రీ సర్వే చేస్తేనే ముంపు లెక్క!
Published Tue, Jul 4 2017 12:50 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
పోలవరం ముంపు నిర్వాసితుల నుంచి పెరుగుతున్న డిమాండ్
సాక్షి, హైదరాబాద్: ఏపీ ప్రభుత్వం చేపడుతున్న పోలవరం ప్రాజెక్టుతో తెలంగాణలో ఉండే ముంపుపై కొత్తగా సమగ్ర సర్వే చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది. ప్రాజెక్టుతో ఉండే ముంపుపై ఉమ్మడి రాష్ట్రంలో చేసిన సర్వేకు, వాస్తవ పరిస్థితులకు చాలా వ్యత్యాసముందని నిర్వాసిత ప్రాంతాల ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇటీవలే బూర్గంపహాడ్‌లోని ముంపు గ్రామాల పరిధిలో నీటి పారుదల శాఖ అధికారుల పర్యటనలో అక్కడి రైతులు ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఇదే డిమాండ్ మరో 8 మండలాల్లోని గ్రామాల నుంచి వినబడుతోంది.
100 గ్రామాలకు ముంపు ముప్పు..
ఏపీ చేపట్టిన పోలవరం ప్రాజెక్టుతో ఒడిశా, చత్తీస్‌గఢ్‌ల కంటే తెలంగాణపైనే ముంపు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. గతంలో తెలంగాణ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కు సమర్పించిన అఫిడవిట్ ప్రకారం.. భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, వాజేడు, వెంకటాపురం, బూర్గంపహాడ్, మణుగూరు, అశ్వాపురం, పినపాక మండలాల్లో సుమారు 100 గ్రామాలు బ్యాక్‌వాటర్‌లో మునిగే అవకాశాలున్నాయి. శబరి, కిన్నెరసాని, ఇంద్రావతి, ప్రాణ హిత నదులు కూడా బ్యాక్‌వాటర్‌లో మునిగే ప్రమాదం ఉంది. భద్రాచలం దేవాలయంతో పాటు పట్టణం, మరో వంద గ్రామాలు ముం పునకు గురయ్యే ప్రమాదముంది. దీంతో బూర్గంపహాడ్ మండల పరిధిలోని సంజీవరెడ్డి పాలెం, నాగినేనిప్రోలు, సారపాక, మో తె, రెడ్డిపాలెం, ఇరవెండి గ్రామాల్లో ఆందోళన మొదలైంది. ప్రాజెక్టు ముంపుపై తెలంగాణ సమగ్ర సర్వే చేస్తేనే వాస్తవ ముంపు తెలుస్తుందనే డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు.
Advertisement