
‘ఆత్మహత్య చేసుకుంటా... అనుమతించండి’
నీటిపారుదల శాఖ అధికారుల నిర్వాకం వల్ల 25 ఏళ్లుగా పంట నష్టపోయానని, ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఓ రైతు మానవ హక్కుల కమిషన్‌కు దరఖాస్తు చేసుకున్నాడు.
పాయకరావుపేట (విశాఖపట్నం): నీటిపారుదల శాఖ అధికారుల నిర్వాకం వల్ల 25 ఏళ్లుగా పంట నష్టపోయానని, ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఓ రైతు మానవ హక్కుల కమిషన్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం మంగవరానికి చెందిన దేవవరపు వాసుదేవరావు తన గాధను విలేకరులకు వివరించారు. 1990 నుంచి గోపాలపట్నం కాలువ నీటివల్ల పంటలు మునిగిపోతున్నాయి. ఫలితంగా పంటనష్టం జరుగుతోంది. ఇదే ప్రాంతంలో వాసుదేవరావుకు ఐదెకరాల భూమి ఉంది. ఏటా పంట నష్టపోతున్నా ప్రభుత్వ పరంగా ఒక్కసారి కూడా నష్టపరిహారం మంజూరు కాలేదని ఆయన తెలిపారు. కాలువలో పూడిక తొలగించాలని, రక్షణ గోడ నిర్మించాలని.. 2006 నుంచి కలెక్టర్‌కు, ఇరిగేషన్ అధికారులకు వినతి పత్రాలు పంపుతున్నా పట్టించుకోలేదన్నారు.
ఆఖరికి తన భూమి పరిధిలో సొంత నిధులతో కాలువ రక్షణ గోడ నిర్మాణం చేపట్టేందుకు అనుమతి కోరగా రూ.30 వేలు లంచం ఇవ్వాలని అధికారులు డిమాండ్ చేశారని వాసుదేవరావు ఆరోపించారు. పంటనష్టంతో అప్పులపాలైన తనకు ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఆదివారం మానవహక్కుల కమిషన్‌కు దరఖాస్తు చేసినట్టు వాసుదేవరావు తెలిపారు. సోమవారం ఆన్‌లైన్‌లో లోకాయుక్తకు కూడా ఫిర్యాదు చేశానని వెల్లడించారు. కాగా రైతు ఆరోపణలపై ఇరిగేషన్ ఏఈ సత్యనారాయణదొరను వివరణ కోరగా నిబంధనల ప్రకారం శాఖ అనుమతితో రాతి గోడ నిర్మించుకోవాలని సూచించామని చెప్పారు.