కురిచేడు: కురిచేడు సమీపంలోని నాగార్జున సాగర్ కుడి ప్రధాన కాలువ 124వ మైలురాయిలోని ఐనవోలు మేజరు హెడ్ గత నెల 27వ తేదీన కుప్పకూలిపోయింది. సంబంధితాధికారులకు ఫిర్యాదు చేశారు. వారం రోజులైనా ప్రధాన కాలువకు నీటి పరిమాణం తగ్గించి మరమ్మతులు చేపట్టకపోవటంతో ఆదివారం50 మంది రైతులు స్వచ్ఛందంగా శ్రమదానానికి శ్రీకారం చుట్టారు.
మేజరు పరిధిలోని నాగిరెడ్డి పల్లె, మృత్యుంజయపురం గ్రామాలకు చెందిన ైరె తులు చందాలు వసూలు చేసుకుని ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు జలయజ్ఞానికి దిగి ఫలితం సాధించారు. గత నెలలో మేజరులో పేరుకున్న పూడికతీతకు కూడా అధికారులు సహకరించకపోవటంతో వినుకొండ శాసనసభ్యుడి ద్వారా ఎన్.ఎస్.పి. ఉన్నతాధికారులతో మాట్లాడుకుని పూడిక తీసుకున్నారు. మేజరు హెడ్ కూలిపోవటం, వారం రోజులైనా పనులు ప్రారంభించకపోవటంతో వరినాట్లు, నార్లు ఎండిపోతున్నాయి.
ఈ తరుణంలో రైతులు నడుంబిగించి మరమ్మతులకు శ్రీకారం చుట్టారు. నాగిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన వంకాయలపాటి బాలకోటయ్య,అమృతపూడి నాగేశ్వరరావు,మృత్యుంజయపురానికి చెందిన ముండ్రు సుబ్బారావు,యోగిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన శేషిరెడ్డిలు ముందుండి ఈ బృహత్తర కార్యక్రమాన్ని ముందుకు నడిపించారని గ్రామస్తులు అభినందించారు. దీని నిర్మాణానికి మూడు లక్షల రూపాయలు ఖర్చవుతుందని ఎన్.ఎస్.పి.అధికారులు తెలిపారు.
ఖర్చు రైతులే భరిస్తున్నారు
పణిదెపు చిన్న వెంకటేశ్వర్లు, మృత్యుంజయపురం
మేజరు మరమ్మతులకు అవసరమైన ఖర్చు మృత్యుంజయపురం, నాగిరెడ్డిపల్లె గ్రామాల రైతులే భరిస్తున్నారు. అందరం కలిసి నిర్మించుకోవాలని స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పనులు చేసుకుంటున్నాం.
అధికారులు చేసేపాటికి పంటలు ఎండిపోతాయి- వంకాయలపాటి బాలకోటయ్య,నాగిరెడ్డి పల్లె
అధికారులు చేస్తారని వారం రోజులుగా ఎదురు చూశాం. కానీ చేయలేదు. వారు చేసే పాటికి పంటలు ఎండిపోతాయి. ఏటా కాలువలో పూడిక తీసుకుంటున్నాం. ఈ ఏడాది కూడా తీసుకున్నాం. మరమ్మతులు కూడా చేసుకుంటున్నాం. ఇంతవరకు అధికారులు రూపాయి కూడా ఇవ్వలేదు.
నలుగురితో పెట్టుబడి పెట్టి చేస్తున్నాం -సి.హెచ్.మస్తాన్,చింతలచెరువు
నలుగురు రైతులతో పెట్టుబడి పెట్టించి ముందు పనిచేయిస్తున్నాం. మా శ్రమను గుర్తించి సంబంధితాధికారులు కనీస వ్యయాన్ని అయినా ఇప్పిస్తే మరో పనికి వెచ్చిస్తాం.
బిల్లు చేసి రైతులకు ఇస్తాం- ఈ.ఈ. బి.ఎస్.వి.ప్రసాదు
ప్రస్తుతం రైతులు, మేము కలిసిపనులు చేస్తున్నాం. ఈ పనికి మూడు లక్షల అంచనా వేస్తున్నాం. పని పూర్తయ్యాక బిల్లులు చేసి రైతులకు ఇస్తాం. అయకట్టు పరిధిలోని రైతులు ముందుకు వచ్చి ఇలా సహకరిస్తే బాగుంటుంది.
భళా...రైతన్నా
Published Mon, Nov 3 2014 1:27 AM | Last Updated on Fri, Oct 19 2018 7:19 PM
Advertisement
Advertisement