పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని తక్షణం నిలిపివేయాలి
పోలవరం ప్రాజెక్ట్‌ను నిర్లక్ష్యం చేస్తే సహించం
వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు
పోలవరం :ఉభయ గోదావరి జిల్లాల రైతుల, ప్రజల నోట్లో మట్టికొట్టే పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు డిమాండ్ చేశారు. మంగళవారం పట్టిసీమ శివక్షేత్రం రేవులోని సత్రంలో నిర్వహించిన పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేసే వరకూ రైతులతో కలసి వైఎస్సార్ సీపీ ఉద్యమిస్తుందని చెప్పారు. ఈ నెల 26న పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శాసన సభ్యులతో కలిసి బస్సులో పోలవరం ప్రాజెక్ట్‌ను, పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలిస్తారన్నారు.
ప్రధానంగా ఎత్తిపోతల పథకాన్ని నిలుపుదల చేయడంతోపాటు పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలనే డిమాండ్‌తో జగన్‌మోహన్‌రెడ్డి ఈ పర్యటన చేస్తున్నారన్నారు. రైతులు, డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాల మాఫీ, అంగన్‌వాడీల సమస్యలపై అసెంబ్లీలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడితే ప్రభుత్వం విపక్షం గొంతునొక్కిందన్నారు. వైఎస్సార్ సీపీ అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ అయినప్పటికీ మాట్లాడేందుకు తగిన సమయం కేటాయించలేదన్నారు. పైగా సభ్యులను సస్పెండ్ చేయడం అన్యాయమన్నారు. రైతుల నుంచి భూమి తీసుకునేప్పుడు అధికారులు ఒక రకంగా, భూమి తీసుకున్నాక మరో రకంగా మాట్లాడతారన్నారు.
పట్టిసీమలో భూములు కోల్పోయే వారంతా చిన్న, సన్నకారు రైతులని, వారందరికీ వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని చెప్పారు. జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనకు పెద్దఎత్తున రైతులు తరలివచ్చి సమస్యలు చెప్పుకోవాలన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన ద్వారానే రైతులకు న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. పట్టిసీమ వద్ద వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో రైతుల ముఖాముఖి ఏర్పాటు చేస్తామన్నారు. అక్కడి నుంచి పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు జగన్ వెళతామన్నారు. పోలవరం పనులు జరుగుతుండగా పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మించడం పొరపాటు అని ఈ పొరపాటును ప్రభుత్వం సరిదిద్దుకుని రైతులకు న్యాయం చేయాలన్నారు. కృష్ణా జిల్లాకు నీరు తీసుకువెళ్లవద్దనటం లేదని, పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తే కృష్ణాతోపాటు గుంటూరు, రాయలసీమ జిల్లాలకూ నీరందించే అవకాశం ఏర్పడుతుందని తెలిపారు.
పోలవరం ప్రాజెక్ట్‌ను నిర్లక్ష్యం చేసేందుకే..
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్ట్‌ను ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం చేస్తూ పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తున్నారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షుడు తెల్లం బాలరాజు విమర్శించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టిసీమ నిర్మాణాన్ని రైతులు వ్యతిరేకిస్తున్నా, ఉద్యమాలు చేస్తున్నా ప్రభుత్వం మొండి వైఖరితో పట్టిసీమ పథకాన్ని నిర్మిస్తామనడం తగదన్నారు. పట్టిసీమ నిర్మాణంలో అసెంబ్లీలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పోరాడుతుంటే అధికార ఎమ్మెల్యేలు ఆయనపై వ్యక్తిగత దూషణకు అధికార పార్టీ పాల్పడటం దుర్మార్గమన్నారు. ప్రజల వద్దకు వచ్చి రైతుల కోసం పోరాటం చేసేందుకు జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారన్నారు.
పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందన్నారు. ఎత్తిపోతల పథకం నిర్మాణానికి రైతులు ఒక్క సెంటు భూమి కూడా ఇవ్వొద్దన్నారు. రైతులు ఎప్పుడు పిలిచినా తాము వస్తామన్నారు. అధిక సంఖ్యలో రైతులు తరలివచ్చి జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలన్నారు. పార్టీ ఉంగుటూరు నియోజకవర్గ కన్వీనర్ పుప్పాల వాసుబాబు మాట్లాడుతూ రైతులకు భరోసా ఇచ్చేందుకే జగన్‌మోహన్‌రెడ్డి పట్టిసీమకు వస్తున్నారన్నారు.
చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని ఇప్పటికీ పూర్తి చేయలేదని, ఈ పరిస్థితుల్లో పట్టిసీమ పథకం చేపట్టడం శుద్ధ దండగ అని అన్నారు. సమావేశంలో పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజు, పార్టీ ప్రధాన కార్యదర్శి కారుమూరి నాగేశ్వరరావు, తానేటి వనిత, పోల్నాటి బాబ్జి, ఆరేటి సత్యనారాయణ, తాడికొండ మురళీకృష్ణ, ముప్పిడి సంపత్‌కుమార్, ఇళ్ల భాస్కరరావు, తలారి వెంకట్రావు, సీహెచ్ వీరయ్య, కారుమంచి రమేష్, పి.శ్రీలక్ష్మి, వందనపు సాయిబాలపద్మ, ఎస్‌ఎస్ రెడ్డి, సయ్యద్ బాజీ, గద్దే వీరకృష్ణ, సుంకర వెంకటరెడ్డి, బుగ్గా మురళీకృష్ణ, వలవల సత్యనారాయణమూర్తి, పాతాళ సుబ్బారావు, దాకే మంగాయమ్మ, షేక్ పాతిమున్నీషా పాల్గొన్నారు. అనంతరం పోలవరంప్రాజెక్టు పనులను కొత్తపల్లి, పార్టీ నాయకులు పరిశీలించారు.
ఇక రణమే
Published Wed, Mar 25 2015 3:57 AM | Last Updated on Mon, Aug 20 2018 6:35 PM
Advertisement
Advertisement