కొను‘గోలే’ | farmers Rabi rice levy collection Rules | Sakshi
Sakshi News home page

కొను‘గోలే’

Published Mon, Apr 6 2015 2:38 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

farmers Rabi rice levy collection Rules

రాజమండ్రి :ప్రతికూల పరిస్థితులను అధిగమించి రైతులు రబీ వరి పండించారు. శివారు ప్రాంతాల్లో మినహా మిగిలిన చోట్ల అంచనాలకు మించి దిగుబడి వస్తోంది. నీటి సమస్యకు ఎదురొడ్డి పంట పండించిన రైతులకు ఇప్పుడు కొత్త భయం పట్టుకుంది. కేంద్ర ప్రభుత్వం లెవీ సేకరణ నిబంధనలు మార్చడంవల్ల పండించిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొంటారా? లేదా? అని వారు ఆందోళన చెందుతున్నారు. గత ఖరీఫ్ అనుభవాల దృష్ట్యా ప్రభుత్వం పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు చేయకుంటే తమకు కనీస మద్దతు ధర రాదని అంటున్నారు. జిల్లాలో సుమారు 4.22 లక్షల ఎకరాల్లో రబీ వరిసాగు జరిగింది.
 
 గోదావరి డెల్టాలో నీటి ఎద్దడి ఉన్నప్పటికీ రైతులు అష్టకష్టాలు పడి సాగును గట్టెక్కించారు. తూర్పు, మధ్య డెల్టాల పరిధిలోని శివారుల్లో నీటి ఎద్దడివల్ల సుమారు 12,500 ఎకరాల్లో పంట దెబ్బతిందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తూండగా, వాస్తవ నష్టం ఇంతకు రెట్టింపు ఉంటుందని అంచనా. శివారు ప్రాంతాలు మినహాయిస్తే మిగిలినచోట్ల సగటు దిగుబడి ఎకరాకు 45 బస్తాలకు పైబడి వచ్చే అవకాశముంది. మొత్తం రబీ దిగుబడి 14 లక్షల మెట్రిక్ టన్నులకు పైబడి రానుందని అంచనా వేస్తున్నారు. ఇంతవరకూ బాగానే ఉన్నా ఇప్పుడే అసలు సమస్య మొదలవుతోంది. గతంలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) రాష్ట్రంలో పండిన వరి ధాన్యంలో 75 శాతం సేకరించేది. దీనిని గత ఖరీఫ్ ముందు 25 శాతానికి కేంద్ర ప్రభుత్వం కుదించింది.
 
 తాజాగా దీనిని మొత్తం ఎత్తివేసింది. ఖరీఫ్ ముందు మారిన 25 శాతం నిబంధనకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. బస్తా (75 కేజీలు) కనీస మద్దతు ధర రూ.1,035 అయితే దళారులు రూ.800కు కూడా కొన్నారు. అసలే దిగుబడి రాక నష్టపోయిన ఖరీఫ్ రైతులు మద్దతు ధరకన్నా తక్కువకు ధాన్యం అమ్ముకోవాల్సి రావడంతో అప్పులపాలయ్యారు. ఇప్పుడు ఎఫ్‌సీఐ కొనుగోలు మొత్తం లేకుండా చేస్తే తమ పరిస్థితి ఏమిటోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.రబీ వరి కోతలు ప్రారంభం కావడంతో 180 కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలుకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. ఎఫ్‌సీఐ నిబంధన వల్ల సగం ధాన్యాన్ని ప్రభుత్వ కేంద్రాల ద్వారానే కొనుగోలు చేయాల్సి ఉంది. అయితే ఈ కేంద్రాల ద్వారా కనీసం 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులు భావిస్తూండడం గమనార్హం. ఇదే సమయంలో తాము 6 లక్షల మెట్రిక్ టన్నుల వరకూ ధాన్యం కొంటామని మిల్లర్ల అసోషియేషన్ చెబుతోంది. రైతుల అవసరాలకు లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం పోతుంది.
 
 దీంతో దిగుబడిగా రానున్న 14 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంలో మిగిలిన రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఎవరు కొంటారనే ప్రశ్న రైతులను వేధిస్తోంది. దీనికి సమాధానం చెప్పేవారే లేరు. మరోపక్క ప్రభుత్వం ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొంటుందనే నమ్మకం రైతులకు కలగడంలేదు. గత ఖరీఫ్‌లో కళ్లాల వద్దకు వెళ్లి 3.50 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొన్నారు. ఈసారి ఇంతకుమించి కొనుగోలు చేయడం కష్టమేనని అధికారులే అంటున్నారు. ఇక ఎఫ్‌సీఐ నుంచి కొనుగోలు ఉంటుందనే భరోసా లేకుండాపోతే మిల్లర్లు ధాన్యాన్ని ఆచూతూచి కొనుగోలు చేస్తారు. ఇవన్నీ చూస్తూంటే రబీ ధాన్యం రైతుల కళ్లాలు దాటడం గగనమే అనిపిస్తోంది. ఇదే జరిగితే రైతులకు కనీస మద్దతు ధర అందక, పంట పండినా నష్టాలు చవిచూడాల్సిన దుస్థితి ఏర్పడుతుందనడంలో సందేహం లేదు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement