బాపట్ల (గుంటూరు జిల్లా) : సాగు, తాగు నీరు విడుదల చేయాలని ఎన్నిసార్లు విన్నవించినా ఇదిగో అదిగో అంటూ అధికారులు మోసగిస్తున్నారని రైతన్నలు మండిపడ్డారు. ఎండుతున్న పంటలకు నీరందిస్తారా.. ఆత్మహత్యలు చేసుకోమంటారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా బాపట్ల మండలంలో మంగళవారం ఎర్రటి ఎండలో గుంటూరు-చీరాల రోడ్డుపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు.
బాపట్ల మండలం పూండ్ల, గోపాపురం, మర్రిపూడి, గుడిపూడి, భర్తీపూడి, ఈతేరు, ఇటుకంపాడు గ్రామాల రైతులు సాగు, తాగునీరు విడుదల చేయాలని బాపట్లలోని ఇరిగేషన్ డీఈ కార్యాలయం వద్ద ఈనెల 23న ఆందోళన చే శారు. దీంతో అధికారులు వెంటనే నీరు విడుదల చేయిస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత పట్టించుకోలేదు. దీంతో మంగళవారం ఉదయం 11 గంటల నుంచి ఆయా గ్రామాల రైతులు ట్రాక్టర్లు వేసుకుని పోరుబాట పట్టారు. రోడ్డుకు అడ్డుగా ముళ్లకంపలు, ట్రాక్టర్లు పెట్టిన నిరసన చేపట్టారు. ట్రాఫిక్‌భారీగా నిలిచిపోవటంతో అక్కడికి చేరుక్ను స్థానిక పోలీసులు ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా సహకరించాలని రైతులను కోరారు.
తాము నీటి కోసం అష్ట కష్టాలు పడుతుంటే ఎవరు పట్టించుకోవటం లేదని వాపోయారు. ప్రతిసారి రైతులకు నీళ్లిస్తామని అధికారులు మోసం చేస్తున్నారని, స్పష్టమైన హామీతోపాటు కొమ్మమూరు కాలువకు నీరు వదిలేవరకు ఇక్కడ నుంచి కదలబోమని పట్టుబట్టారు. ఈ సమయంలో రైతులకు, పోలీసులు అధికారులకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. ఇరిగేషన్ అధికారులతో సంప్రదించి నీరు వదిలేందుకు ప్రయత్నిస్తామని చెప్పి పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేయించారు. తమ గోడు వినేవారు లేకపోవడంతో అన్నదాతలు వెనుదిరిగారు.
నీటి కోసం రోడ్డెక్కిన రైతులు
Published Tue, Oct 27 2015 6:42 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
Advertisement