
కర్నూలు(సెంట్రల్): తూర్పుగోదావరి జిల్లా మండపేటకు చెందిన కాళీకృష్ణ భగవాన్(20) అనే యువకుడి ఆత్మహత్యపై పూర్తి విచారణ జరిపించాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ బుధవారం ఆదేశించింది. అడిషనల్ జిల్లా ఎస్పీ స్థాయి అధికారితో విచారణ జరిపించాలని, ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ తూర్పు గోదావరి ఎస్పీ, రామచంద్రాపురం డీఎస్పీ, మండపేట సీఐ (ప్రస్తుతం వీఆర్), మండపేట స్టేషన్ ఆఫీసర్లకు నోటీసులు జారీ చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై ఏప్రిల్ 11వ తేదీలోపు నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
ప్రేమ వ్యవహారంలో ప్రియురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మండపేట టౌన్ సీఐ దుర్గప్రసాద్ కాళీకృష్ణ భగవాన్‌ను స్టేషన్‌కు పిలిచి మర్మావయం దగ్గర గాయపడేలా కొట్టారని, అవమానాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయాడనేది ప్రధాన ఆరోపణ. పోలీసుల తీరుపై కుటుంబ సభ్యులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేసి మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ ఘటనపై మీడియాలో వచ్చిన వార్తను హెచ్‌ఆర్‌సీ సుమోటోగా స్వీకరించింది. హెచ్‌ఆర్‌సీ చైర్మన్ జస్టిస్ మంధాత సీతారామమూర్తి, జ్యుడిషియల్ సభ్యుడు దండే సుబ్రమణ్యం, నాన్ జ్యుడిషియల్ సభ్యుడు జి.శ్రీనివాసరావు నోటీసులు జారీ చేసినట్లు సెక్షన్ ఆఫీసర్ బి.తారక నరసింహకుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment