
కరెంటు కోతలపై రోడ్డెక్కిన రైతులు
కరెంటు కోతలపై పాలమూరులో కన్నెర్ర
హైదరాబాద్-కర్నూలు హైవే దిగ్బంధం
విద్యుత్ సబ్‌స్టేషన్‌కు తాళం
అలంపూర్, న్యూస్‌లైన్: కరెంటు కోతలపై పాలమూరు రైతులు కన్నెర్రజేశారు. శనివారం 200 మందికి పైగా రైతులు మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్ చౌరస్తాలోని హైదరాబాద్-కర్నూలు జాతీయ రహదారిని దిగ్బంధించారు. మారమునగాల, అలంపూర్, కాశీపురం, సింగవరం, కంచుపాడు తదితర గ్రామాల రైతులు ఇందులో పాల్గొన్నారు. కరెంటు కోతలతో తాము పడుతున్న కష్టాలను పట్టించుకుంటున్న వారే లేరంటూ మండిపడ్డారు. ‘‘వారం రోజులుగా ప్రయత్నించినా ఒక్క విద్యుత్ అధికారీ రాలేదు. ఫోన్ చేస్తే కార్యాలయానికి రండి, మాట్లాడుకుందామన్నారు.
తీరా మేం వెళ్లేసరికి ఉడాయించారు’’ అంటూ దుమ్మెత్తిపోశారు. లక్షలు పోసి పంటలు సాగు చేస్తున్నామని, నీళ్లున్నా కరెంటు కోతలతో ఏమీ చేయలేకపోతున్నామని ఆవేదన వెలిబుచ్చారు. అయితే వారు మండుటెండల్లో గంటకు పైగా రోడ్డుపై బైఠాయించినా ఒక్క విద్యుత్ అధికారీ రాలేదు. దాంతో రైతులు మరింతగా ఆగ్రహించారు. జాతీయ రహదారిని ముట్టడించేందుకు పదేపదే యత్నించారు. దాంతో హైవేపై వాహనాలు బారులు తీరాయి. కరెంటు సిబ్బందితో మాట్లాడిస్తామని పోలీసులు హామీ ఇచ్చినా వారు రాలేదు. చివరకు పోలీసులే కొందరు రైతులను తీసుకుని కర్నూలు వెళ్లారు. అంతకుముందు అలంపూర్ సబ్‌స్టేషన్ చేరుకున్న రైతులు, అక్కడ ఏఈ అందుబాటులో లేకపోవడంతో కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు. ఏడీఈ కోసం అలంపూర్ చౌరస్తా చేరుకున్నారు. విషయం తెలిసి ఆయన జారుకోవడంతో మరింతగా ఆగ్రహించారు. విద్యుత్ సబ్‌స్టేషన్ నుంచి సరఫరా నిలిపివేయించారు.