గ్యాంగ్‌స్టర్ సునీల్ పేరు చెబితే.. ప్రొద్దుటూరు వాసులు గడగడలాడే వారు... ఇక ఆయన నుంచి ఫోన్ వచ్చిందంటే వణికిపోయే వారు... ఎందుకంటే అతడి అరాచకాలు అలా ఉండేవి... డబ్బు కోసం శ్రీమంతుల్ని బెదిరించేవాడు...
ఇవ్వకపోతే వారి కుటుంబ సభ్యుల్ని కిడ్నాప్ చేసే వాడు... అప్పటికీ ఇవ్వని పక్షంలో చంపేసే వాడు... దీంతో చాలా మందికి కంటి మీద కునుకు ఉండేది కాదు... ఈ క్రమంలో సునీల్ చనిపోవడంతో వారంతా ప్రశాంతంగా ఉంటున్నారు.
ప్రొద్దుటూరు క్రైం : రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో సునీల్.. పేరు మోసిన నేరస్తుడు. అతను ఇంటర్మీడియట్‌ను మధ్యలో వదిలేశాడు. జులాయిగా తిరిగే యువకులతో బ్యాచ్ ఏర్పాటు చేసుకుని.. పెద్ద నెట్‌వర్క్ నడిపాడు.
మారుమూల గ్రామం నుంచి జిల్లా కేంద్రం వరకు ప్రతి చోట తన అనుచరులను ఏర్పాటు చేసుకున్నాడు. మధ్యలో చదువు మానేసిన వారే ఎక్కువగా ఉండే వారు. మందు, బిరియాని, ఖరీదైన వస్తువులను కొనిస్తూ వారిని ఆకర్షించాడు.
ముఖ్య అనుచరులైన వారిని హైదరాబాద్‌కు తీసుకెళ్లి సినీ రంగుల ప్రంపంచాన్ని కూడా చూపించాడు. ఇలా యువకులను ఆయుధంగా చేసుకొని సునీల్ తన నేర సామ్రాజ్యాన్ని విస్తరింపచేశాడు.
యువకులే ఆయుధంగా..
ప్రొద్దుటూరు మండలంలోని కొత్తపేట గ్రామానికి చెందిన మండ్ల వెంకట సునీల్‌కుమార్ తల్లి కొన్నేళ్ల క్రితం చనిపోయారు. తండ్రి, చెల్లెలు ఉన్నారు. సునీల్ కొన్ని నెలలు ఆటో డ్రైవర్‌గా పని చేశాడు. ఆటో నడుపుకునే సమయంలోనే ఎర్రచందనం స్మగ్లర్‌లతో పరిచయం ఏర్పడింది. ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ కొన్ని సార్లు పోలీసులకు దొరికాడు.
స్టేషన్‌కు వెళ్లడం.. బయటికి రావడం షరామామూలే అయింది. కొందరు పోలీసు అధికారులు, సిబ్బందికి లంచాలు ఇచ్చి.. వారి నుంచి సహకారం పొందే వాడు. క్రమేణ కిడ్నాప్‌లకు శ్రీకారం చుట్టాడు. ఈ క్రమంలోనే ఇంజినీరింగ్, డిగ్రీ చదువుతున్న, మానేసిన యువకులను చేరదీశాడు.
వీరి ద్వారా కిడ్నాప్‌లు చేయడం ప్రారంభించాడు. ప్రొద్దుటూరులోనే 50 మంది దాకా అనుచరులను ఏర్పరుచుకున్నాడు. సీమ వ్యాప్తంగా స్థానికంగా ఉన్న బ్యాచ్‌లతో పరిచయాలు పెంచుకుని.. వారిని తన గ్యాంగ్‌లో కలుపుకొన్నాడు. ఇలా దాదాపు 400 మందితో తన గ్యాంగ్‌ను విస్తరింప చేశాడు.
శ్రీమంతులపై కన్ను
సునీల్ టార్గెట్ అంతా డబ్బున్న వారే. వారిని బెదిరించి, వేధింపులకు గురి చేసే వాడు. సీమ వ్యాప్తంగా ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడే వాడు. అతడిది ప్రొద్దుటూరే కావడం.. ఈ ప్రాంతంలో శ్రీమంతులు అధికంగా ఉండటంతో ఎక్కువగా దృష్టి సారించాడు.
సునీల్ దందాలను కర్నూలు జిల్లా జలదుర్గానికి చెందిన అప్పటి ఎస్‌ఐ జయన్న బయట పెట్టగలిగారు. ఆయన విచారణలోనే ప్రొద్దుటూరులోని పలువురు వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలను కిడ్నాప్ చేయాలని సునీల్ వ్యూహ రచన చేసినట్లు తెలిసింది.
ఆ ఎస్‌ఐ ఇచ్చిన సమాచారంతో ప్రొద్దుటూరు పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రొద్దుటూరులోని ప్రముఖ బంగారు వ్యాపారితోపాటు ఆయన కుమారుడ్ని కిడ్నాప్ చేయడానికి స్కెచ్ వేశాడు. హైదరాబాద్‌తోపాటు ప్రొద్దుటూరులోని ఆయన ఇంటి వద్ద పలుమార్లు ప్రయత్నించి, విఫలమయ్యాడు.
ఈ విషయం పోలీసుల విచారణలో తేలింది. ప్రొద్దుటూరుతోపాటు జిల్లాలో సునీల్ బాధితులు చాలా మంది ఉన్నట్లు తెలుస్తోంది. ప్రాణ భయంతో వీరు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. సునీల్ ఆత్మహత్య వార్త తెలియడంతో వీరంతా ఊపిరి పీ ల్చుకున్నారు.
ప్రొద్దుటూరులోని వన్‌టౌన్‌లో మూడు కేసులు, త్రీటౌన్‌లో మూడు, రూరల్ పోలీస్‌స్టేషన్‌లో రెండు కేసులు సునీల్‌పై నమోదయ్యాయి. సీమ వ్యాప్తంగా 19 కేసులు నమోదయ్యాయి.
సునీల్ దందాలు బయట పడిందిలా..
ప్రొద్దుటూరుకు చెందిన వాసురాంప్రసాద్ తాడిపత్రిలోని వంశీ మెడికల్ స్టోర్ నిర్వహిస్తుండే వాడు. వాసురాంప్రసాద్ తండ్రికి సునీల్ ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడు. ఆయన పట్టించుకోక పోవడంతో 2013 ఫిబ్రవరిలో జలదుర్గం పోలీస్‌స్టేషన్ పరిధిలో వాసురాంప్రసాద్‌ను హత్య చేశారు. ఈ కేసును ఎస్‌ఐ జయన్న చాలెంజ్‌గా తీసుకున్నారు. అప్పటికే ప్రొద్దుటూరులో డాబాపై దాడి చేసిన కేసు సునీల్‌పై నమోదైంది.
వాటి ఆధారంగా ఎస్‌ఐ జయన్న.. సునీల్ ముఠా సభ్యులపై ఆరా తీశారు. డాబా కేసులో ఇద్దరు యువకులు ప్రొద్దుటూరు సబ్‌జైల్లో ఉంటూ బెయిల్‌పై బయటికి రావడంతో ఎస్‌ఐ వారిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వాసూరాం ప్రసాద్‌ను హత్య చేసినట్లు వారు అంగీకరించారు. ఈ కేసులో మరో 10 మంది ముఠా సభ్యులు ఉన్నట్లు పోలీసులు గ్రహించారు. వారంతా హైదరాబాద్‌లో ఉన్నట్లు టవర్ లొకేషన్‌న్‌ద్వారా తెలుసుకొని పోలీసులు అక్కడికి వెళ్లారు.
అక్కడ సునీల్‌తోపాటు మరో ఆరుగురిని అదుపులోకి తీసుకొని కర్నూలుకు తరలించారు. 10 కిడ్నాప్‌లు చేసినట్లు హైదరాబాద్ నుంచి కర్నూలుకు వచ్చేలోపే సునీల్ ఎస్‌ఐకి వివరించాడు. జలదుర్గం ఎస్‌ఐ దర్యాప్తు ఫలితంగా గ్యాంగ్‌లీడర్, కిడ్నాపర్ సునీల్ దందాలు బయట పడ్డాయి.
వాసురాంప్రసాద్‌ను హత్య చేసిన కేసులో సునీల్‌కు జీవిత ఖైదు పడింది. ఈ శిక్షను కడప సెంట్రల్ జైలులో అనుభవిస్తున్న సునీల్ శుక్రవారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ప్రొద్దుటూరులోని శ్రీమంతుల్లో భయం వీడింది.
మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు
రాయచోటి అర్బన్: కడప సెంట్రల్ జైలులో జీవిత ఖైదును అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ సునీల్‌కుమార్‌ను అధికారులే పథకం ప్రకారం అంతమొందించారని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని ఓపీడీఆర్ రాష్ట్ర సహాయ కార్యదర్శి టి.ఈశ్వర్ జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఆదివారం ఫిర్యాదు చేశారు.
నేరాలకు పాల్పడుతున్న సునీల్‌కు.. చాలా మంది పోలీస్ అధికారులు సహకరించి అతడి ద్వారా లబ్ధి పొందారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పూర్తి స్థాయి విచారణ జరిగితే తమ పాత్ర వెలుగులోకి వస్తుందని భావించి.. వారే తుదముట్టించినట్లు తమ ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment