భూసమీకరణ చేసిందంతా రెవెన్యూవారే
* డిప్యూటీ సీఎం కేఈ వ్యాఖ్య
* రేవంత్‌రెడ్డి ఎపిసోడ్ లాంటివి చంద్రబాబు వంద చూశారు
సాక్షి, హైదరాబాద్: రాజధాని భూసమీకరణకు స్వచ్ఛందంగా రైతులు భూములివ్వలేదని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పరోక్షంగా అంగీకరించారు. సమీకరించిన 33 వేల ఎకరాల్లో ఇంకా 17 వేల ఎకరాలకు రైతులు అంగీకార పత్రాలివ్వలేదని, అయితే ఎలాగోలా వారిని ఒప్పించి భూములు తీసుకునే సత్తా సీఎం చంద్రబాబుకు ఉందన్నారు.
‘‘మంత్రి నారాయణ వింటే ఫీల్ అవుతాడు కానీ.. అసలు సమీకరణ చేసిందంతా మా రెవెన్యూవారే’’ అని వ్యాఖ్యానించారు. కేఈ శుక్రవారం సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. రేవంత్‌రెడ్డి లాంటి ఎపిసోడ్‌లను చంద్రబాబు వంద చూశారని, ఆయన్ను ఎవరూ ఏమీ చేయలేకపోయారని కేఈ అన్నారు. రేవంత్‌రెడ్డి క్లీన్‌చిట్‌తో బయటికొస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డిపై కుట్రలో తెలంగాణ సీఎం కేసీఆర్ పాత్ర ఉందని తేటతెల్లమైందని, కావాలని కేసులో ఇరికించారని ఆయన ఆరోపించారు. ప్రజలకు తానిచ్చిన హామీలన్నీ సమైక్య రాష్ట్రంలో ఇచ్చినవన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలను విలేకరులు ప్రస్తావించగా.. హామీలపై సీఎం అలా ఎందుకన్నారో తనకు తెలియదన్నారు.