుతుందని విజయవాడలో ధర్నా చేసిన రైతు సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పెప్సీ కంపెనీ తప్పుడు సంప్రదాయానికి శ్రీకారం చుడుతోందని, ఈ తీరును మొగ్గలోనే తుంచేయకపోతే మున్ముందు రైతులు విత్తనాన్ని తయారుచేసుకునే స్వాతంత్య్రాన్నే కోల్పోతారని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. పెప్సీ కంపెనీ వైఖరిని గర్హిస్తూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ఆందోళనలు సాగినట్టు రైతు సంఘాల నేతలు పి.పెద్దిరెడ్డి, పి.జమలయ్య, కేవీవీ ప్రసాద్‌ తదితరులు ప్రకటించారు. విత్తన స్వేచ్ఛను హరించే పీపీవీఎఫ్‌ఆర్‌ చట్టం (వంగడాల రకాలు, రైతుల హక్కుల చట్టం–2001)లోని సెక్షన్ల తొలగింపునకు చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ వ్యవహారమై త్వరలో అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహిస్తామని చెప్పారు.

ఇదీ వివాదం..!
లేస్‌ బ్రాండ్‌ పేరిట చిప్స్‌ తయారీకి బహుళజాతి పెప్సీ కంపెనీ ఎఫ్‌సీ–5  రకం బంగాళదుంపపై గుత్తాధిపత్యాన్ని సంపాదించింది. ఆ రకం దుంపను తాము గుర్తించిన రైతులు మాత్రమే సాగు చేసేలా గుజరాత్‌ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇది తెలియని నలుగురు గుజరాత్‌ రైతులు ఆ రకం దుంపను సాగు చేశారు. దీన్ని ఆక్షేపిస్తూ ఆ నలుగురి రైతులపై అహ్మదాబాద్‌ సిటీ కోర్టులో పెప్సీ కంపెనీ వ్యాజ్యం వేసింది. ఒక్కో రైతు నుంచి ఒక కోటీ ఐదు లక్షల రూపాయలను నష్ట పరిహారంగా ఇప్పించాలని కోరింది. కోర్టు తాము తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఆ రకం దుంపను సాగు చేయవద్దని ఆదేశించింది.

ఈ సమయంలోనే పెప్సీ కంపెనీ.. కోర్టు బయట కేసును పరిష్కరించుకుంటామని కోరింది. అయితే తమ కంపెనీకి కేటాయించిన ఎఫ్‌సీ–5 రకం విత్తనాలను తమ నుంచే కొనుగోలు చేయాలని, పండించిన ఆ దుంపను తమ కంపెనీకే అమ్మాలని ఆంక్షలు పెట్టింది. భవిష్యత్‌లో ఈ విత్తనాలను సాగు చేయకుండా రైతులు తమతో ఒప్పందానికి రావాలని కూడా డిమాండ్‌ చేసింది. ఇది రైతులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది.

పెప్సీ ఆంక్షలను ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమని, తమపై పెప్సీ పెత్తనమేమిటని ఎఫ్‌సీ–5 రకం దుంపను సాగు చేసిన నలుగురు రైతుల్లో ఒకరైన వినోద్‌ కుమార్‌ తేల్చి చెప్పారు. పెప్సీ కంపెనీ ప్రతిపాదనను అంగీకరించినట్టయితే తాము తప్పు చేసినట్టవుతుందని వాదించారు. ఈ కేసు తదుపరి విచారణ జరిగే జూన్‌ 12 నాటికి తాము రైతులు, రైతు సంఘాలతో చర్చించి ఒక నిర్ణయం చెబుతామని కోర్టుకు నివేదించారు.

దేశవ్యాప్తంగా రైతు సంఘాల పోరుబాట
పెప్సీ కంపెనీ తీరును తప్పుబడుతూ దేశవ్యాప్తంగా రైతు సంఘాలు పోరు బాట పట్టాయి. దీనికి నానాటికీ మద్దతు పెరుగుతోంది. దేశంలోని 190కి పైగా రైతు సంఘాలు, శాస్త్రవేత్తలు, కార్మిక సంఘాల నేతలు దేశ ప్రజలకు విజ్ఞాపన చేస్తూ పెప్సీ కంపెనీ ఉత్పత్తులను బహిష్కరించాలని పిలుపిచ్చారు. ఆ నలుగురు రైతుల తరఫున కేసును వాదిస్తున్న ఆనంద్‌ యాజ్ఞిక్‌ పెప్సీ ఒప్పందాన్ని అసంబద్ధమైందిగా అభివర్ణించారు. అధిక ధరకు రైతులు విత్తనాలు కొని, పంటను పండించిన తర్వాత తక్కువ ధరకు అమ్ముకోవాలని పెప్సీ కంపెనీ చెబుతోందని, ఇదెలా సాధ్యమని ప్రశ్నించారు. మొత్తం మీద ఇప్పుడు పెప్సీ కంపెనీ వ్యవహారం చినికి చినికి గాలివానలా తయారైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement