ప్రపంచ వ్యవసాయ సదస్సు తొలిరోజే గందరగోళం!
నిర్వాహకులపై రైతుల ఆగ్రహం
ఉచితంగా అనుమతించాలని మంత్రితో వాగ్వాదం
సాక్షి, హైదరాబాద్: ప్రజల నిరాసక్తత, రైతు సంఘాల వ్యతిరేకతల మధ్య రాష్ట్ర రాజధాని నగరంలో ఏర్పాటు చేసిన ప్రపంచ వ్యవసాయ సదస్సులో తొలిరోజే గందరగోళం చోటుచేసుకుంది. సదస్సుకు తమను ఉచితంగా అనుమతించాలంటూ కొందరు రైతులు వ్యవసాయమంత్రితో వాగ్వాదానికి దిగడం.. వ్యవసాయ, సమాచార పౌర సంబంధాలు, పోలీసు శాఖల మధ్య సమన్వయలేమితో సభ్యుల జాబితాలో ‘ఆకాశవాణి’ వ్యవసాయ విభాగం సిబ్బంది సహా కొందరి పేర్లు గల్లంతు కావడం.. మీడియా పాస్‌ల జారీలో అయోమయం వంటి పరిణామాలతో గందరగోళం నెలకొంది. సోమవారమిక్కడి ‘నోవాటెల్’ హోటల్‌లో సభ్యుల నమోదు కార్యక్రమంతో వ్యవసాయ సదస్సు లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సదస్సులో రైతులకు ఉచిత ప్రవేశం ఉంటుందంటూ ఓ పత్రికలో వార్త రావడంతో అనంతపురం, ఒంగోలు తదితర జిల్లాల నుంచి కొంతమంది రైతులు వచ్చారు. అయితే సదస్సులో పాల్గొనాలంటే రూ.5,600 చెల్లించాల్సిందేనని నిర్వాహకులు తేల్చిచెప్పారు. దీంతో వారు ఆ పత్రికలో వచ్చిన వార్తను చూపిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. అదే సమయంలో అక్కడకు వచ్చిన వైఎస్సార్‌సీపీ రైతు విభాగం కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డితో కలిసి వ్యవసాయ మంత్రి కన్నా లక్ష్మీనారాయణని కలిశారు. రైతులకు ఉచిత ప్రవేశం కల్పిస్తామని చెప్పి, తీరా ఇక్కడకు వచ్చాక రుసుం చెల్లించాలనడం ఏమిటని ఆయనతో వాగ్వాదానికి దిగారు. రాష్ట్రంలో ఎంపిక చేసిన 50 మంది అభ్యుదయ రైతులకు సదస్సులో ప్రవేశం కల్పిస్తామని, మరో 5వేల మంది రైతులను ‘అగ్రి ట్రేడ్ ఫెయిర్’కు తీసుకొస్తామని మాత్రమే ప్రభుత్వం చెప్పిందని మంత్రి వివరణ ఇచ్చారు. రైతులు పేపర్ క్లిప్పింగ్‌ను కన్నాకు చూపించగా, తప్పుడు సమాచారంతో వార్త రాసినవారినే వివరణ అడగాలని సూచించారు. తప్పు ఎవరిదైనా, చాలా దూరం నుంచి వచ్చిన రైతులకు ఉచిత ప్రవేశం కల్పించాలన్న నాగిరెడ్డి విజ్ఞప్తిని మంత్రి తోసిపుచ్చారు.
సభ్యత్వంలో సగం ప్రభుత్వ అధికారులే...
ప్రపంచ వ్యవసాయ సదస్సులో పాల్గొనే సభ్యుల్లో సగానికి సగం మంది వ్యవసాయ యూనివర్సిటీ, ప్రభుత్వ శాఖ అధికారులే ఉన్నారు. డెలిగేట్ల సంఖ్య తగ్గే అవకాశముందని భావించడంతో సదస్సు బోసిపోకుండా ఉండేం దుకు వ్యవసాయ వర్సిటీ, ఇతర అనుబంధ శాఖల నుంచి ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులను హాజరుపరిచారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎన్జీరంగా వర్సిటీ నుంచి 102 మంది, ఉద్యాన కళాశాల నుంచి 35, ఏపీఎల్‌డీఏ నుంచి 15 మంది, వెటర్నరీ కౌన్సెల్ నుంచి ఏడుగురు, వెటర్నరీ యూనివర్సిటీ నుంచి నలుగురు హాజరైనట్టు సమాచారం. మరోవైపు ఈ సదస్సు నిర్వహణకు ప్రభుత్వం తరపున రూ.2.5 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ నిధులు ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీవే. కాగా, సదస్సుకు 400 మంది ప్రతినిధులు హాజరవుతారని, అగ్రి ట్రేడ్‌ఫెయిర్‌లో 157 స్టాళ్లు ఏర్పాటవుతున్నాయని కన్నా తెలిపారు. ‘నోవాటెల్’లో భద్రతా ఏర్పాట్లను డీజీపీ ప్రసాదరావు పరిశీలించారు.
ఆకలిని రూపు మాపేందుకే: జేమ్స్ బోల్గర్
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న జనాభా, దెబ్బతింటున్న పర్యావరణ సమతుల్యాలు ఆందోళన కలిగించే అంశాలని న్యూజిలాండ్ మాజీ ప్రధాని, డబ్ల్యూఏఎఫ్ సలహా సంఘం అధ్యక్షుడు జేమ్స్ బోల్గర్ పేర్కొన్నారు. ఈ ప్రతికూల పరిస్థితుల్లో తిండిగింజల ఉత్పత్తిని పెంచి ప్రపంచవ్యాప్తంగా ఆకలిని నిర్మూలించడానికే ఈ కృషి అని, ఒక గింజ పండే చోట రెండు గింజలు పండించడం ఎలా అన్నదానిపైనే ఈ మేధోమథనం అని వివరించారు.
ఎమ్మెన్సీల మాజీలే డబ్ల్యూఏఎఫ్ సారథులు!
అమెరికాలోని మిస్సోరి రాష్ట్రంలోని సెయింట్ లూయీస్ నగరంలోని వ్యవసాయ, ఆహారోత్పత్తుల వ్యాపార వర్గాలతో కూడిన చిన్న బృందం 1997లో వరల్డ్ అగ్రికల్చర్ ఫోరం(డబ్ల్యూఏఎఫ్)ను స్థాపించింది. వ్యవసాయ విధానాలపై చర్చాగోష్టులను నిర్వహించే తటస్థ సంస్థగా డబ్ల్యూఏఎఫ్ చెప్పుకుంటుంది. ప్రతి రెండేళ్లకోసారి ప్రపంచ వ్యవసాయ సదస్సును నిర్వహిస్తుంటుంది. డబ్ల్యూఏఎఫ్ చైర్మన్ కెన్నెత్ బెకర్‌తో పాటు సంస్థ బోర్డు సభ్యులందరూ బహుళ జాతి విత్తన కంపెనీలు, పురుగుమందుల కంపెనీల్లో పూర్వం కీలక పదవుల్లో ఉన్న వారే. అందువల్ల ఈ సంస్థ బహుళజాతి కంపెనీల (ఎమ్మెన్సీల) ప్రయోజనాల కోసం ప్రపంచ దేశాల ప్రభుత్వాలను ప్రభావితం చేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. డబ్ల్యూఏఎఫ్ చైర్మన్ కెన్నెత్ బెకర్ గతంలో మోన్‌శాంటో సహా పలు సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. డబ్ల్యూఏఎఫ్ వ్యవస్థాపక సభ్యులు లెనార్డ్ గుర్రాయ్ 1983 నుంచి 1997 వరకు అమెరికన్ సోయాబీన్ అసోసియేషన్ సీఈవోగా పనిచేశారు. మైఖేల్ కె.డోనె మోన్‌శాంటో కంపెనీలో డెరైక్టర్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎకానమిక్స్ అండ్ సస్టైనబిలిటీగా పని చేశారు. లిన్ ఒ.హెండర్సన్ హెండర్సన్ కమ్యూనికేషన్స్ ఎల్‌ఎల్‌సీ(అగ్రిమార్కెటింగ్) సంస్థ చైర్మన్, సీఈవోగా పనిచేశారు. డబ్ల్యూఏఎఫ్ సలహా సంఘానికి న్యూజిలాండ్ మాజీ ప్రధాని జేమ్స్ బోల్గర్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఇందులోనూ మోన్‌శాంటో కంపెనీలో వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేసిన బ్రెట్ డి.మెగ్‌మన్ వంటి వారున్నారు. ఎన్జీరంగా వర్సిటీ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య కూడా ఈ సలహా సంఘంలో కొంతకాలం సభ్యులుగా ఉన్నారు. డబ్ల్యూఏఎఫ్ విధానాలు కార్పొరేట్ కంపెనీలకు కొమ్ముకాసే విధంగా ఉన్నాయని నిరసిస్తూ రాజీనామా చేశారు.