
రైతన్నల్లో చిగురాశలు
- రుణమాఫీపై ఎదురుచూపులు
- కొత్తసర్కారు నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ
పాలమూరు, న్యూస్‌లైన్: వాతావరణ ప్రతికూల పరిస్థితులు...దీనికి తోడు విద్యుత్ కోతలు...చేతికందిన దిగుబడికి సరైన ధరలు దక్కకపోవడం...ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటూ అప్పుల ఊబిలో కూరుకుపోయి కుదేలవుతున్న రైతన్నల్లో కొత్త సర్కారు నిర్ణయంపై చిగురాశలు మొలకెత్తాయి. రుణమాఫీతో తమ కష్టాలు గట్టెక్కుతాయని వారు ఎదురు చూస్తున్నారు. కొత్త రాష్ట్రంలో సీఎంగా కేసీఆర్ మొదటి సంతకం దీనిపైనే చేయనున్నారు. ఆ శుభఘడియ కోసం వారంతా నిరీక్షిస్తున్నారు. సంబంధిత లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేయాల్సి ఉండటంతో అధికారులు సైతం మార్గదర్శకాల కోసం ఎదురు చూస్తున్నారు.
2008లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో రుణమాఫీ వల్ల జిల్లాలోని రైతాంగం అధిక శాతం లబ్ధి పొందారు. వడ్డీలతో కలిపి జిల్లాలో రూ.3 వేల కోట్ల పైబడి పంట రుణాల మాఫీ వల్ల రైతులకు ప్రయోజనం కలిగే అవకాశం ఉంటుంది. జిల్లాలో ఎనిమిది లక్షల మంది రైతులు 350 బ్యాంకుల ద్వారా రుణాలు పొందారు.
నాలుగేళ్లుగా రకరకాల కారణాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు రూ.3వేల కోట్ల రుణాలు బకాయిలున్నట్లు బ్యాంకర్లు చెబుతున్నారు. అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ పరిస్థితుల్లో రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే మాఫీ విధి విధానాలు ఎలా ఉంటాయోనన్న అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. రుణమాఫీపై మార్గదర్శకాలు ఒకట్రెండు రోజుల్లో వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
సక్రమంగా చెల్లించిన వారికే...
జిల్లాలో సక్రమంగా చెల్లించిన వారికి మాత్రమే ఈసారి రుణ మాఫీ వర్తింప చేయాలని మెజారిటీ రైతులు కోరుతున్నారు. మరోసారి ప్రభుత్వం మొండి బకాయిలు మాఫీ చేస్తే క్రమం తప్పకుండా చెల్లించిన వారు కూడా మొండిబకాయిదారులుగా మారే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. ఇది పంట రుణప్రణాళికకు దెబ్బపడే అవకాశం ఉందంటున్నారు.
ఎప్పటి నుంచి అమలు చేస్తారో..?
రుణమాఫీ ఏ తేదీ నుంచి అమలు చేస్తారన్నది ఎవరూ చెప్పలేకపోతున్నారు. కొందరు అధికారులు వడ్డీలేని రుణాలకు ముందున్న బకాయిలను మాఫీ చేస్తారంటున్నారు. మరికొందరు కొత్త రాష్ట్రంలో రైతులకు ఎలాంటి రుణం లేకుండా చేసి, రుణ విముక్తిని చేస్తారని పేర్కొంటున్నారు. రబీ రుణాల వరకు పూర్తిగా మాఫీ చేసే అవకాశం ఉందని ఆశిస్తున్నారు. అధికారులు మాత్రం అన్ని రకాల రుణాల బకాయిదారుల జాబితాలను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు.