సాగర్‌పైనే భారం | farmers hopes on sagar reservoir | Sakshi
Sakshi News home page

సాగర్‌పైనే భారం

Published Tue, Aug 19 2014 12:08 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM

farmers hopes on sagar reservoir

శావల్యాపురం : మండలంలోని రైతులు వరి నారుమళ్లు పోసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చి చేరుతున్న నీటితో సాగర్ జలాశయం కళకళలాడుతోంది. దీంతో రైతులు వరి సాగుపై ఆశలు పెంచుకుంటున్నారు. సాగర్ నుంచి నీటి విడుదల ఖాయమని అన్నదాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నీళ్లు రాగానే నాట్లు వేసేందుకు వీలుగా బోర్లు, బావులు కింద ఉన్న పొలాల్లో నారుమళ్లు సిద్ధం చేస్తున్నారు.
 
* శావల్యాపురం, బొందిలిపాలెం, మతుకుమల్లి, గుంటిపాలెం, శానంపూడి, కారుమంచి, చినకంచర్ల, వేల్పూరు, పోట్లూరు గ్రామాల్లో బావుల కింద, చెరువుల కింద ఉన్న పొలాల్లో రైతులు బీపీటీ, ఎన్‌ఎల్‌ఆర్ రకాల వరి నారు పోస్తున్నారు.
* జూలై-సెప్టెంబర్ మధ్య ఖరీఫ్ సాగుకు, అక్టోబర్-నవంబర్ మధ్య రబీకి అను కూలంగా ఉంటుంది.
* ఆగస్టు నెల సగం గడిచినా సరైన వర్షాలు లేకపోవడంతో సాగు ఆలస్యమైపోతుం దని రైతులు నారుమళ్లు పోస్తున్నారు.
* మండలంలో మొత్తం ఏడు వేల హెక్టార్ల సాగుభూమి ఉండగా, సుమారు ఐదు వేల హెక్టార్లు మాగాణి పరిధిలో ఉంది. ప్రధానంగా రైతులు మాగాణిపైనే ఆధారపడి సాగు చేస్తుంటారు. ఇప్పటివరకు మండలంలో కేవలం 500 ఎకరాలకు సరిపడ నారు మాత్రమే పోసినట్టు అధికారులు అంచనా వేశారు.
 
ప్రధానంగా పత్తి సాగు వైపు మొగ్గు ...
మెట్ట పంటల విషయంలో మండల రైతులు పత్తి, కంది సాగుకు మొగ్గు చూపుతు న్నారు.
* ఎక్కువగా పత్తి సాగుపై ఆసక్తి కనబరుస్తున్నారు. నీటి ఎద్దడి తట్టు కోవడం, నీటి అవసరాలు కూడా తక్కువగా ఉండడంతో పత్తి పంటకు ఆదరణ ఉంది.
* ప్రస్తుతం మిర్చికి, కూరగాయల ధరలకు రెక్కలు రావటంతో చిన్న, సన్నకారు రైతులు వంగ, దోస, బెండ సాగుపై ఆసక్తి చూపుతున్నారు.
* ఇప్పటికే రైతులు సాగు చేసిన మెట్ట పంటలకు ఆదివారం సాయంత్రం కురిసిన వర్షం జీవం పోసింది.
 
జాగ్రత్తలు పాటించాలి ... నీటి విడుదలపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి హామీ ఇవ్వలేదు. సాగర్‌లో నీటిపై ఆశాభావంతో రైతులు నారు పోస్తున్నారు. నీరు అందుబాటులో ఉంటేనే నారుమళ్లు పోయాలి. లేకపోతే ఎండిపోయే ప్రమాదం ఉంది. బీపీటీ వేయాలనుకున్న రైతులు, అగ్గి తెగులు, దోమపోటు దృష్టిలో ఉంచుకొని తగు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యం గా బీపీటీ 5204, ఎన్‌ఎల్‌ఆర్ 34449, జేజేలు 384 రకాలు మంచి దిగు బడులు ఇస్తాయి.
 - హరిప్రసాద్, వ్యవసాయాధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement