కోహెడ, న్యూస్‌లైన్ : తమకు పరిహారం ఇచ్చేవరకు పనులు జరగనిచ్చేది లేదంటూ కోహెడ మండలంలోని తోటపల్లి-గౌరవెల్లి రిజర్వాయర్ వరదకాలువ పనులను తీగలకుంటపల్లికి చెందిన పలువురు రైతులు గురువారం అడ్డుకున్నారు. అధికారులు వచ్చి న్యాయం చేయాలని భీష్మించారు. అనంతరం వారు మాట్లాడుతూ... సర్వే నంబర్ 400/02లో మెతుకు తరవ్వ 2.28 ఎకరాలతో పాటు ఇతర సర్వే నంబర్లలో కొందరు రైతులకు చెందిన మరో 15 ఎకరాల వ్యవసాయ భూమిని ప్రభుత్వం వరద కాలువ కోసం తీసుకుంది. పనులు నిర్వహించే కాంట్రాక్టర్ రాజు 2009లో రూ.30వేలు అందించి పనులు ప్రారంభించారు.
మిగతా మొత్తం ఇవ్వలేదు. అప్పటి నుంచి పరిహారం కోసం మండల తహశీల్దార్, జిల్లా భూసేకర కార్యాలయం చుట్టు తీరిగిన ఫలితం లేదని ఆవేదనవ్యక్తంచేశారు. రూ.37లక్షల పరిహారం అందేవరకు పనులు జరగనిచ్చేదిలేదని సిమెంటు లారీ లకు అడ్డుగా నిల్చున్నారు. విషయం తెలుసుకున్న ఎస్సై సతీశ్, ఆర్‌ఐ మల్లారెడ్డి, వీఆర్వో రమేశ్ అక్కడికి వచ్చి రైతులతో మాట్లాడారు.పరిహారం మంజూరుకు ఆర్డీవో, భూసేకరణ విభాగం అధికారుల దృష్టికి తీసుకుపోతామని పేర్కొనడంతో రైతులు ఆందోళన విరమించారు. కార్యక్రమంలో సర్పంచ్ పొన్నాల శంకర్, మాజీ ఉప సర్పంచ్ మ్యాకల చంద్రశేఖర్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, శ్రీశైలం, రవి, కిషన్‌రెడ్డి, బాధిత రైతులు పాల్గొన్నారు.
గోస పడుతున్నం
ఈ ఫొటోలో కనిపిస్తున్నది కోహెడ మండలంలోని తీగలకుంటపల్లికి చెందిన మెతుకు తారవ్వ కుటుంబం. వీరికి గ్రామంలో సర్వే నంబర్ 400/2లో 2.28 ఎకరాల వ్యవసాయ భూమి ఉండేది. అందులో వారు 13 ఏళ్లుగా పంట సాగుచేసుకుంటున్నారు. తోటపల్లి-గౌరవెల్లి రిజర్వాయర్ వరదకాలువ నిర్మాణం కోసం వీరి భూమిని ప్రభుత్వం తీసుకుంది. ఎకరాకు 2.15 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. 2009లో వరద కాలువ పనులు ప్రారంభం కాగా.. ప్రభుత్వం బిల్లులు ఇవ్వలేదు. కానీ కాంట్రాక్టర్ రూ.30 వేలు ఇచ్చారు. తన పనులు పూర్తి చేసుకున్నాడు. ఈ తరుణంలో పూర్తి భూమి కోల్పోయిన ఆ కుటుంబం పొట్టనింపుకునేందుకు నిత్యం కూలీ పనులకు వెళ్లి జీవించాల్సి వస్తోంది. ప్రభుత్వం ఎప్పుడు డబ్బులు ఇస్తుందా ఐదేళ్లుగా వేచిచూస్తున్నారు. అయితే ప్రభుత్వ భూమిగా రికార్డుల్లో ఉందని చెప్తూ అధికారులు పరిహారం ఇవ్వడం లేదు. కానీ తన వద్ద అన్ని రికార్డులు ఉన్నాయని ఆ కుటుంబం పేర్కొంటోంది.
భూమిపోయి బువ్వ కోసం కూలీకి
Published Fri, Feb 7 2014 4:40 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement