తుపాకులున్నాయిగా.. ఒకేసారి కాల్చేయండి
పెదారికట్లకు చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త నిమ్మారెడ్డిది ఆత్మహత్య కాదని..అది కొనకనమిట్ల ఎస్సై చేసిన హత్య అని..ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తుపాకులున్నాయిగా..వైఎస్సార్ సీపీ కార్యకర్తలను ఒకేసారి కాల్చేయండి అంటూ పోలీసులనుద్దేశించి ఘాటుగా స్పందించారు. నిమ్మారెడ్డి మృతదేహానికి ఆదివారం ఎంపీ నివాళులర్పించారు.
- పోలీసులనుద్దేశించి ఘాటుగా స్పందించిన ఒంగోలు ఎంపీ వైవీ
- వైఎస్సార్ సీపీ కార్యకర్త నిమ్మారెడ్డి మృతదేహానికి నివాళి
- నిమ్మారెడ్డిది ఆత్మహత్య కాదు.. అది ఎస్సై చేసిన హత్య
- కొనకనమిట్ల ఎస్సైని వెంటనే సస్పెండ్ చేయాలన్న ఎంపీ
పొదిలి : ‘పెదారికట్లకు చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త నిమ్మారెడ్డిది ఆత్మహత్య కాదు. అది కొనకనమిట్ల ఎస్సై చేసిన హత్య. ఈ విషయమై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తాం. అసలు ఇవన్నీ ఎందుకు మీ చేతుల్లో తుపాకులున్నాయిగా.. మా కార్యకర్తలను ఒకేసారి కాల్చేయండి’ అంటూ పోలీసులను ఉద్దేశించి ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఘాటుగా స్పందించారు. కొనకనమిట్ల ఎస్సై మస్తాన్ షరీఫ్ వేధింపులకు తాళలేక పెదారికట్లకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నిమ్మారెడ్డి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి విదితమే.
ఈ మేరకు స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో ఉన్న నిమ్మారెడ్డి మృతదేహానికి ఎంపీ వైవీ ఆదివారం నివాళులర్పించారు. మృతుని తల్లిదండ్రులు, బంధువులను ఓదార్చారు. సంఘటనపై పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎంపీ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పచ్చచొక్కాలు వేసుకుని విధులు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. నిమ్మారెడ్డి మృతిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. మహిళలని కూడా చూడకుండా నిమ్మారెడ్డి బంధువులను పోలీసుస్టేషన్‌లో మూడు రోజులు ఎలా నిర్బంధిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు 24 గంటల్లో న్యాయం జరగాలని, లేదంటే వైఎస్సార్ సీపీ ఆధ్వర్యలో పోరాటాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. ఆరు నెలల పసికందు తల్లిని కూడా కేసులో ఇరికించి రిమాండ్‌కు పంపించారంటే ఎస్సై ఎంత ఏకపక్షంగా వ్యవహరించారో అర్థమవుతోందన్నారు.
ఎస్సైపై చర్యలు తీసుకోవాలని సీఐ రవిచంద్రను కోరారు. కొడుకును పొగొట్టుకున్న తల్లిదండ్రులను ఎంపీ ఓదార్చారు. ధైర్యంగా ఉండాలని చెప్పారు. ఆరు నెలల బిడ్డతో రిమాండ్‌లో ఉన్న తల్లికి న్యాయం జరిగేలా చూడాలని ఎంపీపీ ఉడుముల రామనారాయణరెడ్డికి ఎంపీ వైవీ సూచించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసులురెడ్డి, పార్టీ సమన్వయకర్త వెన్నా హనుమారెడ్డి, ఎంపీపీ ఉడుముల రామనారాయణరెడ్డి, కె.నరసింహారావు, జెడ్పీటీసీ సభ్యుడు మెట్టు వెంకటరెడ్డి, సాయిరాజేశ్వరరావు, జవ్వాజి రంగారెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులు కేవీ రమణారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, పార్టీ స్థానిక నాయకులు గొలమారి చెన్నారెడ్డి, ఆవుల చంద్రశేఖరరెడ్డి, రాచమల్లు వెంకటరామిరెడ్డి, కామసాని శేషిరెడ్డి, డి.శ్రీనివాసరెడ్డి, జి.ఓబులరెడ్డి, వీవీ రమణారెడ్డితో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు.