జగిత్యాల, న్యూస్‌లైన్ : ఖరీఫ్‌లో వరిధాన్యం దిగుబడిపై జగిత్యాల డివిజన్ రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటనష్టం పోను ఎంత మేరకు దిగుబడి వస్తుందని ఇటు రైతులు, అటు వ్యవసాయ శాఖ అధికారులు అంచనాలు వేస్తున్నారు.
మరోపక్క బుధవారం నుంచి ధాన్యం కొనుగోలుకు కేంద్రాలు సిద్ధమయ్యాయి. ఈ సంవత్సరం వర్షాలు పుష్కలంగా కురవడం, ఎస్సారెస్పీ ద్వారా సాగునీరందడంతో వరిసాగు ఆశాజనకంగా ఉందని రైతులు చెబుతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కొంతమేర పంట దెబ్బతిన్నప్పటికీ.. ఎకరానికి సగటున 30 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు.
దీంతో జగిత్యాల డివిజన్‌లో 30,64,450 క్వింటాళ్ల ధాన్యం దిగుబడిగా వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. డివిజన్ పరిధిలోని నియోజకవర్గాల వారీగా రానున్న ధాన్యం దిగుబడులపైనా అధికారులు లెక్కలు వేశారు. జగిత్యాల నియోజకవర్గం అత్యధికంగా 9,65,580 క్వింటాళ్లు, ధర్మపురి నియోజకవర్గంలో 8,76,610 క్వింటాళ్లు, కోరుట్ల నియోజకవర్గంలో 5,81,650 క్వింటాళ్లు, డివిజన్ పరిధిలోకి వచ్చే చొప్పదండి నియోజకవర్గంలోని రెండు మండలాల్లో 2,87,770, వేములవాడ నియోజకవర్గంలోని రెండు మండలాల్లో 3,52,840 క్వింటాళ్ల ధాన్యం దిగుబడిగా వస్తుందని అంచనా వేశారు. ఈ మేరకు డివిజన్‌లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతూ సబ్ కలెక్టర్ శ్రీకేశ్ లట్కర్‌కు నివేదిక సమర్పించారు. ఆ నివేదిక ఆధారంగా జిల్లాలోనే అత్యధికంగా జగిత్యాల డివిజన్‌లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఇటీవల ఇక్కడికి వచ్చిన జాయింట్ కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ ప్రకటించారు. 126 ఐకేపీ కేంద్రాలు, 47 ప్రాథమిక వ్యవసాయ పరపతి కేంద్రాలను ఏర్పాటు చేయగా, 12 వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా నేటి నుంచి వరిధాన్యం కొనుగోలు చేయనున్నారు.
ఈ మేరకు కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. గత సంవత్సరం జిల్లాలో ఐకేపీ కొనుగోలు చేసిన ధాన్యంలో మూడొంతులు జగిత్యాల డివిజన్ నుంచి కొనుగోలు చేశారు. జిల్లాలో 2012 ఖరీఫ్‌లో 33.38 లక్షల క్వింటాళ్ల ధాన్యం రూ.378 కోట్లతో కొనుగోలు చేశారు. 2013 రబీలో 17.98 లక్షల ధాన్యాన్ని రూ.224 కోట్లతో కొనుగోలు చేశారు. ఈసారి కూడా జిల్లాలో రూ.500 కోట్ల మేర వరిధాన్యం కొనుగోలు చేసే అవకాశం ఉందని ఐకేపీ అధికారులు అంచనా వేస్తున్నారు.
దిగుబడిపైనే ఆశలు
Published Wed, Nov 6 2013 3:10 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement