అమ్ముకున్నారు.. ఆక్రమించుకున్నారు
- ద్వారకాతిరుమల మండలం గుణ్ణంపల్లిలో భూబాగోతం
- పోలవరం కుడి కాలువ కోసం ప్రభుత్వానికి భూములు అమ్మిన రైతులు
- అనంతరం తిరిగి ఆక్రమించుకుని దర్జాగా సాగు చేసుకుంటున్న వైనం
ఏలూరు (సెంట్రల్) : ప్రభుత్వ భూసేకరణలో భాగంగా ఆ రైతులు తమ భూములను అమ్ముకున్నారు. ప్రభుత్వం వారికి పరిహారం చెల్లించింది. కొంతకాలం అనంతరం అవే భూములను వారు తిరిగి ఆక్రమించుకుని దర్జాగా సాగుచేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు రైతుల మధ్య తలెత్తిన వివాదం కారణంగా విషయం వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టుకు అనుసంధానంగా కుడి కాలువ తవ్వకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 2005లో భూ సేకరణకు శ్రీకారం చుట్టింది. ద్వారకాతిరుమల మండలం గుణ్ణంపల్లికి చెందిన కొందరు రైతులు తమ భూములను ప్రభుత్వానికి విక్రయించారు. సేకరించిన భూమికి 2007లో ప్రభుత్వం ఆయా రైతులకు సొమ్ము చెల్లించేసింది.
కాలువ తవ్విన అనంతరం రెండు వైపులా భూమి భారీగా మిగలడంతో ఆ రైతుల కన్ను దానిపై పడింది. కొందరు రైతులు ఆ భూమి తమదేనని కాగితాలు కూడా పుట్టించి అప్పుడే దాన్ని ఇతరులకు అమ్మేసి సొమ్ము చేసుకున్నారు. మరికొందరు కౌలుకు ఇచ్చి దర్జాగా సాగు చేసుకుంటున్నారు. మరికొందరు స్వయంగా పామాయిల్, మొక్కజొన్న తదితర పంటలను సాగు చేసుకుంటున్నారు. అయితే ఈ భూముల విషయంలో గణేష్, రాంబాబు అనే ఇద్దరు రైతుల మధ్య సరిహద్దు తగాదా ఏర్పడి గొడవలకు దారితీసింది. దీనిపై గణేష్ గత వారం ప్రజావాణిలో కలెక్టర్ కె.భాస్కర్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాలతో అధికారులకు సర్వేకు రావడంతో విషయం బహిర్గతమైంది.
బుధవారం ఇరిగేషన్ డీఈ టి.జగదీష్, సర్వేయర్ ప్రేమ్‌కుమార్ భూముల మార్కింగ్‌కు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా అక్కడి రైతుల నుంచి వారికి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. కలెక్టర్ ఆదేశాల మేరకు తాము ప్రభుత్వం సేకరించిన భూమి ఎంత అన్నది నిర్దారిస్తామనీ, దాని ప్రకారం ఎవరైతే ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటున్నారో వారు సదరు భూముల నుంచి తొలగిపోవాలని తేల్చి చెప్పారు.
కుడి కాలువ పొడవునా స్పెషల్ డ్రైవ్ : డీఈ జగదీష్
పోలవరం కుడికాలువ పొడవునా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని డీఈ జగదీష్ తెలిపారు. భూ సేకరణలో అమ్ముకుని తిరిగి అదే భూమిని ఆక్రమించుకుని సాగు చేసుకుంటే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటనలో గణేష్‌తో సరిహద్దు విషయంలో గొడవ పడుతున్న రాంబాబుకు చెందిన భూమి అసలు అక్కడ లేనే లేదని తెలిపారు. ప్రభుత్వం ఆ భూమిని ఎస్.వెంకటరెడ్డి వద్ద తీసుకుని నష్టపరిహారం చెల్లించిందని, ఆ తరువాత అదే భూమిని రాంబాబు కొనుగోలు చేసినట్లుగా అధికారులను నమ్మించి ఆక్రమించుకుని సాగులోకి తీసుకువచ్చారన్నారు. అంతేకాకుండా అక్కడ ఎటువంటి భూములు లేని మరో ఇద్దరు వ్యక్తులు పెద్దిరెడ్డి నాగబాబు, శ్రీను అనే వ్యక్తులు స్థానిక నాయకుల అండతో గణేష్ భూమిని స్వాధీనం చేసుకుని జామాయిల్ సాగు చేస్తున్నారని తెలిసిందన్నారు. ఈ భూములపై పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించి కలెక్టర్‌కు నివేదిస్తామని డీఈ చెప్పారు.