మా పొట్టకొట్టి కట్టేది ప్రజా రాజధాని అవుతుందా? | farmers fire on chandrababau naidu | Sakshi
Sakshi News home page

మా పొట్టకొట్టి కట్టేది ప్రజా రాజధాని అవుతుందా?

Published Thu, Aug 27 2015 2:19 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

farmers fire on chandrababau naidu

టీడీపీ సర్కారును శాపనార్థాలు పెట్టిన రైతులు, కూలీలు
తమకు అండగా నిలిచిన వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు

 
విజయవాడ బ్యూరో: రాజధాని ప్రాంతంలో బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ధర్నాలో రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. మా పొట్ట కొట్టి కట్టేది ప్రజా రాజధాని అవుతుందా? అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. తమ ఉసురు తగులుతుందని చంద్రబాబు సర్కారుకు శాపనార్థాలు పెట్టారు. ప్రాణాలైనా వదులుకుంటాం కానీ భూములు ఇవ్వలేమని తెగేసి చెప్పారు. మా భూముల జోలికి వస్తే ప్రభుత్వాన్ని పాతేస్తామని హెచ్చరించారు. రాజధాని పేరుతో అరాచకం జరుగుతోందని ఆక్రోశించారు. వైఎస్ హయాంలోనే రైతులు, పేదలు ఆనందంగా ఉన్నారని గుర్తు చేసుకున్నారు.  తమకు అండగా నిలిచిన వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ధర్నా వేదికపై ఉద్వేగంగా ప్రసంగించిన రైతుల మాటల్లోనే...
 
ప్రాణాలైనా ఇస్తాం.. బువ్వపెట్టే భూమి ఇవ్వలేం
పొలమే మా  దైవం. ప్రాణాలైనా ఇస్తాం కానీ బువ్వపెట్టిన భూమిని ఇవ్వలేం. రాజధాని కోసం భూములు త్యాగాలు చేయాలని చెబుతున్న మంత్రులు, సీఎం సొంత భూములు త్యాగాలు చేస్తారా?     భయంతోనే 80శాతం మంది రైతులు భూములు ఇచ్చారు.  మాకు కావాల్సింది అందమైన రాజధాని కాదు. రైతులు, కూలీలు, ప్రజలు కన్నీరు పెట్టని ప్రజారాజధాని కావాలి.    - కృష్ణ, పూలతోట రైతు
 
మా భూముల జోలికి వస్తే పాతేస్తాం
మా భూములు దోచుకుని జపాన్, సింగపూర్‌లకు కట్టబెట్టి బాబు అక్కడ ఆస్తులు వెనకేసుకుంటున్నారు. మా భూములు జోలికి వస్తే ఈ ప్రభుత్వాన్ని పూడ్చిపెడతాం. లోకేష్ బాబూ... సిగ్గు, చీము, నెత్తురు ఉంటే మీ నాన్నకు నీవైనా చెప్పు రైతుల ఉసురు కట్టుకొవద్దని. మా కడుపు కొట్టాలని చూస్తే జగన్ అండతో ధైర్యంగా ఎదుర్కొంటాం.  - జయమ్మ, నిడమర్రు, మహిళారైతు
 
రాజధాని పేరుతో అరాచకం జరుగుతోంది
రాజధాని పేరుతో అరాచకం జరుగుతోంది. భద్రత కల్పించి భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వమే రాజధాని ప్రాంతంలో ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. భూములు లాక్కుంటామంటూ రైతు కూలీలను   భయాందోళనకు గురిచేస్తోంది. వేల ఎకరాలను గుంజు కుంటూ రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోంది.   - లక్ష్మారెడ్డి, రైతు కూలీ సంఘం అధ్యక్షులు
 
వైఎస్ హయాంలోనే రైతు బాగున్నాడు
వైఎస్ హయాంలో రైతు బాగున్నాడు. వ్యవసాయం దండగంటూ రైతుల్ని బాబు ఎప్పుడూ చిన్నచూపే చూశారు. ఇప్పుడు రాజధాని పేరుతో రైతుల్ని నిలువునా దగా చేస్తున్నారు. చంద్రబాబు పాలన ఎంత తొందరగా అంతమైతే అంత మేలు. లేకుంటే చంద్రబాబు రైతుల్ని బతకనీయరు. రైతు, కూలీల ఉసురు ఈ ప్రభుత్వానికి  తగులుతుంది.  - శంకర్‌రెడ్డి, ఉండవల్లి రైతు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement