గణప సముద్రం చెరువు
గణపురం/గణప సముద్రం నుంచి ‘సాక్షి’ప్రత్యేక ప్రతినిధి: గణపురం ప్రాజెక్టు మెతుకు సీమలో ఉంది. గణప సముద్రం పాలమూరు జిల్లాలో. ఈ రెండు జల సాగరాలకు ఓ చారిత్రాత్మక నేప థ్యం ఉంది. గణప సముద్రాన్ని కాకతీయులు తవ్వించారు. కానీ ఈ చెరువు ఒక్కసారి కూడా నిండలేదు. మంజీరా నది మీద గణపురం ఆనకట్టను నిజాం నవాబు కట్టించారు. ఇప్పటి వరకు 10 వేల ఎకరాలకు సాగు నీళ్లు అందలేదు. తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం రెండు జలాశయాలను నింపింది. నీటిపారుదల మం త్రి హరీశ్‌రావు పట్టుబట్టి గణపురం ఆనకట్టకు 3.5 టీఎంసీల నీళ్లు ఇచ్చి బీడుభూముల్లోకి మళ్లించారు. కేవలం 11 నెలల 3 రోజుల రికార్డు సమయంలో కేఎల్‌ఐ బ్రాంచ్ కెనాల్ పూర్తి చేసి గణప సముద్రం చెరువును నింపారు. ఈ ఏడాది గణపురం ఆనకట్ట కింద 90 వేల టన్నుల ధాన్యం ఉత్పత్తి కాగా, గణప సముద్రం చెరువు కింద వచ్చే సీజన్‌లో 3 వేల ఎకరాల్లో సాగు చేసేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.
గణపురం ఆనకట్ట చరిత్ర ఇదీ...
22 వేల ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా 0.2 టీఎంసీల నిల్వ నీటి సామర్థ్యంతో మంజీర నది మీద గణపురం ఆనకట్టను కట్టారు. మెదక్ జిల్లా పాపన్నపేట, కొల్చారం మండలాల మధ్య మంజీరా నదిపై గణపురం 1905లో మహారాజా బహదూర్ యామిన్ అజ్ సుల్తాన్ ఆనకట్ట నిర్మాణం ప్రారంభించారు. ఆనకట్టకు రెండు కాల్వలు ఏర్పాటు చేసి ఒకదాని పేరు మహబూబ్ నహర్ కెనాల్ అని, దాని కింద కొల్చారం, మెదక్ మండలాలు, మరో కాల్వకు ఫతేనహర్ కెనాల్ అని పేరు పెట్టారు. రెండు కాల్వలకు కలుపుకొని సుమారు 22,750 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. కానీ 113 ఏళ్ల కాలంలో ఎన్నడూ 10 వేల ఎకరాలకు మించి సాగు నీళ్లు అందలేదు. సింగూరు రిజర్వాయర్ కట్టిన తరువాత హైదరాబాద్ తాగునీటి కోసం గణపురం ప్రాజెక్టును ఎండబెట్టారు.
రైతులు ధర్నాలు, రాస్తారోకోలు చేయగా.. అతి కష్టం మీద 0.6 టీఎంసీల నుంచి ఒక్క టీఎంసీ లోపు నీళ్లను మాత్రమే గణపురం ప్రాజెక్టుకు ఇచ్చేవారు. ఇందులో సగం నీళ్లు నిజాం సాగర్‌లోకే వెళ్లిపోయేవి. దీంతో ఐదారు వేల ఎకరాలకు మించి భూములకు నీళ్లు అందేవి కావు. కాల్వల కింద భూములు ఉన్నప్పటికీ రైతులు బీడు పెట్టి బతుకుదెరువు కోసం వలస పోయేవాళ్లు. గణపురం ఆనకట్ట కింద ఉన్న ప్రతి ఎకరాకు ఈ రబీలో నీళ్లు అందిస్తామని, రైతులు ప్రభుత్వం మీద నమ్మకం ఉంచి పంటలు వేసుకోవాలని హరీశ్‌రావు రైతులకు విజ్ఞప్తి చేస్తూ వచ్చారు. అన్నట్టుగానే ఈ ఏడాది రబీ పంటలకు సింగూ రు నుంచి 11 విడతలుగా 3.5 టీఎంసీల నీటిని విడుదల చేశారు. మంజీరా నది నుంచి రైతులు పైప్ లైన్లు వేసుకోవడం, ఇతర బోర్ల సహాయంతో ఆనకట్ట పరిధి కింద ఈ రబీలో 30 వేల ఎకరాల్లో వరి పంట సాగులోకి వచ్చింది.
కాకతీయులు తవ్వారు..హరీశ్ నింపారు
పాత పాలమూరు జిల్లాలో ఓ మూలకు ఎక్కడో విసిరేసినట్లుండే ఖిల్లా గణపురంలో గణప సముద్రం ఉంది. కాకతీయుల కాలంలో 12వ శతాబ్దం చివరిలో నిర్మాణం మొదలు పెట్టి, 13 వ శతాబ్దం తొలి పాదం వరకు పూర్తి చేసినట్లు చరిత్ర చెప్తోంది. 3 కిలోమీటర్ల పొడ వు, 29 అడుగుల ఎత్తుతో చెరువును కట్టారు. దీని నిర్మాణానికి 34 ఏళ్లు పట్టిందని చరిత్రకారులు చెబుతుంటారు. అప్పటి నుంచి ఈ చెరువు నిండిన దాఖలాలు లేవు . ప్రతాప రుద్రుని కాలంలో ఒకసారి చెరువు మత్తడి దుమికినట్టు చెబుతున్నారు. 1984లో కురిసిన వర్షాలకు చెరవు నల్లమట్టి వరకు నిండినట్లు నీటిపారుదల శాఖ నివేదికలు వెల్లడిస్తున్నాయి. పాలమూరు పర్యటనకు వెళ్లిన హరీశ్‌రావును ఖిల్లా గణపురం రైతాంగం కలసి, గణప సముద్రానికి నీళ్లివ్వాలని అభ్యర్థించగా.. ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మంగనూర్ జీరో పాయింట్ నుంచి గణపురం బ్రాంచ్ కెనాల్ ద్వారా గణప సముద్రం నింపారు. 600 ఏళ్ల తరువాత చెరువు నిండటం ఇదే తొలిసారి అని చెబుతున్నారు. చెరువు నిండటంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూగర్భ జలసంపద కూడా అనూహ్యంగా పెరిగింది. గణప సముద్రం పరిసర ప్రాంతాల్లోని దాదాపు 200 బోర్లు రీ చార్జ్ అయ్యాయి. చెరువు నిండటంతో వలస వెళ్లిన చిన్న సన్నకారు రైతులు తిరిగి గ్రామానికి చేరుకుంటున్నారు.
చాలా ఏళ్ల తర్వాత రబీలో పంటలు
ఈ సారి మంచి పంట పండింది. నీళ్లు నిజంసాగర్, శ్రీరాం సాగర్‌కు వెళ్లినప్పుడల్లా కుర్తివాడ రైతులకు లాభం అయింది. చాలా ఏళ్ల తర్వాత రబీలో దండిగా పంటలు పండాయి.
– పూజారి యాదగిరి, రైతు, కుర్తివాడ
Comments
Please login to add a commentAdd a comment