పట్టిసీమలో భూముల
స్వాధీనానికి అధికారుల ఒత్తిడి
ముందే భూములిచ్చేందుకు
తొలి విడత చర్చల్లో ససేమిరా అన్న రైతులు
మలి విడత చర్చల్లో
భయం భయంగా ఓకే చెప్పిన కర్షకులు
పోలవరం :పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులను ఏదో రకంగా ప్రారంభించాలన్న ఉద్దేశంతో అధికారులు రైతులపై ఒత్తిడి పెంచారు. మెడపై కత్తి పెట్టిన చందంగా రియల్ ఎస్టేట్ ముఠాల తరహాలో భూముల స్వాధీనానికి సమాయత్తమయ్యారు. పూర్తి నష్టపరిహారం చెల్లించాకే భూములిస్తామని రైతులు తెగేసి చెప్పినా.. అధికారులు ససేమిరా అన్నారు. ముందుగానే భూముల్ని స్వాధీనం చేయాలని, 65 రోజుల తరువాత పరిహారం చెల్లిస్తామంటూ మెలిక పెట్టారు. రైతులు మొదటి దీనికి అంగీకరించకపోయినా.. అధికారుల బలవంతంపై చివరకు మెట్టు దిగిరాక తప్పలేదు. పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి భూములు ఇచ్చిన రైతులతో జంగారెడ్డిగూడెం ఆర్డీవో ఎస్.లవన్న పోలవరంలోని సుజల సాగర అతిథి గృహంలో మంగళవారం చర్చలు జరిపారు.
తొలుత చర్చలు విఫలమయ్యాయి. పరిహారం చెల్లింపు విషయంలో ఆర్డీవో లవన్న మొదట ఒకరకంగా, ఆ తరువాత మరో రకంగా మాట్లాడటం రైతులను ఆందోళనకు, అనుమానాలకు గురి చేసింది. ముందుగా భూములు ఇస్తారనే ఉద్దేశంతోనే ఎకరానికి రూ.19.53 లక్షల చొప్పున ఇచ్చేలా నిర్ణయించామన్నారు. లేదంటే 60 రోజుల తరువాత అప్పటి ధరను బట్టి చెల్లిస్తామన్నారు. తక్షణమే భూములు అప్పగించిన రైతులకు వారం రోజుల్లో ఎకరానికి రూ.17 లక్షల చొప్పున చెల్లిస్తామని, ఆ తరువాత మిగిలిన రూ.2.53 లక్షలు ఇస్తామని అన్నారు. ఇందుకు రైతులు అంగీకరించాలని ఒత్తిడి చేశారు. తొలివిడతగా ప్రభుత్వం ఇచ్చే రూ.17 లక్షలతోపాటు మిగిలిన రూ.2.53 లక్షలను ప్రాజెక్ట్ నిర్మిస్తున్న కాంట్రాక్ట్ ఏజెన్సీ ద్వారా ఇప్పించాలని కోరారు.
ఆ తరువాత సర్కారు ఇచ్చే రూ.2.53 లక్షలను కాంట్రాక్ట్ సంస్థకు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు. ఇందుకు కాంట్రాక్ట్ ఏజెన్సీ ప్రతినిధులు నిరాకరించారు. దీంతో మిగిలిన రూ.2.53 లక్షలకు సంబంధించి లేఖ ఇస్తానని ఆర్డీవో చెప్పడంతో ఒక దశలో రైతులు అంగీకరించారు. ఆ తరువాత ఆర్డీవో ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. వెంటనే మాట మార్చారు. భూములను వెంటనే అప్పగించి పనులు చేసుకునేందుకు అంగీకరిస్తే ఎకరానికి రూ.13.53 లక్షల చొప్పున ధర చెల్లిస్తామమన్నారు. దీంతో రైతులు వారం రోజుల్లో రూ.17 లక్షలు ఇస్తామని చెప్పి ఇలా మాట మార్చడం సరికాదన్నారు. ఇప్పటికే తమకు ఎన్నో అనుమానాలున్నాయని, ఈ పరిస్థితుల్లో మాట మార్చడం మరిన్ని అనుమానాలకు తావిస్తోందంటూ సమావేశం నుంచి లేచి వెళ్లిపోయారు.
చివరకు ఓకే అన్న రైతులు
మంగళవారం పొద్దుపోయిన తరువాత పోలవరంలోని నూతనగూడెంలో మరోసారి సమావేశం నిర్వహించగా, బుధవారం నుంచి భూములు ఇచ్చేందుకు రైతులు సంసిద్ధత వ్యక్తం చేశారు. రైతులు భూములిచ్చిన తరువాత 65వ రోజున ఎకరానికి రూ.19.53 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించే విధంగా ఆర్డీవో ఎస్.లవన్న లిఖిత పూర్వకంగా లేఖ ఇచ్చేందుకు అంగీకరించడంతో రైతులు దిగివచ్చారు.
సొమ్ము చెల్లించని పక్షంలో 66వ రోజు నుంచి పనులు నిలిపివేసుకోవచ్చని ఆర్డీవో రైతులతో అన్నారు. సమావేశంలో తహసిల్దార్ ఎం.ముక్కంటి, పోలవరం, పట్టిసీమ గ్రామాలకు చెందిన రైతులు తైలం శ్రీరామచంద్రమూర్తి, కన్నూరి రాము, పాశాల రవి, కర్రి వెంకటేశ్వరరావు, పసుపులేటి రాంబాబు, కుడిదాల వెంకటేశ్వరరావు, బండి కృష్ణ, 50 మంది రైతులు, కాంట్రాక్ట్ ఏజెన్సీ ప్రతినిధులు పాల్గొన్నారు.
‘రియల్’ మార్కు దందా
Published Wed, Apr 22 2015 4:34 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement